Share News

TS News: కాళేశ్వరం కహాని.. విఫల పథకం

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:30 AM

‘‘2014 కంటే ముందు నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అందరం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం! కానీ.. గత పదేళ్లలో ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదుల నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో చేసిన నిర్వాకాలు..

TS News: కాళేశ్వరం  కహాని.. విఫల పథకం

  • ఈ ప్రాజెక్టు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ తప్పిదమే

  • తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీలు లేవని సీడబ్ల్యూసీ

  • చెప్పిందంటూ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అబద్ధాలు

  • తెరపైకి మేడిగడ్డ.. హడావుడిగా డీపీఆర్‌ తయారీ

  • జియోటెక్నికల్‌ పరిశోధన ఓచోట.. బ్యారేజీలు మరోచోట

  • మేడిగడ్డ కుంగుబాటు కచ్చితంగా మానవ నిర్మిత విపత్తే

  • ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల కాదు.. విఫల పథకం

  • కాళేశ్వరం లోపాలపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు

  • వెదిరె శ్రీరామ్‌ వరుస కథనాలు.. ఆంధ్రజ్యోతి ప్రత్యేకం

‘‘2014 కంటే ముందు నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అందరం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం! కానీ.. గత పదేళ్లలో ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదుల నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో చేసిన నిర్వాకాలు.. మరీముఖ్యంగా గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు తెలంగాణకు శాపంగా మారాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. రాష్ట్ర ప్రజలను కుంగుబాటుకు గురి చేసింది. ఆ ప్రాజెక్ట్‌ వైఫల్యం కేవలం కుంగుబాటు సంఘటన తోనే బయటపడిందా? అంటే.. కానే కాదు. ఈ వైఫల్యం గురించి అప్పటి ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ముందే తెలుసు. తెలిసీ ఈ విషయాన్ని ఎందుకు తొక్కి పెట్టారోగానీ, అది తెలంగాణకు అతి భారంగా పరిణమిం చింది’’ అని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ అంటున్నారు. కాళేశ్వరం నిర్మాణ లోపాలపై, ప్రాజెక్టు వైఫల్యంపై ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన రాసిన వరుస కథనాలు నేటినుంచి..


ఈ ప్రాజెక్టు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ తప్పిదమే

  • కాళేశ్వరం లోపాలపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌

దశాబ్దాల తెలంగాణ కల 2014లో సాకారమైంది. తెలంగాణ ఉద్యమ నినాదమైన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’లో మొదటిది, అతి ముఖ్యమైనది.. నీళ్లు అనేది అందరికీ తెలిసిందే. దాదాపు 980 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపులున్న తెలంగాణ రాష్ట్రానికి గతపాలకులు ఏమీ చేయలేదంటూ నిందించడమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది. ఇలాంటి నిందల కంటే.. ప్రాజెక్టులకు సంబంధించి మంచి ప్రణాళికలు రూపొందించి, సక్రమంగా అమలు చేసి రాష్ట్రప్రజలకు నీటిని అందించడమే ముఖ్యం. కానీ, నీటి విషయంలో, కాళేశ్వరం నిర్మాణం విషయంలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ సర్కారు అసమర్థ ప్రణాళికల కారణంగా భారీగా ప్రజాధనం వృథా కావడమే కాక రాబోయే తరాలూ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. నిజానికి 2014కు ముందు తెలంగాణలోని 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత నదిపై 152 మీటర్ల స్థాయిలో 165 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాణహిత-ఎల్లంపల్లి-చేవెళ్ల (పీవైసీ) ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాలని గత పాలకులు తలపెట్టారు. కానీ, రాష్ట్రం ఏర్పాటయ్యాక కొలువుదీరిన బీఆర్‌ఎస్‌ సర్కారు 152 మీటర్ల ఫుల్‌ రిజర్వాయర్‌ లెవెల్‌పై మహారాష్ట్రను ఒప్పించలేకపోయింది. ఇది కచ్చితంగా ఆ ప్రభుత్వ వైఫల్యమే. వాస్తవం ఇది కాగా.. తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీరు అందుబాటులో లేదని సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) పేర్కొందంటూ.. 2015లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. కానీ అక్కడ 165 టీఎంసీల లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ విస్పష్టంగా, చెప్పింది. అయునా బీఆర్‌ఎస్‌ సర్కారు అదే అబద్ధంతో ప్రాజెక్టును రీ-ఇంజనీరింగ్‌ చేసి లొకేషన్‌ను మేడిగడ్డకు మార్చింది. ప్రాణహిత చేవెళ్లతో పోలిస్తే కాళేశ్వరం నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువ. కానీ.. పెరిగిన ఆయకట్టు మాత్రం 2 లక్షల ఎకరాల్లోపే.


ప్రధాన కారణం..

