భిన్న ప్రవృత్తికి బలిపీఠం!

ABN , First Publish Date - 2022-12-30T02:49:14+05:30 IST

మనిషిని తొలిచివేసే ఈ సందేహాలు మహాత్ముడు చనిపోయినప్పుడు శ్రీశ్రీని కలచివేశాయి. సందర్భం మారినా తాత్త్విక గంభీరతతో కూడిన ఇలాంటి ప్రశ్నలు కదిలిస్తూనే ఉంటాయి...

భిన్న ప్రవృత్తికి బలిపీఠం!

ఏది నిత్యం – ఏదనిత్యం...

ఏది నీతి – ఏది నేతి...

ఏది సత్యం – ఏదసత్యం...

మనిషిని తొలిచివేసే ఈ సందేహాలు మహాత్ముడు చనిపోయినప్పుడు శ్రీశ్రీని కలచివేశాయి. సందర్భం మారినా తాత్త్విక గంభీరతతో కూడిన ఇలాంటి ప్రశ్నలు కదిలిస్తూనే ఉంటాయి. శాశ్వత సమాధానాలు మాత్రం దొరకవు. ఒకప్పుడు నిత్యం అనుకున్నది మరొకప్పుడు అనిత్యం అవుతుంది. ఒకనాడు అనైతికత నేడు నైతికత అవుతుంది. అవగాహన పెరిగినప్పుడు అసహజం సహజం అవుతుంది. అయిష్టంగానే ఆమోదం దొరుకుతుంది. సంప్రదాయం గీసినహద్దులను అలానే దాటుతున్నాం. వ్యక్తిగత, సమాజ అవసరాలను లౌకిక దృష్టితో మదింపు వేసుకుని నైతిక ప్రవర్తనను నిర్దేశించుకుంటున్నాం. లైంగిక ప్రవృత్తుల విషయంలో మాత్రం మన దృష్టి చాలా మెల్లగా మారుతోంది. స్వలింగ సంపర్క వైఖరి కారణంగా సౌరభ్‌ కిర్పాల్‌ అనే న్యాయవాదిని హైకోర్టు జడ్జిగా నియమించేందుకు కేంద్రం నిరాకరించినట్లు భావిస్తున్న నేపథ్యంలో ఏది సహజం.. ఏదసహజం.. అన్న ప్రశ్న మనల్ని వేధించక మానదు. సమాజం సంపూర్ణంగా ఆమోదించని లైంగిక ప్రవృత్తి కలిగిన వ్యక్తిని జడ్జిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయటమే అసాధారణం. అంతకంటే ముందు ఢిల్లీ హైకోర్టు కొలీజియం సైతం కిర్పాల్‌ విషయంలో ఏకగ్రీవంగా ఆమోదం చెప్పటం అంతే అసాధారణం.

లైంగిక సంబంధాలు, చుట్టరికాలు, అనుబంధాలు మనుషుల మనుగడకు ప్రాణప్రదమైనవి. వావివరసలు లేని జంతుస్థాయి నుంచి ఎన్నో ప్రయోగాల అనంతరం లైంగిక ప్రవర్తనలపై విధినిషేధాలు వచ్చాయి. సంఘ జీవనానికి అవే ఆయువుపట్టు. అందుకే వీటిల్లో మౌలిక మార్పులు ఒక పట్టాన రావు. ఆరోగ్యపరంగా చాలా అనర్థాలు ఉన్నాయని డాక్లర్లు ఎప్పటి నుంచో చెబుతున్నా దక్షిణాదిలో మేనరిక వివాహాలు ఇంకా జరుగుతూనే ఉండటం దీనికి నిదర్శనం. మన సినిమాలు, సాహిత్యం నుంచి బావామరదళ్ల ప్రేమల్ని తీసేస్తే ఏర్పడే శూన్యత మనకు దిగ్ర్భాంతిని కలిగిస్తుంది.

పరిణామ క్రమంలో మతాలను, దేవతా ప్రపంచాలను అన్ని సమాజాలూ సృష్టించుకున్నాయి. మనిషి మొదలు పెట్టిన మహా ప్రయాణంలో ఒకనాడు మనుగడకు అవసరమైన సృష్టిగానే వీటిని అర్థంచేసుకునే ధోరణి ఈ మధ్య బాగా పెరుగుతోంది. ఏ ప్రయోజనం లేని అజ్ఞాన జనితాలుగానో, పురోహిత వర్గాల కుట్రగానో మత భావాలను తెగనాడే వైఖరి సామాజిక శాస్త్రాల్లో క్రమేపీ తొలగిపోతోంది. సమాజంలో కుట్రలు, కుహకాలు ఉంటాయి. వ్యక్తిగత ఆస్తుల చుట్టూ ఆలోచనలు తిరిగే సమాజాల్లో అవి సహజం. కానీ మతం, కుటుంబ వ్యవస్థ, లైంగిక సంబంధాలపై విధినిషేధాలు, మంచి చెడులను నిర్దేశించే నైతిక నియమాలు కేవలం కుట్రల వల్లే రాలేదు. సామాజిక పరిణామంలో మనిషి ఎన్నో మెట్లు పైకెక్కటానికి వీలుగా ఇవి ఉనికిలోకి వచ్చాయి. మానవశాస్త్ర పరిశోధనలు చెబుతున్నది అదే. మరెన్నో శాస్త్రాల్లో జరుగుతున్న పరిశోధనల వల్ల లైంగిక ప్రవర్తనపై అవగాహన విశాలం అవుతోంది.

