Share News

పాలమూరులో పోరు హోరు!

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:58 AM

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో త్రిముఖ పోరు నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు.

పాలమూరులో పోరు హోరు!

మహబూబ్‌నగర్‌లో ముక్కోణపు పోరు.. సొంత గడ్డ కావడంతో సీఎం రేవంత్‌కు ప్రతిష్ఠాత్మకం

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లోనూ గెలిచి మాంచి జోష్‌ మీద ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది. చల్లా వంశీచంద్‌ రెడ్డి ఈసారి పార్లమెంటులో అడుగు పెట్టి గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణ.. ఈసారి గెలిచి సత్తా చాటాలని సంకల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడినా.. ఓట్లపరంగా రెండో స్థానంలో నిలవడంతో వరుసగా నాలుగోసారీ గెలిచి పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. తద్వారా, జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని ఆ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌కు ప్రతిష్ఠాత్మకం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో మహబూబ్‌నగర్‌లో గెలుపును ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఏడుసార్లు పార్లమెంట్‌ పరిధిలో పర్యటించారు. ఏడు దశాబ్దాల తర్వాత పాలమూరుకు సీఎం పదవి రావడం, గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి సొంత జిల్లాల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీలే గెలుచుకోవడంతోపాటు పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేక బీజేపీ-బీఆర్‌ఎస్‌ కుట్రలతో దెబ్బతీయాలని చూస్తున్నాయంటూ రేవంత్‌ సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తన గెలుపునకు ఇప్పుడు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా వంశీచంద్‌ శ్రమిస్తున్నారు.

గెలిచి తీరాలని డీకే అరుణ

బీజేపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి ముందే డీకే అరుణ, ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకున్నట్లు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే, ఇక్కడ పట్టున్న జితేందర్‌ రెడ్డి కాంగ్రె్‌సలో చేరడం బీజేపీకి మైనస్సే. తాను పాలమూరు ఆడబిడ్డనని, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, పాలమూరు- రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు తన కృషితో వచ్చాయని అరుణ ప్రచారం చేసుకుంటున్నారు. సిటింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె శ్రీనివా్‌సరెడ్డి కొంత ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినా.. నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ప్రధాన పోటీదారుగా నిలుస్తున్నారు. పాలమూరును ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను చూసి ఓటేయాలని కోరుతున్నారు.


ప్రాజెక్టులే ప్రధాన ఎజెండా

పాలమూరు జిల్లాలో ఏ ఎన్నిక వచ్చినా ప్రాజెక్టులే ప్రధాన ఎజెండాగా మారడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ హోదాపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. 2014 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పాలమూరులో పర్యటించిన ప్రధాని మోదీ.. పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామంటూ హామీ ఇచ్చి మోసం చేశారని, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న అరుణ కూడా జాతీయ హోదా తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి విమర్శిస్తున్నారు. అయితే, 60 శాతం నిధులు ఇస్తామని కేంద్రం చెప్పినా కాంగ్రెస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని అరుణ మండిపడుతున్నారు. అలాగే, 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.4,000 కోట్లతో మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన రేవంత్‌.. దానినే ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నారు.

అరుణ బలంగా ఉంటుందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా నీరందనుండటంతో విస్తృత ప్రచారం చేస్తోంది. అదే సమయంలో, పదేళ్లు అధికారంలో ఉండి.. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేయలేదని, నారాయణపేట, మక్తల్‌, కొడంగల్‌ నియోజకవర్గాలకు నీరిచ్చే జీఓ 69ను తొక్కి పెట్టిందని బీఆర్‌ఎ్‌సనూ కాంగ్రెస్‌ తప్పుపడుతోంది. అయితే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చి న తర్వాతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి లభ్యత పెరిగిందని, ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి లక్షలాది ఎకరాలకు నీరిచ్చామని ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివా్‌సరెడ్డి చెబుతున్నారు.


మూడుసార్లు వరుసగా గెలిచి బీఆర్‌ఎస్‌ ఇక్కడ హ్యాట్రిక్‌ కొట్టింది! కానీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్‌ విజయకేతనం ఎగరేసింది! పార్లమెంటు పరిధిలో బీఆర్‌ఎస్‌ కంటే లక్ష ఓట్లకుపైగా కాంగ్రెస్‌కే వచ్చాయి! ఇక, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత గడ్డ కావడంతో ఆ పార్టీకి మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది! మరోవైపు, గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ.. ఇప్పుడు పాలమూరుపై మరోసారి కాషాయ జెండా ఎగరేయాలని పావులు కదుపుతోంది! ఈసారైనా పార్లమెంటులో అధ్యక్షా అనాలని ఫైర్‌ బ్రాండ్‌ డీకే అరుణ పట్టుదలగా ఉన్నారు. వెరసి, పాలమూరులో హోరాహోరీ పోరు నెలకొంది!

లోకల్‌-నాన్‌ లోకల్‌ పంచాయితీ

మూడు పార్టీల అభ్యర్థులు లోకల్‌, నాన్‌ లోకల్‌ పంచాయితీని తెరపైకి తెస్తున్నారు. అరుణ, వంశీచంద్‌ గద్వాల, కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఇవి నాగర్‌ కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఈ ప్రాంతం వారు కాదని, తాను మాత్రమే లోకల్‌ అని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివా్‌సరెడ్డి చెబుతున్నారు. అయితే, ఈ పార్లమెంట్‌ పరిధిలోనే తాను పుట్టిన ఊరు ఉందని అరుణ గుర్తుచేస్తున్నారు. గుజరాత్‌లో పుట్టిన మోదీ వారాణసిలో ఎలా పోటీ చేస్తున్నారని వంశీచంద్‌ ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 05:58 AM