Share News

RR vs DC: రెచ్చిపోయిన రియాన్.. ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - Mar 28 , 2024 | 09:40 PM

జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‪తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

RR vs DC: రెచ్చిపోయిన రియాన్.. ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం ఎంతంటే?

జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‪తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యువ ఆటగాడు రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 పరుగులు) అద్భుతంగా రాణించడం వల్లే రాజస్థాన్ అంత భారీ స్కోరు చేయగలిగింది. మిగిలిన ఆటగాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. అశ్విన్ (29), జురేల్ (20), షిమ్రోన్ (14) తమవంతు సహకారం అందించి, జట్టుకి గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించారు.


మొదట్లో ఢిల్లీ జట్టు బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు. 36 పరుగులకే మూడు వికెట్లు తీసి.. రాజస్థాన్ జట్టుపై ఒత్తిడి పెంచారు. ఒక దశలో రాజస్థాన్ బ్యాటింగ్ పరిస్థితి చూసి.. 150 పరుగులైనా కొట్టగలరా? అనే అనుమానం రేకెత్తింది. అయితే.. ఆ తర్వాత రియాన్, అశ్విన్ కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో వికెట్ పడకుండా.. ఆచితూచి ఆడుతూ, వీలు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీళ్లు నాలుగో వికెట్‌కి 54 పరుగులు జోడించారు. అశ్విన్ మూడు సిక్సులతో ఆశ్చర్యపరిచాడు. ఇంతలో అశ్విన్ భారీ షాట్ కొట్టబోయి, క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జురేల్‌తో కలిసి రియాన్ మెరుపులు మెరిపించాడు. వీళ్లు ఐదో వికెట్‌కి 52 పరుగులు జోడించారు. ముఖ్యంగా.. మొదట్లో నిదానంగా ఆడిన రియాన్, చివర్లో మాత్రం భారీ షాట్లతో ఢిల్లీ బౌలర్లపై ధ్వజమెత్తాడు.

ముఖ్యంగా.. చివరి ఓవర్‌లో అయితే రెండు సిక్సులు, మూడు ఫోర్లతో శివాలెత్తాడు. అవతల నోర్ట్యే లాంటి భయంకరమైన బౌలర్ ఉన్నా లెక్క చేయకుండా.. బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. కేవలం 45 బంతుల్లోనే 84 పరుగులు చేశాడంటే.. ఏ రేంజ్‌లో రియాన్ ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. అతని పుణ్యమా అని.. రాజస్థాన్ జట్టు 185 పరుగుల స్కోరు చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్ గెలుపొందాలంటే ఢిల్లీ జట్టు 186 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి, ఆ లక్ష్యాన్ని వాళ్లు ఛేధిస్తారా? లేక తుస్సుమంటారా? అనేది మరికాసేపట్లో తేలిపోనుంది.

Updated Date - Mar 28 , 2024 | 09:40 PM