ఉజ్వల గుజరాత్‌లో అభివృద్ధి మాయ!

ABN , First Publish Date - 2022-11-23T01:20:19+05:30 IST

‘గుజరాత్ నమూనా అంటే ఏమనుకుంటున్నారు? అత్యంత ఉన్నత స్థాయిలో రాజకీయ అవినీతి చలామణి కావడమే; మంత్రులు, తంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నుంచి కార్పొరేటర్లు, పోలీసుల వరకు అవినీతి విచ్చలవిడిగా సాగడం...

ఉజ్వల గుజరాత్‌లో అభివృద్ధి మాయ!

‘గుజరాత్ నమూనా అంటే ఏమనుకుంటున్నారు? అత్యంత ఉన్నత స్థాయిలో రాజకీయ అవినీతి చలామణి కావడమే; మంత్రులు, తంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నుంచి కార్పొరేటర్లు, పోలీసుల వరకు అవినీతి విచ్చలవిడిగా సాగడం; మీడియా, న్యాయవ్యవస్థ, ఏజెన్సీలను పట్టులో ఉంచుకోవడం, ప్రతిపక్షాలను కొనేయడమే’ - ఈ మాటలు అన్నది ఎవరో కాదు, దాదాపు పదిహేనేళ్లుగా భారతీయ జనతా పార్టీలో పలు పదవులు నిర్వహించిన తెలుగువాడు పీవీఎస్ శర్మ. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు అనేక సార్లు ఆయనను కలిసి ఈ అవినీతి విశృంఖలంగా ఎలా సాగుతుందో వివరించానని కాని ఆయన పట్టించుకోలేదని శర్మ అన్నారు. సూరత్ నుంచి ఫోన్ లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలలోకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశించడంతో గుజరాత్ ప్రజలకు కొత్త విశ్వాసం ఏర్పడిందని, అందుకే తాను ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని శర్మ చెప్పారు, గుజరాత్ నమూనా అని చెప్పుకోవడం ఒక బూటకమని, అది మార్కెటింగ్ తప్ప మరేమీ కాదని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధి అంటే ఏమిటి? స్కూళ్లు, ఆసుపత్రులు, కాలేజీలు ఎక్కడ? అని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారని ఆయన తెలిపారు. గత పదేళ్లుగా కాగ్ నివేదికల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని, వాస్తవాలను తొక్కిపెట్టడంలో గుజరాత్ పాలకులు సిద్ధహస్తులని ఆయన చెప్పారు.

బిజెపి నుంచి ఆప్‌లో చేరినందువల్ల కాషాయ పార్టీని పీవీఎస్ శర్మ విమర్శిస్తున్నారనుకోవడానికి వీలు లేదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెచ్చరిల్లడంతో పాటు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోందని గుజరాత్ నుంచి వస్తున్న నివేదికలు తెలుపుతున్నాయి. మోర్బీలో నాసిరకంగా మరమ్మతులు చేయడం వల్ల వంతెన కూలి 150 మంది దాకా మరణించడం కార్పొరేట్లతో ప్రభుత్వం కుమ్మక్కు ను స్పష్టంగా బహిర్గతం చేస్తోంది. కార్పొరేట్లు, ప్రభుత్వం కలిసి పనిచేయడం గుజరాత్ సంస్కృతిలో భాగం. బడా కంపెనీలు అక్కడ చవక ధరలకు భూసేకరణ చేయడం అతి సులభం. పన్నురాయితీలు, తక్కువ వేతనాల ద్వారా వారికి ప్రభుత్వం పలు ప్రయోజనాలను చేకూరుస్తోంది. పైకి అభివృద్ధి రేటు ఎక్కువగా కనపడినప్పటికీ సామాజిక సూచికల విషయంలో గుజరాత్ ఎంతో వెనుకబడి ఉన్నది. మానవ అభివృద్ధి సూచికల ప్రకారం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో గుజరాత్ 21వ స్థానంలో ఉన్నది, మణిపూర్, నాగాలాండ్ ల కంటే గుజరాత్ ఈ విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నది. ప్రధానమంత్రి నేతృత్వంలోని నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం కూడా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల విషయంలో గుజరాత్ పదవ స్థానంలో ఉన్నది. ఈ రాష్ట్రం పేదరిక నిర్మూలన విషయంలో 16వస్థానం, ఆకలి సూచీలో 18వ స్థానం, నాణ్యమైన విద్య విషయంలో 17వస్థానం, స్వచ్ఛమైన ఇంధనం విషయంలో 19వ స్థానంలో ఉన్నదని నీతి ఆయోగే ప్రకటించింది. కొవిడ్ సమయంలో గుజరాత్ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిన విషయం ప్రజల మనసుల్లోంచి చెరిగిపోలేదు.

