మూర్తీభవించిన రాజకీయచతురత

ABN , First Publish Date - 2022-12-03T00:50:49+05:30 IST

తెలుగు ప్రజలు కొణిజేటి రోశయ్య రూపంలో ఒక గొప్ప నాయకుడిని కోల్పోయి ఏడాదయింది. రోశయ్య రాజనీతిజ్ఞుడు, రాజకీయ చతురుడు. ఆయనెప్పుడూ పదవులను ఆశించలేదు...

మూర్తీభవించిన రాజకీయచతురత

తెలుగు ప్రజలు కొణిజేటి రోశయ్య రూపంలో ఒక గొప్ప నాయకుడిని కోల్పోయి ఏడాదయింది. రోశయ్య రాజనీతిజ్ఞుడు, రాజకీయ చతురుడు. ఆయనెప్పుడూ పదవులను ఆశించలేదు, పదవి వరించినప్పుడు పొంగిపోనూ లేదు. లభించిన పదవికి న్యాయం చేశారు. ఏ అవినీతి ఆరోపణా ఆయన్ని చుట్టుముట్టలేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేసినవారిలో రోశయ్య ఒకరు. నిండుగా జీవించి, పార్టీలకతీతంగా అందరి మన్ననలూ పొందిన వ్యక్తి. విద్యార్థి ఉద్యమాల నుండి గవర్నర్‌ దాకా అనేక పదవులను సమర్థంగా నిర్వహించి అన్నిచోట్లా తన విధులకు న్యాయం చేశారు. చివరివరకూ ఎవరు వచ్చి అడిగినా వారికి తగిన సలహా ఇచ్చేవారు. ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని, అధికారంలో ఉంటే విపక్షాన్ని వంగ్యోక్తులతో సుతిమెత్తగా ఎండగట్టడంలో ఆయన మేటి. గ్రూపు విభేదాలు, ముఠా తగాదాలతో నిత్యం తలమునకలయ్యే కాంగ్రెస్ పార్టీలో ఏ గ్రూపూ లేకుండా తామరాకుపై నీటిబొట్టు మాదిరి, ఏ మకిలీ అంటకుండా అనేక దశాబ్దాలు వివాదరహితునిగా నెగ్గుకురావడం సామాన్య విషయం కాదు.

నిబద్ధత, కార్యదక్షత, కొండంత ఓర్పు, మాటల నేర్పు, చాతుర్యం ఆయన స్వార్జితం. తెలుగుదనం వెల్లివిరిసే పంచెకట్టు ఆయన రూపం. సామాజిక అంశాలలో నిగూఢమైన మేధావి. ఆర్థిక శాస్త్రవేత్త కాకున్నా, క్రమశిక్షణ గల పొదుపరైన వ్యాపారి. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వద్దనైనా నెంబర్ టు గానే విరాజిల్లారు. ప్రజల తరఫున నాయకుడుగా ప్రాంతాలకు అతీతంగా తన విలువ నిలబెట్టుకున్నారు. కండువా రంగు మార్చని 88 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఎన్నో మజిలీలతో గడిపారు.

అప్పటి గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఆయన జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్ విద్యను అభ్యసించిన ఆయన తనకు ఎంతో ఇష్టమైన ఆర్థికశాఖ మంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించడం విశేషం. ఆర్థికమంత్రిగా 16సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాక, వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన వేర్వేరు మంత్రిత్వ శాఖలు కూడా నిర్వహించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు కానివ్వకుండా ఆర్థికమంత్రిగా ప్రతి రూపాయి జాగ్రత్తగా వినియోగం అయ్యేటట్టు కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా పేరుగాంచిన రోశయ్య రాజకీయ జీవితం ఆ పార్టీతో ప్రారంభం కాలేదు. తొలుత స్వతంత్ర పార్టీ సభ్యుడిగా ఉన్నారు. ఎన్జీ రంగా అంటే ఆయనకు అంతులేని అభిమానం. ప్రకాశం పంతులుగారికి వీరాభిమాని. ఆ తర్వాత రోశయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఆయన రాజకీయ జీవితం సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రోశయ్య అద్భుత పాలనా దక్షుడిగా, ఆర్థికవేత్తగా పేరుగాంచారు. అజాతశత్రువుగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. జాతీయ నాయకుల బహిరంగ సభల ప్రసంగాలను అలవోకగా తేటతెలుగులో అనువదించి ప్రశంసలందుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువకాలం ఆ పదవిలో కొనసాగలేకపోయారు. తర్వాత కర్ణాటక, తమిళనాడు గవర్నర్‌గానూ సేవలందించారు.

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. చట్టసభలలో ఆయన చెణకులు, చురకలు విషయానికే పరిమితం కానీ, వ్యక్తిత్వాలపై గురిపెట్టలేదు కనుక పార్టీలకు అతీతంగా ఆయనకు మిత్రులుండేవారు. అలాగే, పాత్రికేయులతో ఎంతో చనువుగా, స్వేచ్ఛగా వ్యవహరించేవారు. నరిసెట్టి ఇన్నయ్య, తుర్లపాటి కుటుంబరావు, రాఘవాచారి, పొత్తూరి ఇలా అనేకమంది సీనియర్ పాత్రికేయులకు ఆయన ప్రియమిత్రుడు.

రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా అసభ్య పదజాలం ఉపయోగించని ఉదాత్తుడు రోశయ్య. ఏ పదవిలో ఉన్నా ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం చేసేవారు. రాజకీయ విభేదాలు ఉన్నా, సమకాలీన రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు అందరితో కూర్చుని చర్చించి ఏకాభిప్రాయ సాధనకు కృషి చేసేవారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక పుస్తకం రాయాలన్న ఆకాంక్షను ఒక రచయిత ఆయన వద్ద వ్యక్తం చేస్తే, తాను అంత గొప్పవాడిని కాదని, గొప్పవారి జీవిత చరిత్రలు రాస్తే బాగుంటుందని, తన వంటి సామాన్యుడి జీవితం గురించి రాస్తే పెద్దగా ఆసక్తి ఏమీ ఉండదని, దేశం కోసం త్యాగాలు చేసిన, గొప్ప కార్యాలు చేసిన వారి గురించి రాస్తే అవి జనాలకు ఉపయోగపడతాయని చెప్పి ఆ రచయితను పంపి వేశారట. హోదా ఉన్నా, లేకున్నా సంస్కృతీ సంప్రదాయాలు, తెలుగు భాష పరిరక్షణకు విశేష కృషి చేశారు. తెలుగునేల నాలుగు చెరగులా ఎక్కడ సంగీత, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా వీలున్నప్పుడల్లా హాజరవుతూ సాంస్కృతిక రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు.

గత ఏడాది డిసెంబరు 4న ఉదయం బీపీ ఒక్కసారిగా తగ్గిపోయి, కుప్పకూలిన ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుది శ్వాస విడవడంతో, తెలుగునేలపై మూడు తరాలకు వారధిగా, విలువలకు ప్రతీకగా నిలిచిన ఒక ఒక రాజకీయ శిఖరం కూలిపోయింది.

నందిరాజు రాధాకృష్ణ

సీనియర్ జర్నలిస్టు

(రేపు కొణిజేటి రోశయ్య ప్రథమ వర్ధంతి)

Updated Date - 2022-12-03T00:54:02+05:30 IST