ప్రభుత్వాలు, రాజ్యవ్యవస్థలు మాత్రం ఈ విశాలతను ఒక పట్టాన అంగీకరించటం లేదు. అనేక చోట్ల వ్యతిరేకత ఇంకా బలంగానే ఉంది. మన కేంద్ర ప్రభుత్వ వైఖరి దీనికి భిన్నం కాదు. దేశ సంప్రదాయాలన్నిటినీ ఘనమైనవిగా భావించటం అధికార పార్టీ ఐడియాలజీ. అందుకే సంప్రదాయంలో ఆమోదం లేని విషయాలపై తీవ్ర అయిష్టత అధికార పార్టీ భావజాలంలోనే ఉంది. మరోవైపు ఎన్నో దేశాల్లో భిన్న లైంగిక ప్రవృత్తులపై నిషేధాలు తొలగిపోతున్న దృశ్యం కనపడుతోంది. అసహజ ప్రవృత్తుల పూర్వాపరాలపై చర్చలు లోతుగా జరుగుతున్నాయి. మానసిక, జీవ, జన్యు శాస్త్రాల్లో సాగుతున్న పరిశోధనలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. అసలీ భిన్న లైంగిక ప్రవృత్తులను చారిత్రక దృష్టితో చూస్తే ఆధునిక కాలానికే పరిమితమైనవిగా భావించలేం. దేశాల సంస్కృతులకు అద్దంపట్టే పుస్తకాల్లో వీటి ఛాయలెన్నో ఉన్నాయి. అప్పట్లో ఆ ప్రవృత్తులు కలవారిని శాపగ్రస్త జీవులుగా భావించటమో దండించటమో చేశారు. అసహజ ప్రవృత్తులకు తెచ్చిపెట్టుకున్న తప్పుడు ఆలోచనలు కారణమని జీవ పరిణామ శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పటం లేదు. ధార్మికంగా నైతికంగా పతనమైన వారే ఈ సంబంధాల్లో కూరుకుపోతున్నారని అనుకోవటం తగ్గిపోతోంది. పరిణామక్రమంలో సహజ లైంగిక ప్రవృత్తులు ఎలా పుట్టాయో అలాగే అసహజ ప్రవృత్తులు పుట్టాయని పరిణామ జీవశాస్త్ర అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధాన ప్రవాహానికి దూరంగా సన్నగా ఉండే సమాంతర పాయలుగానే ఈ ప్రవృత్తులు కొనసాగాయి. జన్యు పదార్థంలో, దాని సహజ అమరికలో ఎక్కడో గతితప్పిన సమతూకత దీనికి కారణం. ఆ తప్పిదాన్ని, దాని క్రమాన్ని నిర్దిష్టంగా చెప్పే స్థాయికి విజ్ఞానం ఇంకా చేరుకోలేదు. లోపాల ప్రవర్తనను సరిదిద్దే స్థాయికి భవిష్యత్తులో విజ్ఞానం చేరుకోలేదని చెప్పలేం. మానసిక వ్యాకులత, అదుపుకాని ఆందోళన, నియంత్రించుకోలేని ఆలోచనలు, అంతర్ముఖ వ్యక్తిత్వం వగైరాలను బలహీన మనస్సులతో మనుషులు కొని తెచ్చుకుంటారని చాలా కాలం నమ్మాం. అది తప్పుగా తేలిపోతోంది. మన ప్రమేయం లేకుండా, కోరుకోకుండా మెదడులో జరిగే రసాయన మార్పులు ఎన్నో మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి. మెదడు పనితీరుపై జరుగుతున్న పరిశోధనలతో మన ఆలోచనలే తలకిందులు అవుతున్నాయి.