గుజరాత్ నమూనా విషయంలో ప్రచారానికీ, వాస్తవాలకూ మధ్య తేడా ఎంతో ఉన్నదని తేలుతున్నప్పటికీ ఆ రాష్ట్రంలో డిసెంబర్ మొదటి వారంలో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి ఢోకా ఏమీ లేదని అనేక సర్వే సంస్థలు చెబుతున్నాయి. మరి గుజరాత్‌లో 27 సంవత్సరాల బిజెపి ప్రభుత్వం పట్ల పెచ్చరిల్లుతోన్న ప్రజా వ్యతిరేకత ఎన్నికల్లో ఎందుకు ప్రతిఫలించడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. గత ఎన్నికల కంటే ఈ సారి అత్యధిక సీట్లు సాధిస్తామని బిజెపి చెప్పుకుంటోంది, గుజరాత్ ఎన్నికల్లో ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ కొంత బలం పుంజుకునే అవకాశాలున్నాయని దాని వల్ల బిజెపి పట్ల వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, ఆప్ ల మధ్య చీలిపోయి బిజెపి ప్రయోజనం పొందుతుందని ఆ పార్టీ నేతలే కాదు, వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. 2012లో గుజరాత్ లో కేశుభాయి పటేల్ గుజరాత్ పరివర్తన పార్టీ అన్న పార్టీని స్థాపించి బిజెపి వ్యతిరేక ఓట్లు చీల్చినట్లే ఈ సారి ఆప్ తమకు పరోక్షంగా సహాయం చేస్తుందని బిజెపి ధీమా వ్యక్తం చేస్తోంది. 2017లో కాంగ్రెస్ గట్టి పోటీ నీయడంతో బిజెపి 182 సీట్లలో 99 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ సారి కాంగ్రెస్ బలహీనపడడంతో పాటు త్రికోణపు పోటీ కూడా ఏర్పడంతో తాము 150 సీట్ల వరకూ గెలుచుకుంటామని బిజెపి ఆశిస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా తమ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్ల తాము విజయం సాధిస్తామని బిజెపి ఆశించడం విచిత్రం. అభివృద్ధిని భూతద్దంలో పెట్టి చూపించి ప్రజలను మభ్యపెట్టి విజయం సాధించడానికి ఏ నేతకైనా ఎల్లకాలం వీలుపడదు. వాజపేయి హయాంలో ఆయన జన్మదినం సందర్భంగా లక్నోలో చీరల పంపిణీ చేసినప్పుడు రూ. 45 విలువ చేసే చీరలకోసం ఎగబడి తొక్కిసలాటకు గురికావడంతో 45 మంది పేద మహిళలు మరణించారు. భారత దేశం వెలిగిపోతున్నది అని నాడు ప్రమోద్ మహాజన్ చేసిన ప్రచారం దీనితో నీరుకారిపోయింది. ఇప్పుడు మోర్బీ సంఘటనతో పాటు మానవ అభివృద్ధి సూచికలు గుజరాత్ నమూనాలోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి.

తన స్వంత రాష్ట్రంలో భారీ విజయం సాధించడం కోసం బిజెపి ఇప్పుడు అన్ని అస్త్రాలను వాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా తమ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు బిజెపి ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు కార్పొరేట్ బాంబింగ్ లా గుజరాత్ అంతటా ప్రచారం చేస్తున్నారు. మోదీ వేల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించడం కోసం ఎన్నికల కమిషన్ ఆయనకు అనుకూలంగా గుజరాత్ ఎన్నికల తేదీలను నిర్ణయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి మళ్లించడం కోసం ఇదే సమయంలో ఢిల్లీలో స్థానిక ఎన్నికలను నిర్వహిస్తున్నారు. చివరకు గుజరాత్ ఎన్నికల తర్వాతే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలను నిర్ణయించారు.

