Share News

CM Revanth : సెమీస్‌లో బిల్లారంగాల్ని ఓడించాం.. ఫైనల్స్‌లో మోదీ, షాలను ఓడిస్తాం

ABN , Publish Date - May 04 , 2024 | 05:46 AM

గత ఏడాది డిసెంబరులో జరిగిన సెమీఫైనల్స్‌లో బిల్లా, రంగాలను ఓడించామని.. ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్‌లో మోదీ, అమిత్‌షాలను ఓడిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో బీఆర్‌ఎ్‌సను బొందపెట్టాం, లోక్‌సభ ఎన్నికల

CM Revanth : సెమీస్‌లో బిల్లారంగాల్ని ఓడించాం..  ఫైనల్స్‌లో  మోదీ, షాలను ఓడిస్తాం

తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంటు సాక్షిగా అవమానించారు

ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు?

గుజరాతీలే మనుషులా.. మనం కాదా?

గుజరాత్‌కు అనేక ప్రాజెక్టులు, భారీ నిధులు

తెలంగాణకు ఏవీ ఇవ్వరు.. పైగా రద్దు చేస్తారు

బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే

బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే

బీజేపీతో బీఆర్‌ఎస్‌ మిలాఖత్‌.. రాజ్యాంగాన్ని

మార్చే విషయంలో వారిది ఒకటే విధానం

ట్విటర్‌ టిల్లూ కేటీఆర్‌ మోదీని ఎందుకు ప్రశ్నించరు

1, 2 సీట్లొస్తే మోదీకి అమ్ముదామని కేసీఆర్‌ యత్నం

మా ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంటుంది

జగిత్యాల, సిరిసిల్ల కాంగ్రెస్‌ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్నో రాష్ట్రాలుండగా మధ్యప్రదేశ్‌కే ఎందుకు?

ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్‌పై సుప్రీం ప్రశ్న

న్యాయవాదుల తీరుపై ధర్మాసనం అసహనం

క్షమాపణలు చెప్పిన లాయర్లు.. విచారణ జూలైకి

పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, మే 3 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది డిసెంబరులో జరిగిన సెమీఫైనల్స్‌లో బిల్లా, రంగాలను ఓడించామని.. ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్‌లో మోదీ, అమిత్‌షాలను ఓడిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో బీఆర్‌ఎ్‌సను బొందపెట్టాం, లోక్‌సభ ఎన్నికల ఫైనల్స్‌లో బీజేపీని ఓడిద్దాం అంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. బిల్లారంగాలంటే ఎవరో కాదు హరీశ్‌రావు, కేటీఆర్‌ అని, బీఆర్‌ఎస్‌ అంటే బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు. మోదీ, అమిత్‌షాలను మనువాద సిద్ధాంతం ఆవహించిందని, దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం తలెత్తిందని హెచ్చరించారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ జనజాతర సభలకు సీఎం హాజరై ప్రసంగించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో గుజరాత్‌ రాష్ట్రానికి బుల్లెట్‌ ట్రెయిన్‌ తీసుకువెళ్లారు. సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ చేపట్టారు. గేట్‌ సిటీ నిర్మించారు. లక్షల కోట్ల నిధులను తరలించుకుపోయారు. తెలంగాణకు మాత్రం నిధులు ఇవ్వరు. ప్రాజెక్టులు ఇవ్వరు. మంజూరైన ప్రాజెక్టులను కూడా రద్దు చేస్తారు. గుజరాత్‌లో ఉన్నోళ్లే మనుషులా? తెలంగాణలో ఉన్నోళ్లు మనుషులు కారా?’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని, రాష్ట్రానికి పెద్ద గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. కరీంనగర్‌లో పోటీ పడుతున్నది కొత్త వాళ్లేమీ కాదని, గతంలో ఎంపీలుగా పని చేసిన వినోద్‌రావు, బండి సంజయ్‌లని.. ఒకరు అపర మేధావి కాగా, మరొకరు అరగుండు మేధావి అని రేవంత్‌ పేర్కొన్నారు. పదేళ్లు వీరి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని, తెలంగాణకు అవి చేసిన ద్రోహాన్ని చూశామని, రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో చూశామని తెలిపారు. తెలంగాణకు హక్కులు, నిధులు ఇవ్వకపోగా నరేంద్రమోదీ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో.. తెలంగాణ ఏర్పాటు పక్రియను తప్పుపట్టి అవమానించారని రేవంత్‌ ఆరోపించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని, పార్లమెంట్‌ తలుపులు మూసి తెలంగాణ బిల్లు అమోదించారని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.


