Share News

అంబానీ, అదానీకి దోచిపెట్టిన సంపదను కక్కిస్తాం

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:27 AM

పదేళ్ల బీజేపీ పాలనలో దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ సంపదనంతా కక్కిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ తెలిపారు.

అంబానీ, అదానీకి దోచిపెట్టిన సంపదను కక్కిస్తాం

  • బీఆర్‌ఎస్‌ నిర్వాకం వల్లే సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలు: పొన్నం

కోహెడ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రజాధనాన్ని తిరిగి ప్రజలకే అప్పగిస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌.. ప్రజలను అరిగోస పెట్టాయని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు చుక్కలనంటినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా కోహెడలో శుక్రవారం నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశామని గుర్తు చేశారు.

ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, ఆ విషయాన్ని గల్లా ఎగరేసుకొని చెప్పాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవుడి పేరు చెప్పి ఓట్ల అడిగే మూర్ఖులను దరిదాపులకు కూడా రానివ్వొద్దని ఓటర్లను కోరారు. బీజేపీ గ్రాఫ్‌ పడిపోతుండడంతో ప్రజలను అయోమయానికి గురి చేసేలా మోదీ మాట్లాడుతున్నారని, ఆయన ప్రకటనలను దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు.


పదేళ్లు అధికారంలో కొనసాగి బకాయిలు చెల్లించకుండా సిరిసిల్ల నేతన్నలను అప్పుల ఊబిలో నెట్టేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు.. ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని పొన్నం ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిల కింద ఇప్పటికే రూ.50కోట్లు ప్రభుత్వం విడుదల చేశామని, త్వరలోనే మరో రూ.50కోట్లు ఇస్తామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేనేత వస్త్రాలను స్కూల్‌ పిల్లల యూనిఫాం కోసం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. నేతన్నలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన వద్దకు రావాలని సూచించారు.

Updated Date - Apr 27 , 2024 | 05:27 AM