ఎంత అభివృద్ధి గురించి చెప్పుకున్నా మతాన్ని ప్రయోగించకపోతే బిజెపికి నిద్రపట్టదు. ఎంతైనా బిజెపికి గుజరాత్ హిందూత్వ ప్రయోగశాల అన్న విషయాన్ని విస్మరించరాదు. 2002 అల్లర్లలో భాగంగా జరిగిన నరోడా పటియా ఊచకోతలో శిక్షపడ్డ మనోజ్ కుక్రానీ కూతురు పాయల్ కుక్రానీకి నరోడా నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. బెయిల్ పై బయటకు వచ్చిన మనోజ్ కుక్రానీ, స్థానికంగా కార్పొరేటర్ అయిన ఆయన సతీమణి రేష్మా కుక్రానీ కూతురి కోసం ప్రచారం చేస్తున్నారు. బిల్కిస్ బానో అత్యాచారం, హత్య కేసులో శిక్షపడ్డ వారిని సంస్కారులు అని పొగిడిన గోధ్రా ఎమ్మెల్యే చంద్రసింగ్ రవుల్జీ కి మళ్లీ టికెట్ ఇచ్చారు. గోధ్రా జైలు సలహా బోర్డు సభ్యుడుగా ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ వారి విడుదలకు దోహదం చేసింది. సరే వీరికి టిక్కెట్లు ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు కాని ఢిల్లీలో తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికిన ఒక మైనారిటీ యువకుడి పేరును కూడా గుజరాత్ ఎన్నికల్లో వాడుకోవడం బిజెపి నేతల మనస్తత్వానికి నిదర్శనం. నరేంద్రమోదీ వంటి బలమైన నేత లేకపోతే దేశంలో ప్రతి నగరంలోనూ అఫ్తాబ్ అమీన్ వంటి వారు తలెత్తేవారని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్‌శర్మ కచ్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో మైనారిటీ ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చి వేసి ప్రసిద్దికెక్కిన యోగీ ఆదిత్యనాథ్ గుజరాత్ లో ఎక్కడకు వెళితే అక్కడ బిజెపి కార్యకర్తలు బుల్ డోజర్లతో స్వాగతం ఇస్తున్నారు. ఆయన వెళ్లిన చోట్ల బుల్ డోజర్ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు నరేంద్ర మోదీ ప్రధానంగా గుజరాత్ ఆత్మగౌరవాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ‘నేను గుజరాత్ ను నిర్మించాను’ అని ఆయన నవంబర్ 6న గుజరాత్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ప్రకటించారు. ప్రతి ఎన్నికలోనూ ఆయన ఈ ట్రంప్ కార్డును ఉపయోగించుకుంటున్నారు. గుజరాత్ ను అవమానించిన నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్ తో చేతులు కలిపి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారని ఆయన విమర్శించారు.

ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవడానికి ఈ సారి బిజెపి 38 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించవలిసి వచ్చింది, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఫిరాయింపు దార్లకు కూడా టిక్కెట్లు కేటాయించారు, పటీదార్లకు ఉపాధి, విద్యావకాశాలకోసం తీవ్రమైన ఆందోళన జరిపిన కాంగ్రెస్ నేత హర్దిక్ పటేల్ ను బిజెపిలో చేర్చుకుని ఆయనకు టికెట్ ఇచ్చారు. క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణికి టిక్కెట్ కేటాయించారు. ప్రజలకు ఉచితాలను ఇచ్చే సంస్కృతి మంచిది కాదని, ఇది పన్ను చెల్లించేవారి డబ్బు వృధా చేయడమేనని నరేంద్రమోదీ ప్రకటించినప్పటికీ మహిళలకు ఉచితంగా సైకిళ్లు, స్కూటర్లు ఇస్తామని, ఉచితంగా ఎల్ పిజి సిలిండర్లు సరఫరా చేస్తామని, ఉపాధి హామీ కల్పిస్తామని గుజరాత్ లో బిజెపి ప్రకటించడం ఆశ్చర్యకరం. ఉచిత విద్యుత్ , మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు, ప్రభుత్వోద్యోగులకు అధిక వేతనాలు వంటి వాగ్దానాలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీతో పోటీపడాల్సిన అగత్యం బిజెపికి ఏర్పడింది. 27 సంవత్సరాలుగా రాష్ట్రంలోనూ, 8 సంవత్సరాలుగా కేంద్రంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ బిజెపి గుజరాత్ లో విజయం సాధించడం కోసం సామ దాన బేధ దండోపాయాల్ని, మత రాజకీయాల్నీ ప్రయోగించాల్సి రావడం డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. అభివృద్ధి, ప్రజాసంక్షేమం విషయంలో కాకపోయినా ఎన్నికల్లో విజయం సాధించేందుకు మోదీ ఒక నమూనా రూపొందించారనడంలో సందేహం లేదు. కేవలం పనితీరు ఆధారంగా ఆరోగ్యకరమైన పోటీ జరిగే రోజులు మన ప్రజాస్వామ్యంలో ఎప్పుడు వస్తాయి?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-11-23T01:20:29+05:30 IST