ఏ ప్రాజెక్టుకైనా.. ప్రణాళిక (ప్లానింగ్‌), దర్యాప్తు (ఇన్వెస్టిగేషన్‌), సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ, మోడలింగ్‌, డిజైనింగ్‌, నిర్మాణం, నాణ్యత, అమలు-నిర్వహణ (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌- ఓ అండ్‌ ఎం).. ఇలా ఒక క్రమం ఉంటుంది. కానీ, 2016లో కాళేశ్వరం డీపీఆర్‌ తయారీయే చాలా హడావుడిగా జరిగింది. సాధారణంగా బ్యారేజీల డిజైన్లు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై తుదినిర్ణయం తీసుకోవడానికి సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) నోడల్‌ యూనిట్‌గా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సరైన డిజైన్లు రూపొందించడానికి సీడీవోకు తగినంత సమయం ఇవ్వలేదు. దానికితోడు ‘ఉన్నతాధికారుల’ ప్రభావం, నిరంతరజోక్యం సరేసరి! అంతేకాదు.. డీపీఆర్‌లో పేర్కొన్న అనేక సాంకేతిక అంశాలను క్షేత్రస్థాయిలో సరిగా పరిశోధించలేదు. సరైన దర్యాప్తు లేకపోవడంతో ప్రాజెక్టుకు సరైన ప్రణాళిక లేకుండా పోయింది. తగినంత సమయం ఇవ్వకుండా ప్లానింగ్‌, ఇన్వెస్టిగేషన్‌ హడావుడిగా చేయడంతో ప్రాజెక్టుకు సరైన డిజైనింగ్‌ జరగలేదు. అలాగే.. బ్యారేజీల నిర్మాణంలో కొన్ని కీలక డిజైన్‌ అంశాలు సరిగ్గా కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కూడా ఉన్నతాధికారులు నిరంతరం జోక్యం చేసుకోవడంతో నిర్మాణ ప్రక్రియపై ప్రభావం పడింది. మోడలింగ్‌ ఏజెన్సీ అయిన తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ లేబొరేటరీస్‌ (టీఎ్‌సఈఆర్‌ఎల్‌)లో సరైన పద్ధతిలో మోడలింగ్‌ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. నిర్మాణ ప్రక్రియలో సీడీవో, టీఎ్‌సఈఆర్‌ఎల్‌తో ప్రాజెక్టు నిర్మాణ విభాగం సరిగా సమన్వయం చేసుకోకపోవడంతో మూడు బ్యారేజీల నిర్మాణం, అమలు, నిర్వహణలో సమన్వయం దెబ్బతింది. బ్యారేజీలు ప్రారంభమయ్యాక.. అమలు, నిర్వహణ (ఓ అండ్‌ ఎం) ప్రొఫెషనల్‌గా జరగలేదు. సీపేజీ, పైపింగ్‌, సీసీ బ్లాకులకు నష్టం కలగడం, ఇతర లోపాలు మొదట్లోనే కనిపించినా.. వాటి తీవ్రతను అర్థం చేసుకునే సీరియ్‌సనెస్‌, ప్రొఫెషనలిజం లేకపోవడంతో వాటిని పరిష్కరించలేకపోయారు. నిర్మాణసమయంలో ఉపయోగించిన కాఫర్‌ డ్యాములు, షీట్‌ పైల్స్‌ను 5 సీజన్లుగా తొలగించకపోవడం వల్ల బ్యారేజీలో నది సహజ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడింది. ఈ వైఫల్యాలన్నీ విపత్తుకు కారణమయ్యాయి.


సమయమే ఇవ్వలేదు..!

ప్రాజెక్టు కట్టే చోట జియోటెక్నికల్‌ పరిశోధనలు చేయడం, నాణ్యత, పర్మియబిలిటీని (రాళ్ల గుండా నీరు ప్రవహించే సామర్థ్యం) పరీక్షించడం, ఆ డేటాతో నిర్మాణాలను ప్లాన్‌ చేయడం.. వీటన్నింటికీ 8 నెలల నుంచి ఏడాది దాకా పడుతుంది. కానీ.. డీపీఆర్‌ తయారీకి 4నెలల సమయమే ఇచ్చారు. జియోటెక్నికల్‌ పరిశోధనకూ తగిన సమయం ఇవ్వలేదు. ఇవన్నీ ప్లానింగ్‌, డిజైన్లపై తీవ్రప్రభావం చూపాయి. అంతేనా.. డీపీఆర్‌ తయారీకి ముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైంది.

