ఆర్థిక దిగ్బంధంలో ఉద్యోగస్తులు, పెన్షనర్లు

ABN , First Publish Date - 2022-12-16T01:36:59+05:30 IST

కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధులు, సలహాదారులు, కన్సల్టెన్సీల వేతనాలు ఠంచనుగా ఒకటో తేదీ బ్యాంకు అకౌంట్లలో చేరిపోతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు...

ఆర్థిక దిగ్బంధంలో ఉద్యోగస్తులు, పెన్షనర్లు

కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధులు, సలహాదారులు, కన్సల్టెన్సీల వేతనాలు ఠంచనుగా ఒకటో తేదీ బ్యాంకు అకౌంట్లలో చేరిపోతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు బటన్ నొక్కగానే నగదు అందుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థాయికి చేరడం దురదృష్టకరం. కొన్ని శాఖల ఉద్యోగులపై ఒకటో తేదీ అభిమానం చిలకరించారు. అంటే రాష్ట్రమంతా ఒక యూనిట్ గా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల మధ్య కనిపించని విభజన రేఖను గీశారు.

చెప్పకనే సగటు ఉపాధ్యాయులపై అవిశ్వాసం ప్రకటించింది ప్రభుత్వం. విచిత్రంగా ఉపాధ్యాయులకు నవంబర్ జీతాలు ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో జమ కాలేదు. దీంతో వేలాది కుటుంబాల్లో ఆర్థిక దిగ్బంధనం ఏర్పడింది. కేవలం జీతాలపైనే జీవితాలను వెళ్లదీస్తున్న కుటుంబాల్లో పొయ్యిలో పిల్లి లేవని స్థితి ఉంది. ఇటీవలి కాలంలో ఒకటో తేదీ అంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు. కారణం కూటికి, గుడ్డకు సంబంధించిన అంశమే కాదు. గతకాలపు అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీ. సకాలంలో చెల్లించకపోతే పరువు నష్టం సమస్య. ఇల్లు గడవాలంటే జీతమే ఆధారం కావడం. ఆయా ఉద్యోగులపై ఒకరికి నలుగురు ఆధారపడి ఉండటం. ప్రభుత్వోద్యోగి అంటే ఒకప్పుడు సమాజంలో మర్యాద, మన్నన ఉండేది. ఇప్పుడా పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వోద్యోగులకు అప్పు పుట్టని స్థాయికి చేరింది. ఒక చులకన భావం ఆయా వ్యక్తుల చుట్టూ ఆవర్తనంలా ఆవరించింది. కొన్ని సందర్భాల్లో కుటుంబ అవసరాలు తీరక ఆయా కుటుంబాలు నవ్వుల పాలవుతున్నాయి. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ తటస్థించలేదు.

010 హెడ్ లేనప్పుడు కూడా ఒక్క మార్చి నెల జీతం తప్ప. ఏప్రిల్ నెల జీతాన్ని ఏప్రిల్ 24నే (పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మరుసటి రోజు) చెల్లించేవారు. అంటే ఏప్రిల్ నెలలో 20 రోజుల తేడాతో రెండు జీతాలు అందుకునేవారు. ముందస్తు ఆడిట్ ఉన్న మునిసిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మాత్రమే వేతనాల చెల్లింపులో కొద్దిగా జాప్యం జరిగేది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చివరి పనిదినం రోజున వారికి రావలసిన సమస్త ప్రయోజనాలను అందజేసి, చివరకు పెన్షన్ పేపర్లు సైతం చేతిలో పెట్టి సాదరంగా ఇంటికి పంపే ఆనవాయితీ ఉండేది. అదొక మర్యాద. అది ఆనాడున్న రాజనీతి. ఆనాడు పాలకులకు ఉద్యోగులపై ఉన్న గౌరవం. ఉద్యోగులను ఎంతగా ఆదరించారో చెప్పనలవి కాదు.

1956 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగస్వామ్యానికి పాలకులు అగ్రాసనం వేశారు. తదనుగుణంగానే ఉద్యోగులు స్వేచ్ఛగా స్వామి భక్తితో పని చేశారు. ప్రజలకు సేవలను కొనసాగించారు. వృత్తిరీత్యా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి నేరుగా చొరవ చూపేవారు. సంఘాల నాయకులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రజల నాడిని, ప్రజా సమస్యలను పత్రికల్లో వచ్చే వార్తల ద్వారా కూడా స్వీకరించేవారు. అందుకోసం సమాచార, పౌర సంబంధాలశాఖ ఉండేది. పత్రికలలో మూడు సెంటీమీటర్ల సింగిల్ కాలమ్ వార్త వచ్చినా విచారణ జరిపించే సంస్కృతి ఉండేది. బాధ్యులపై తక్షణ చర్యలుండేవి. బాధితులకు సత్వర న్యాయం జరిపించేవారు. మధ్యవర్తులు, సలహాదారుల పెత్తనం అసలు ఉండేది కాదు. సంఘాల నేతలు అనుసంధానకర్తలుగా ఉండి స్తబ్దతను తొలగించేవారు. పీఆర్సీ చర్చలకు సైతం కాలయాపన ఉండేది కాదు. పాతికో పరకో ఎంతో కొంత తేల్చి ఉత్తర్వులను ఒకేసారి జారీచేసేవారు.

కానీ ఇప్పుడు కాలం తలకిందులైంది. ప్రతి విషయాన్ని సమస్యగా చూపుతున్నారు. సున్నితమైన అంశాలు కూడా వివాదాస్పదం చేస్తున్నారు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు వాయిదాల పర్వం కొనసాగుతున్న అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. చివరకు బాండ్లు ఇచ్చే సంస్కృతి ఆరంభమైంది. పదవీకాలం పూర్తయిన వారి చెల్లింపులకు నిధులు లేక ఉద్యోగ విరమణ వయసును సైతం పెంచుకుంటూ పోవడం ఇటీవల కాలపు పాలకులకు ఆనవాయితీ అయింది. తమ సమస్యలను ప్రస్తావించడానికి కూడా అవకాశం లేదు. ఆందోళనలు చేస్తే ఇంటిదగ్గరే అరెస్టు చేస్తున్నారు. పని చేస్తున్న చోటనే అదుపులోకి తీసుకొంటున్నారు. కనీసం స్వాతంత్య్రం సాధించుకున్న మార్గంలో ఒక ధర్నా చేసే వీలు లేని పాశవిక విధానాలకు పాలకులు అంకురార్పణ చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఐక్య ఉద్యమాలు చేయాలి.

యం. సురేష్ బాబు

Updated Date - 2022-12-16T01:37:02+05:30 IST