జన్యువులు, న్యూరాన్లు, కణాలు ఎక్కడో లయతప్పి సృష్టించిన ప్రవర్తనను నైతిక పతనంగా చూడొద్దనేదే స్వలింగ సంపర్కుల వాదన. స్త్రీపురుషుల మధ్య తలెత్తే లైంగికేచ్ఛ ఎలా అయితే ప్రకృతి నిర్దేశితమో అలానే తమ ప్రవృత్తిని చూడాలని వారు కోరుకుంటున్నారు. లైంగిక ప్రవృత్తి మినహా ఇతరత్రా సమాజం నిర్దేశించే నైతిక విధులకు కట్టుబడి వ్యవహరిస్తున్న తమపై నిషేధాలు ఎందుకంటూ వారు వేస్తున్న ప్రశ్నల నుంచి పారిపోవటం సాధ్యంకాని పని. లైంగిక ప్రవర్తనలో తేడా తప్ప ప్రతిభాపాటవాల పరంగా ఎందులోనూ తీసిపోని ఎల్‌జీబీటీక్యూలకు అనేక దేశాలు హక్కుల్లో సమానత్వాన్ని కల్పిస్తున్నాయి. దేశాధి నేతలు, సీఈవోలు, సెలబ్రిటీలు భిన్న లైంగిక వైఖరుల గురించి ఇప్పుడు బాహాటంగానే చెప్పుకొంటున్నారు. వీళ్లెవరూ తమ ప్రవృత్తి ఉత్తమమైందనో, అందరూ దీన్ని అనుసరించాలనో చెప్పటం లేదు. ప్రకృతిని పూజించటంలో ఏ దేశమూ భారత్‌కు సాటిరాదని గొప్పలు చెప్పుకొనే మనం, ఆ ప్రకృతి సృష్టించిన సౌరభ్‌ కిర్పాల్‌ లాంటి వ్యక్తులకు చేస్తున్న అన్యాయం గురించి తర్కించకుండా ఉండటం నిజాయితీగా భావించలేం.

పెంపకం, కుటుంబం, సంప్రదాయాలు, విద్యాబుద్ధులు మానవ స్వభావాన్ని పూర్తిగా నిర్దేశించేవిగా భావించే ధోరణి సైతం ఇప్పుడు తగ్గిపోతోంది. స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, ప్రేమ, హింసా ప్రవృత్తి, ఆధిపత్య ధోరణి, అణచివేత, అసమానతల మూలాల గురించి చర్చలు చాలా జరుగుతున్నాయి. జాన్‌లాక్‌ భావించినట్లు అన్నీ సమాజ అనుభవం నుంచి వచ్చాయా? రూసో చెప్పినట్లు మనిషి ఆదిలో కల్లాకపటం తెలియని ఉదాత్త ఆటవికుడా? థామస్‌ హాబ్స్‌ అన్నట్టుగా మనిషి జీవితం ఆదిలో ఆధిపత్య వైఖరితో కూడిన పశుప్రాయమైనదేనా? మార్క్స్‌ భావించినట్లు అసమానత, శ్రమదోపిడీ నుంచి అవలక్షణాలన్నీ వచ్చాయా? ఫ్రాయిడ్‌ పేర్కొన్నట్లు లైంగికేచ్ఛలను అణచటంతోనే మానసిక వైపరీత్యాలు పుట్టుకొచ్చాయా? స్వభావ సిద్ధం ఎంత? సమాజ జనితం ఎంత? ఇవన్నీ ప్రశ్నలు. జవాబుల కోసం ప్రయాణం సాగుతోంది. తుది జవాబులు దొరకటం లేదు.

పసి మెదళ్లను తెల్లకాగితాలుగా భావించి పెంపకం, విద్యా బుద్ధుల ద్వారా మనం ఏదైనా రాసి వాళ్ల స్వభావాన్ని సంపూర్ణంగా శాసించగలమని అనుకునే రోజులు పోతున్నాయి. మానవ స్వభావంలో మనం మార్చగలిగింది, మార్చలేని దానిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకదాన్ని ఆమోదించి రెండోదాన్ని పూర్తిగా కాదనటం వల్ల మెరుగైన ప్రవర్తనకు పునాదులు వేయలేం. జన్యువులు, సామాజిక సంస్కృతి, కుటుంబ ప్రభావాలు కలగలసి నిర్దేశించే మానవ స్వభావంలో మనకు నచ్చనంత మాత్రాన ఒక భాగాన్ని వెలివేయలేం. యుగాలుగా బలిపీఠాలెక్కిస్తున్నా మారని కొన్ని ప్రవర్తనలు ఉన్నాయి. వాటిని పరిణామ శాస్త్ర, మనోవైజ్ఞానిక దృష్టితో అర్థం చేసుకునే ఓపికే నిజమైన నాగరిక లక్షణం.

రాహుల్‌ కుమార్‌

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - 2022-12-30T02:49:17+05:30 IST