‘కుల నిర్మూలన’ మహాసభలు

ABN , First Publish Date - 2022-11-22T02:34:30+05:30 IST

ఇండియాలో కులం ఒక వాస్తవం. అన్ని సమస్యలకూ అదే మూలం. కుల వ్యవస్థ నిర్మూలన జరుగకుండా మనుషుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం ఏర్పడదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రకారం...

‘కుల నిర్మూలన’ మహాసభలు

ఇండియాలో కులం ఒక వాస్తవం. అన్ని సమస్యలకూ అదే మూలం. కుల వ్యవస్థ నిర్మూలన జరుగకుండా మనుషుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం ఏర్పడదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రకారం రెండు ఎజెండాలను ముందుకు తీసుకుపోవడం ద్వారా కుల నిర్మూలన సాధ్యమవుతుంది. ఒకటి- కుల అసమానతల నిర్మూలన కోసం పోరాటం; రెండు- కులాంతర వివాహాలతో కులాల మధ్య రక్తమార్పిడితో కుల అస్తిత్వ నిర్మూలనను సాధించడం. ఈ అవగాహనతో సత్యశోధక కమ్యూనిస్టు యోధుడు శరద్ పాటిల్ (మహారాష్ట్ర), ఎదురీత సంపాదకులు ఉ.సా, కెజి సత్యమూర్తి (ఆంధ్రప్రదేశ్), ప్రొ. ప్రేమపతి (ఢిల్లీ), పెరియారిస్టు కమ్యూనిస్టుపార్టీ అధినేత అన్నెముత్తు (తమిళనాడు), ప్రముఖ సోషియాలజిస్టు గెయిల్ ఆమ్వెట్ తో సహా ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు 1992 నవంబర్ 22, 23 తేదీలలో ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో సమావేశమై అఖిల భారత కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ప్రణాళికను రూపొందించారు. అఖిల భారత స్థాయిలో ఈ సంస్థను ఏర్పాటు చేయటం కోసం 1992 డిసెంబర్ చివరి వారంలో ఢిల్లీలో మహాసభలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, బాబ్రీ మస్జీదు కూల్చివేతతో దేశం అల్లకల్లోలమయినందున ఆవిర్భావసభలు జరగలేదు. సంస్థ ప్రణాళిక ‘నలుపు’ పత్రికలో 1993 ఏప్రిల్ సంచికలోనే ప్రచురితమైంది. ఆ విధంగా 1992 లోనే ఆచరణలోకి అడుగుపెట్టవలసిన అఖిల భారత కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి 2019 సెప్టెంబర్ 17న పెరియార్ 140వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కులోన్మాదహత్యలకు బలైన తల్లీబిడ్డలు సుశృత-దేవర్ష్‌ల స్మరణలో సుశృత తల్లి కందిక కోమల చేతులమీదుగా ఆవిర్భవించింది. గత 3 సంవత్సరాల్లో తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఆ క్రమంలోనే తెలంగాణలో సంస్థాగత నిర్మాణరూపాన్ని బలోపేతం చేయడంలో భాగంగా నేడు హైదాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో మొదటి రాష్ట్ర మహాసభలను జరుపుకుంటున్నది. ముఖ్య అతిథులుగా ప్రొ. కె.వై రత్నం, జె.బి. రాజు, ప్రొ. కె. శ్రీనివాసులు, జి. సరోజని, డి.చంద్రశేఖర్, యస్.సుధాకర్, ప్రొ. కె.చక్రధర్ రావ్, ప్రొ. కె. లక్ష్మినారాయణ, వై.కె తదితరులు పాల్గొననున్నారు.

బండారి లక్ష్మయ్య

ఆల్ ఇండియా కన్వీనర్, కుల అసమానతల

నిర్మూలన పోరాట సమితి (KANPS)

Updated Date - 2022-11-22T02:34:36+05:30 IST