తెలంగాణ ఏర్పాటునే అవమానించిన బీజేపీ పార్టీకి చెందిన బండి సంజయ్‌, అరవింద్‌లకు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఉద్దేశించి.. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ప్రపంచంలో అన్నింటి గురించీ మాట్లాడే ట్విట్టర్‌ టిల్లును ఒకటే అడుగుతున్నానని.. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చడానికి నరేంద్రమోదీ బీజేపీ కుట్ర చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే విషయంలో కేసీఆర్‌, నరేంద్రమోదీలది ఒకే విధానమన్నారు. 2022 ఫిబ్రవరిలో కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌ బస్సు యాత్ర చేస్తుంటే కొడుకు కేటీఆర్‌ కారు కరాబు అయ్యిందని అంటున్నాడని, షెడ్డుకు పోయిన కారు తిరిగిరాదని, తూకానికి అమ్మాల్సిందేనన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు గెలిస్తే మోదీకి అమ్మే అలోచన కేసీఆర్‌ చేస్తున్నాడని ఆరోపించారు. రెండు పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్‌ గెలిచే చోట కుట్రలు చేస్తున్నాయన్నారు. బిడ్డ బెయిల్‌ కోసం తెలంగాణ అత్మగౌరవాన్ని ఢిల్లీ సుల్తానుల వద్ద తాకట్టు పెడతారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.40 వేల కోట్లు అప్పు మిగిల్చి పోయిందని, వాటిని చెల్లించలేక చస్తున్నానని.. సిరిసిల్ల నేత కార్మికులకు కూడా రూ.275 కోట్లు ఉద్దెర పెట్టారని తెలిపారు. నాటి తాగుబోతుల సంసారంలో ఉద్దెరలు, బకాయిలతోనే సరిపోయిందని అన్నారు. నేతన్నలకు రూ 50 కోట్లు చెల్లించామని, ఎన్నికల తరువాత మిగతా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.

పెద్దపల్లికి గొప్ప చరిత్ర

పెద్దపల్లి నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉందని, ఈ నియోజకవర్గం పరిధిలోని మంథనికి ప్రాతినిధ్యం వహించిన పీవీ నరసింహారావు దేశానికి ప్రధాని అయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇవాళ దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని, అందుకు పునాదులు వేసింది పీవీనేనని చెప్పారు. ఇదే ప్రాంతానికి చెందిన దివంగత నేత శ్రీపాదరావు స్పీకర్‌ పదవికే వన్నె తెచ్చారన్నారు. పెద్దపల్లికి ప్రాతినిధ్యం వహించిన కాకా వెంకటస్వామి 1990లో సింగరేణి దెబ్బతినకుండా ఉండేందుకు కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు తీసుకొచ్చి ఆ సంస్థను కాపాడి అనేక కుటుంబాలకు ఉపాధి కల్పించారని అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు కృషి చేశారని కొనియాడారు. ‘ఏ దిక్కు లేక అక్క మొగుడే దిక్కు’ అన్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి ప్రజలు ఓడించిన కొప్పుల ఈశ్వర్‌కే టికెట్‌ ఇచ్చిందని సీఎం ఎద్దేవా చేశారు. ఆయన 25 ఏళ్ల నుంచి ఈ ప్రాంతానికి చేసిందేమి లేదని, ప్రధాని మోదీ సింగరేణి గనులను ప్రైవేట్‌పరం చేస్తుంటే మౌనంగా ఉన్నాడని, ఆయనకు, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ చచ్చిన పాము.. మొన్నటి ఎన్నికల్లో తోక మీద, నడుం మీద కొట్టారు.. ఇప్పుడు పడగ మీద కొట్టాలి.. శాశ్వతంగా కాల నాగు పీడ విరగడవుతుంది’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


400 సీట్లు ఎందుకు అడుగుతున్నారంటే..

బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, అందులో పోటీ పెడితే వారిని ఎవరూ తట్టుకోలేరని, అదొక పెద్ద యూనివర్శిటీ అని విమర్శించారు. పదేళ్లలో మోదీ రాష్ట్రానికి చేసేందేమి లేదని సీఎం తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపారని, కాజీపేట ఉక్కు కర్మాగారాన్ని లాథూర్‌కు తరలించారని, రామగుండం ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మించాల్సి ఉండగా 1600 మెగావాట్ల ప్లాంట్‌ను మాత్రమే నిర్మించారని, ఐఐటీ, ఐటీఐఆర్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుందని విమర్శించారు. తెలంగాణకు ఇవ్వకుండా గుజరాత్‌కు లక్షల కోట్లు దండుకుపోయారని మండిపడ్డారు. ఈసారి మళ్లీ అధికారం కావాలని మోదీ అడుగుత లేరని, 400 సీట్లు కావాలని అడుగుతున్నారని, దీంతో ప్రమాదం పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2/3వ వంతు మెజారిటీతో మొత్తం రిజర్వేషన్లనే రద్దు చేయాలని చూస్తున్నదని అన్నారు. మోదీ, అమిత్‌షాలను మనువాద సిద్ధాంతం ఆవహించిందని, బీజేపీకి వేసే ఓటు, రిజర్వేషన్ల రద్దుకు వేసే ఓటనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. జనాభా లెక్కలు చేపడితే కులగణన కూడా జరపాల్సి వస్తుందని ప్రధాని మోదీ జనాభా లెక్కలనే నిర్వహించటం లేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, రిజర్వేషన్లు ఉండాలన్నా, ఉన్నవి పెరగాలన్నా రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని వాడొకడు వీడొకడు అంటున్నడు. ఈ ప్రభుత్వం వైపు చూస్తే లాగుల్లో తొండలు వేసి కొడతారు ప్రజలు. ఇంచు కూడా కదలించలేరు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన కొనసాగుతుంది. ఇచ్చిన గ్యారంటీ పథకాలు అమలవుతాయి’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, జనజాతర సభలను మధ్యాహ్నమే ఏర్పాటు చేసినప్పటికీ సీఎం రేవంత్‌ మూడు నాలుగు గంటల ఆలస్యంగా చేరుకోవటంతో జనం వేచి చూస్తూ ఉండిపోయారు. పలువురు వెళ్లిపోవటం కనిపించింది.

Updated Date - May 04 , 2024 | 05:46 AM