టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీ ఉపేక్ష

ABN , First Publish Date - 2022-11-25T02:38:03+05:30 IST

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మనది ఉభయ సభల శాసనవ్యవస్థ. ఎగువ సభ (కేంద్రంలో రాజ్యసభ, రాష్ట్రంలో శాసనమండలి)ల ప్రధాన లక్ష్యం వివిధ రంగాలలో నిపుణులు అయిన వారిని శాసన నిర్మాణంలోనూ...

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీ ఉపేక్ష

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మనది ఉభయ సభల శాసనవ్యవస్థ. ఎగువ సభ (కేంద్రంలో రాజ్యసభ, రాష్ట్రంలో శాసనమండలి)ల ప్రధాన లక్ష్యం వివిధ రంగాలలో నిపుణులు అయిన వారిని శాసన నిర్మాణంలోనూ పాలనా వ్యవహారాలలోనూ భాగస్వాములను చేయడం. ఈ ఎగువ సభలలో మూడో వంతు సీట్ల భర్తీకి ప్రతి రెండేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. వివిధ వృత్తులకు ముఖ్యంగా బోధనా వృత్తికి కీలక ప్రాధాన్యమున్నది. ఈ కారణంగానే ప్రత్యేక ఉపాధ్యాయ నియోజకవర్గాలను రాజ్యాంగ నిర్దేశం మేరకు సృష్టించారు. ఉపాధ్యాయులు అంటే కేవలం ప్రాథమిక పాఠశాలల అయ్యవార్లు, ఉన్నత పాఠశాల టీచర్లు మాత్రమే కాదు, అన్ని వృత్తి విద్యా సంస్థల అధ్యాపకులు కూడా అని తప్పక అర్థం చేసుకోవాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల కింద తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు అను బంధంగా ఉన్న 28 రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కళాశాలలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యా కళాశాలలు వివరాలను 2017 ఫిబ్రవరి 8న జారీ అయిన జీఓఎమ్ఎస్49 విపులంగా వెల్లడించింది. భారత ఎన్నికల సంఘం గత జూలై 14న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ గత అక్టోబర్ 1న జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శాసనమండలి ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న మహబూబ్ నగర్–రంగారెడ్డి– హైదరాబాద్ జిల్లాలలోని ఓటర్ల జాబితాను సరికొత్తగా సిద్ద్ధం చేయనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్లుగా నమోదు చేయించుకునే వారు దరఖాస్తు (ఫామ్ –19)లు సమర్పించేందుకు గడువు నవంబర్ 7. కేంద్ర ఎన్నికల సంఘం 2016 సెప్టెంబర్ 5న జారీ చేసిన సమగ్ర ఆదేశాల ప్రకారం సరికొత్త ఓటర్ల జాబితాను రూపొందించవలసి ఉంది. శాసనమండలిలోని పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికలలో ఓటు వేసేందుకు అర్హత ఉన్నవారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర ఆదేశాలను కచ్చితంగా పాటించి తీరాలి. శాసనమండలి ఎన్నికలలో పాల్గొనే అర్హత ఉన్న నిర్దిష్ట విద్యా సంస్థల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రూపొందించాలి. ఆ జాబితాను, ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొంటున్న ప్రతి అధికారికి పంపి తీరాలి. ప్రత్యేకించిన ఓటర్ల జాబితాను ప్రతి విద్యాసంస్థకు పంపించి తీరాలి. ఆయా విద్యా సంస్థలకు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించి తీరాలి.

అయితే అలా జరిగిందా? లేదు. అర్హమైన విద్యాసంస్థల జాబితాను రూపొందించనే లేదు. ఇక దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఎలా జరుగుతుంది? నిజం చెప్పాలంటే ఇటువంటి సమాచారం కొరవడినందునే సామాన్య ప్రజలు ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజక వర్గాలు రెండూ ఒకటే అని భావిస్తున్నారు. ఓటరుగా నమోదు చేయంచుకోమని అడిగితే ‘ఇప్పటికే నా పేరును నమోదు చేయించుకున్నానని సమాధానమిస్తుంటారు. శాసనమండలికి ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్ల జాబితాను సరికొత్తగా సిద్ధం చేస్తారన్న విషయం తెలియకనే వారు అలా అంటున్నారు. సామాన్యులే కాదు డిగ్రీ కళాశాలల, వృత్తి విద్యా కళాశాలల, సాంకేతిక, వైద్య విద్యా కళాశాలల, న్యాయ, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల అధ్యాపకులు కూడా ఉపాధ్యాయ నియోజకవర్గాలు అనేవి కేవలం పాఠశాల పంతుళ్లకు పరిమితమనే అభిప్రాయంతో ఉన్నారు! ఆశ్చర్యకరమే అయినప్పటికీ ఇది మీరు నమ్మాల్సిన నిజం.

తొలుత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్ట విద్యా సంస్థల జాబితా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు అందగానే ఆయన దానిని ఓటర్ల నమోదు అధికారుల (ఇఆర్ఓ)కు పంపడం జరుగుతుంది. వారు ఆ విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ నుంచి ఉపాధ్యాయ నియోజక వర్గాల ఓటర్లుగా అర్హులైన అధ్యాపకుల, ఉపాధ్యాయుల సమాచారాన్ని సేకరించాలి. అర్హులు అయిన ఉపాధ్యాయులు అందరూ తాము సిద్ధం చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్నారా లేరా అనే విషయాన్ని ఒకటికి రెండుమార్లు నిర్ధారించుకోవడం ఇఆర్ఓల బాధ్యత. ఎవరైనా ఒకరు ఓటర్ల జాబితాలో లేని పక్షంలో సదరు ఉపాధ్యాయుడు లేదా అధ్యాపకుడు పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్స్ ద్వారా అతనికి ఒక అప్లికేషన్ ఫామ్ పంపడం ఇఆర్ఓల విధి.

