Share News

KTR : బడా భాయ్‌ మోదీ- చోటా భాయ్‌ రేవంత్‌

ABN , Publish Date - May 04 , 2024 | 05:20 AM

అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న బడా భాయ్‌ మోదీకి.. చోటా భాయ్‌ ఖేడి రేవంత్‌కు బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

KTR : బడా భాయ్‌ మోదీ- చోటా భాయ్‌ రేవంత్‌

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన వారికి బుద్ధి చెప్పాలి

కేంద్రం మెడలు వంచేది బీఆర్‌ఎస్సే

సికింద్రాబాద్‌ రోడ్‌ షోలో కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/ అడ్డగుట్ట, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న బడా భాయ్‌ మోదీకి.. చోటా భాయ్‌ ఖేడి రేవంత్‌కు బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందుకు కారు గుర్తుపై ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, నాంపల్లి నియోజకవర్గాల్లో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎంపీగా కిషన్‌ రెడ్డి కుర్‌కురేలు పంచడం, సింటెక్స్‌ ట్యాంక్‌లు ప్రారంభించడం తప్ప సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఉండే పెద్దల మెడలు వంచాలన్నా.. తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు రావాలన్నా బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో ఉండాలన్నారు. కాంగ్రెసోళ్ల కాళ్లు మంచివి కావని, వాళ్లు అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో కరెంట్‌ కష్టాలు, తాగునీటి గోస మొదలైందని విమర్శించారు. కాంగ్రె్‌సకు ఓటేస్తే బీజేపీ లాభపడుతుందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే మోదీ రూపాయి ఇవ్వలేదని, గుజరాత్‌కు మాత్రం రూ.1000 కోట్లు తీసుకెళ్లారని ఆరోపించారు.


గుడి కట్టడం ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే.. కేసీఆర్‌ యాదాద్రి ఆలయం నిర్మించలేదా..? దేవుళ్లను అడ్డం పెట్టుకొని మనం రాజకీయం చేస్తున్నమా..? అన్నారు. ఆధునిక దేవాలయం కాళేశ్వరం నిర్మించారని, రిజర్వాయర్లకూ దేవుళ్ల పేర్లు పెట్టారని, మీ కంటే ఎక్కువ దేవుళ్లని పూజించేది కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ‘బీజేపోళ్లు మనకు కట్లు, బొట్టు నేర్పినట్టు బిల్డప్‌ ఇస్తరు.. వాళ్ల కన్నా ముందుకు మనకు దేవుడు తెలియదా..? బీజేపీ ఓడిపోయినా దేవుడికి జరిగే నష్టం లేదన్నా’రు. మతం పేరిట రాజకీయం చేసే సన్నాసులకు కచ్చితంగా బుద్ధి చెప్పాలన్నారు. మైనార్టీలపై కాంగ్రె్‌సది కపట ప్రేమని ఆరోపించారు. కాంగ్రె్‌సకు మైనార్టీలపై ప్రేమే ఉంటే రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుక ఎందుకివ్వలేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. గోషామహల్‌లో బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని ఆరోపించారు. గులాబీ కండువాతో గెలిచిన దానం నాగేందర్‌ పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం రేవంత్‌తో కలిసి బీజేపీలో చేరతారని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు ఎంపీగా భారీ మోజార్టితో గెలుస్తున్నారని ఈ సందర్భంగా కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - May 04 , 2024 | 05:20 AM