‘ఎయిమ్స్’ హెచ్చరిక!

ABN , First Publish Date - 2022-12-02T02:35:35+05:30 IST

దేశరాజధానిలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సైబర్ నేరగాళ్ళ బారిన పడి వారంరోజులుగా విలవిల్లాడుతోంది. మొత్తం కంప్యూటర్ వ్యవస్థను...

‘ఎయిమ్స్’ హెచ్చరిక!

దేశరాజధానిలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సైబర్ నేరగాళ్ళ బారిన పడి వారంరోజులుగా విలవిల్లాడుతోంది. మొత్తం కంప్యూటర్ వ్యవస్థను అదుపులోకి తీసుకొని పనిచేయకుండా చేసిన హ్యాకర్లు, రెండువందల కోట్ల రూపాయల విలువైన క్రిప్టోకరెన్సీని చెల్లిస్తేనే తాళం తెరిచి, సర్వర్లను నిద్రలేపుతామని డిమాండు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. డబ్బు డిమాండ్ కు సంబంధించి ఎయిమ్స్ ఏమీ మాట్లాడకున్నా, రాన్సమ్ వేర్ దాడికి గురైన తమ సర్వర్లను తిరిగిపనిచేయించేందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సహా చాలా వ్యవస్థలు కృషి చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఎమర్జెన్సీ విభాగం, ఔట్ పేషంట్, ఇన్ పేషంట్, ల్యాబ్ ఇత్యాది అనేకానేక విభాగాలన్నీ కంప్యూటర్ సాయం లేకుండా నడుస్తుండటంవల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిమ్స్ కు వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది.

ప్రభుత్వ వ్యవస్థలన్నీ సమస్తశక్తులూ కేంద్రీకరించి ఎయిమ్స్ ను ఈ కష్టంనుంచి గట్టెక్కించేందుకు కృషిచేస్తున్నప్పటికీ, వారం దాటినా సైబర్ నేరగాళ్ళ చెరనుండి దానికి విముక్తి లభించకపోవడం ఆశ్చర్యమే. దేశంలోనే అత్యున్నత వైద్యప్రమాణాలున్న ఎయిమ్స్ ఏటా పదిహేను లక్షలమంది ఔట్ పేషంట్లకు, ఓ లక్షమంది ఇన్ పేషంట్లకు వైద్యసేవలు అందిస్తున్నది. ఇప్పుడు హ్యాకింగ్ కు గురైన సర్వర్లలో కనీసం నాలుగుకోట్లమంది రోగుల వివరాలు ఉన్నందున ఈ డేటాను సైబర్ నేరగాళ్ళు దుర్వినియోగపరిచే అవకాశాలున్నాయని నిపుణులు భయపడుతున్నారు. రాజకీయనాయకులు, సీనియర్ అధికారులు, న్యాయమూర్తులతో సహా ఇతరత్రా అనేకరంగాలకు చెందిన వీవీఐపీల ఆరోగ్యసమాచారం, అనేకమంది ప్రముఖుల మరణ కారణాలు, దానికి ముందు వారికి అందించిన వైద్యచికిత్సల వివరాలు అంతా ఇప్పుడు సైబర్ నేరగాళ్ళ చేతుల్లో ఉన్నందున, ఆ సమాచారాన్ని వారు విప్పగలిగితే దానిని ఏ విధంగానైనా ఉపయోగించగలిగే ప్రమాదం ఉన్నదని భయం. ఆస్ర్టేలియాలో ఇలాగే అడిగిన సొమ్ము ఇవ్వనందుకు, ఒక అతిపెద్ద బీమా సంస్థకు చెందిన తొంభైలక్షల రికార్డులను సైబర్ దొంగలు బయటపెట్టారు. వైద్యవివరాలతో పాటు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారం కూడా ఉన్న ఈ తరహా రికార్డులు ఏ స్థాయిలో దుర్వినియోగమవుతాయో చెప్పలేం.

ప్రతిరోజూ పదిహేనువేల ఔట్ పేషంట్ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే, ఇప్పుడు ఐదువేలమందికి కూడా సేవలు అందించలేని స్థితిలో ఎయిమ్స్ ఉన్నది. లాబరేటరీలనుంచి బిల్లింగ్ వరకూ ప్రతీ పనికీ రోగులు నిరీక్షించక తప్పడం లేదు. ఎమర్జెన్సీ కేసుల్లో పేషంట్ల రికార్డులు, ల్యాబ్ రిపోర్టులు వ్యక్తిగతంగా ఒకచోటనుంచి మరోచోటకు తీసుకుపోవడానికి బదులుగా వైద్యులు వాట్సాప్ వాడుతున్నారట. దాదాపు నలభై ఫిజికల్ సర్వర్లను, వంద వర్చువల్ సర్వర్లను శుభ్రం చేయడం అంత సులభంగా జరిగేదికాదు. అవసరమైనచోట అధునాతనసర్వర్లను ఏర్పాటుచేయడం జరుగుతున్నప్పటికీ, ఎయిమ్స్ ఉపయోగిస్తున్న చాలా సర్వర్లు గతకాలంనాటివి, వ్యవధి తీరిపోయినవి అయినందున సైబర్ దాడికి సులువుగా గురై ఉండవచ్చు.

ఇంటలిజెన్స్ బ్యూరో, సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ వంటివి ఈ దాడివెనుక ఉన్న ఇతరత్రా కోణాలను అధ్యయనం చేస్తున్న విషయాన్ని అటుంచితే, ఆరోగ్యరంగానికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలమీద ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ వంటి ఉన్నతమైన సంస్థ కాస్తముందుగా జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. బ్రిటన్ ఎన్.హెచ్.ఎస్ వ్యవస్థ ఇటీవలే ఇటువంటిదాడికి గురై కొద్దికాలం స్తంభించిపోయింది. ఆరోగ్యరంగంమీద సైబర్ దాడులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు వందశాతం పెరిగాయనీ, ఇలా దాడికి గురవుతున్న దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉన్నదనీ సర్వేలు చెప్పాయి. రాన్సమ్ వేర్ దెబ్బకు అమెరికా కూడా ఇటీవల విలవిల్లాడి, ఉత్తరకొరియాను నిందించింది కూడా. ఆరోగ్యరంగానికి అత్తెసరు కేటాయింపులు జరిగే భారతదేశంలో రాన్సమ్ వేర్ దాడులకు ఎయిమ్స్ వంటివి సులువుగా బలైపోయే ప్రమాదం మరింత ఎక్కువ. డిజిటైజేషన్ తో పని మరింత సులభమై, మరెంతోమందికి వైద్యం అందించడం సాధ్యపడుతున్నది కానీ, అదేస్థాయిలో సైబర్ రక్షణపైనా మనం శ్రద్ధపెట్టాలనీ, అది ఒక విధానంగా జాతీయస్థాయిలో అమలు జరగాలని ఎయిమ్స్ దాడి హెచ్చరిస్తున్నది.

Updated Date - 2022-12-02T02:35:39+05:30 IST