అర్హులైన ఉపాధ్యాయులు అందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సమగ్ర ఆదేశాలు సముచిత మార్గదర్శకాలు. అయితే ఎన్నికల అధికారులు ఆ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు! ఒక విద్యా సంస్థ హెడ్ జారీ చేసే సర్టిఫికెట్ను సంబంధిత ఓటరు ఉపాధ్యాయుడు లేదా అధ్యాపకుడు అనే విషయాన్ని ధ్రువీకరిస్తుంది. అయితే ఎన్నికల సంఘం అధికారులు దీనితో సంతృప్తిపడడం లేదు. ఆ సర్టిఫికెట్లను కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎన్నికల ప్రక్రియతో ఈయన కేమిటి సంబంధం?) ద్వారా కొన్ని విశ్వవిద్యాలయాల Registrarలకు పంపుతున్నారు. ఎందుకు? సంబంధిత విద్యా సంస్థల హెడ్ లు జారీ చేసిన సర్వీస్ సర్టిఫికెట్లపై వారు మరో సంతకం పెట్టి తీరాలట. అలా వారు సదరు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకులు అర్హులైన ఓటర్లే అని మరోసారి ధ్రువీకరించాలి!

సరే, కొన్ని విశ్వవిద్యాలయాలలో వాకబు చేయగా నవంబర్ 14న సైతం తమకు అలాంటి సమాచారమేదీ అందలేదని సమాధానం వచ్చింది. ఓటరుగా నమోదు చేయించుకునేందుకు చివరి తేదీ నవంబర్ 7 అనే విషయాన్ని విస్మరించకూడదు. ఏమైతేనేం ఈసారి ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఫ్యాకల్టీ అసోసియేషన్లు, స్వతంత్రంగా పోటీ చేస్తున్న కొంత మంది అభ్యర్థుల సహకారంతో దాదాపు 26 వేల మంది ఉపాధ్యాయులు తమ సర్వీస్ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేశారు. వీరిలో కనీసం పది వేల మంది ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న వారే. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి వారు తమ సర్వీస్ సర్టిఫికెట్లను సాధించుకున్నారు. అయితే డిపార్ట్ మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇదే నెలలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం విద్యా సంస్థల హెడ్స్, తమ విద్యాలయాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మళ్లీ సర్వీస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. ఇది చిరాకు కలిగించే పని కదూ?

ఇక విశ్వవిద్యాలయాల Registrar సంతకం విషయం చూద్దాం. ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా ఇంచుమించు 700 కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో హీనపక్షం 30 మంది అధ్యాపకులు ఉన్నా మొత్తం 21,000 సర్టిఫికెట్లపై వీరు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అలాగే జెఎన్ టియుకు అను బంధంగా 150 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో సగటున 100 మంది అధ్యాపకులు ఉంటారు. అంటే మొత్తం 15 వేల సర్టిఫికెట్లు అవసరమవుతాయి. ఇది పూర్తిగా విసుగు పుట్టించే పని కాదూ?

ఇఆర్ ఓలు ఒక సులభ మార్గాన్ని అనుసరించడం సముచితంగా ఉంటుంది. విశ్వవిద్యాలయానికి, ఎఐసిటిఇ అప్ లోడ్ చేసిన ప్రతి కళాశాల ప్రిన్సిపాల్ ఆమోదించిన అధ్యాపకుల జాబితాను సేకరించాలి. ఆ జాబితాలలో ప్రతి ఉపాధ్యయుని యూనిక్ ఐడి నెంబర్ ఉంటుంది. దానిని ఆయా విద్యా సంస్థల హెడ్ లు జారీ చేసిన సర్వీస్ సర్టిఫికెట్లతో సరిచూడాలి. లేదా ఇప్పటికే సమర్పించిన సర్టిఫికెట్లను ఆమోదించి, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కొత్త ఓటర్లను నమోదు చేయాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తన లేఖను ఓయూ, జెఎన్ టియుహెచ్, కాకతీయ, జెఎన్ అండ్ ఎఫ్ ఎ, ఆర్ జియు కెటి, ఎమ్ జియు, పాలమూరు, తెలంగాణ విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఉద్దేశించారు. అయితే తెలంగాణలో మరెన్నో ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో పని చేస్తున్న అధ్యాపకులు అందరూ కూడా ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికలలో ఓటు వేసేందుకు అర్హులే. ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు.

ఈ విషయాలు విశదం చేస్తున్నదేమిటి? ఉపాధ్యాయ నియోజకవర్గాలకు, ముఖ్యంగా మహబూబ్ నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించడంపై ఎన్నికల సంఘం తగు శ్రద్ధ చూపడం లేదనేకాదూ? బహుశా 2023 మార్చిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశమున్నది. అర్హులయిన ఉపాధ్యాయులు అందరూ ఓటర్లుగా నమోదు చేయించుకునేలా వారిని జాగృత పరిచేందుకు ఎన్నికల సంఘం పూనుకోవాలి. అవసరమైతే గడువు పెంచి అర్హులైన అధ్యాపకులు అందరూ ఓటరుగా నమోదు చేయించుకునేందుకు వెసులు బాటు కల్పించాలి.

డాక్టర్ ఎ.వినయ్ బాబు

జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (హైదరాబాద్) రిటైర్డ్ ప్రిన్సిపాల్

Updated Date - 2022-11-25T02:38:03+05:30 IST

Read more