పరిశోధన ఒకచోట.. నిర్మాణం మరోచోట

డీపీఆర్‌లో పేర్కొన్న పలు కీలక అంశాలు కూడా డిజైనింగ్‌, నిర్మాణంలో కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు.. మూడు బ్యారేజీలను కట్టాలని భావించిన చోట జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసి డీపీఆర్‌లో పొందుపరిచారు. కానీ.. నాటి సర్కారు డీపీఆర్‌ను సమర్పించిన తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీ స్థలాలను మార్చేసింది. అలా ఒక ప్రాంతంలో చేసిన జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ మరో ప్రదేశానికి పనికిరాదు. కొత్తచోట మళ్లీ కొత్తగా జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సిందే. కానీ.. అలా చేయకుండానే డిజైన్‌, నిర్మాణ ప్రక్రియను కొనసాగించారు. బ్యారేజీలను సరిగ్గా నిర్మించలేదనడానికి ఇది ప్రధాన ఆధారం. అలాగే.. నిర్మాణంలో షీట్‌ పైల్స్‌ను వినియోగించాలని సూచించినప్పటికీ.. డిజైన్లలో వాటిని సీకెంట్‌ పైల్స్‌గా మార్చారు. ఇక.. సీడీవో సిఫారసులు నిర్మాణ యూనిట్‌పై ప్రభావం చూపాల్సి ఉండగా.. ప్రాజెక్టు నిర్మాణ యూనిట్‌ అభ్యర్థనలకు అనుగుణంగా సీడీవో పలు డిజైన్‌ మార్పులు చేసింది. అలాగే.. తగిన మోడలింగ్‌ అధ్యయనాలను నిర్వహించడానికి టీఎ్‌సఈఆర్‌ఎల్‌కు తగినంత సమయం ఇవ్వలేదు. మోడలింగ్‌ అధ్యయనాలను ప్రొఫెషనల్‌ పద్ధతిలో నిర్వహించడానికి తగిన మౌలిక సదుపాయాలు టీఎ్‌సఈఆర్‌ఎల్‌కు లేవు. వాటిని బలోపేతం చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రవాహ పరిస్థితులను క్రమబద్ధీకరించడం, ప్రతి బ్యారేజీకీ గేట్‌ ఆపరేషన్‌ షెడ్యూల్‌ వంటి టీఎ్‌సఈఆర్‌ఎల్‌ చేసిన పలు సిఫారసులను ప్రాజెక్టు నిర్మాణ విభాగం విస్మరించింది. టీఎ్‌సఈఆర్‌ఎల్‌ సిఫారసులను ఆ విభాగం పాటించడానికి బదులు.. నిర్మాణ యూనిట్‌ అవసరాలకు అనుగుణంగా టీఎ్‌సఈఆర్‌ఎల్‌ పనిచేసింది. ఇది వ్యవస్థాగత లోపంగా కనిపిస్తోంది.


థర్డ్‌ పార్టీ ఆడిట్‌ ఏదీ?

సాధారణంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నాణ్యతను థర్డ్‌పార్టీతో ఆడిట్‌ చేయించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ అలాంటిదేదీ నిర్వహించలేదు. నిర్మాణ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల్లో కూడా అలాంటి నిబంధనలేవీ పెట్టలేదు. కాగా.. మేడిగడ్డ బ్యారేజీలో 2019లో వర్షాకాలం ప్రారంభమైన వెంటనే కటాఫ్‌ వాల్‌ దిగువన ఉన్న సీసీ బ్లాకుల దిగువ ప్రాంతంలో నీరు బయటకు రావడం ప్రారంభమైంది. అయినా రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటిని మరమ్మతుల కోసం ఖాళీ చేయకుండా అవసరాలకు వాడుకుంటూ వచ్చారు. సంబంధిత ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో రిజర్వాయర్‌ మరమ్మతులకు నోచుకోలేదు. మరమ్మతులు, కాలానుగుణ నిర్వహణ ప్రొటోకాల్‌ పూర్తిగా లేకపోవడంతో.. ఏటా క్రమంగా క్షీణించి, చివరికి మేడిగడ్డ బ్యారేజీ అతిపెద్ద వైఫల్యంగా మారింది. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా మేడిగడ్డ లాగా ఒకే రకమైన డిజైన్లు, నిర్మాణ పద్ధతులను కలిగి ఉండడంతో అవి కూడా తీవ్ర విపత్కర పరిస్థితులు, నష్టాలను చవిచూశాయి. వీటిలో ఏ బ్యారేజీకీ అమలు, నిర్వహణ నిబంధనావళి (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ మాన్యువల్‌) లేదు.

నాలుగు చర్యలు..

  • కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. ప్రభుత్వం నాలుగు అంశాలను ప్రాధాన్య ప్రాతిపదికన పరిశీలించాలి. అవి..

  • బ్యారేజీలు మరింత క్షీణించకుండా ఉండటానికి తీసుకోవాల్సిన మధ్యంతర చర్యలు.

  • జరిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి చేయవలసిన పరిశోధనలు, పరీక్షలు.

  • ఆ పరిశోధనలు, పరీక్షల ఫలితాల ఆధారంగా చేయాల్సిన మరమ్మతులపై దృష్టి సారించడం.

  • బ్యారేజీలను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సక్రమంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన శాశ్వత చర్యలను గుర్తించడం.

Updated Date - Apr 29 , 2024 | 06:50 AM