Share News

DC vs KKR: విజృంభించిన కేకేఆర్ బౌలర్లు.. డీసీ ఎంత కొట్టిందంటే?

ABN , Publish Date - Apr 29 , 2024 | 09:52 PM

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించి, వరుస వికెట్లు పడగొట్టారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్‌తో పాటు స్టార్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో..

DC vs KKR: విజృంభించిన కేకేఆర్ బౌలర్లు.. డీసీ ఎంత కొట్టిందంటే?

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించి, వరుస వికెట్లు పడగొట్టారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్‌తో పాటు స్టార్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో.. డీసీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎనిమిదో స్థానంలో వచ్చిన కుల్దీప్ యాదవ్ (35) చివర్లో కాస్త రప్ఫాడించడంతో.. డీసీ జట్టు ఆ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. లేకపోతే.. అత్యల్ప స్కోరుకే చాపచుట్టేసే పరిస్థితి నెలకొనేది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ జట్టుకి ఆది నుంచే వరుస ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. 17 పరుగుల వద్ద పృథ్వీ షా ఔట్ అవ్వగా.. గత మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన జేక్ ఫ్రేసర్ (12) కూడా 30 పరుగుల వద్ద వెనుదిరిగాడు. సరే.. ఓపెనర్లు త్వరగా ఔటయ్యారు కదా, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చే బ్యాటర్లు జట్టుని ఆదుకుంటారనుకుంటే, వాళ్లు కూడా చేతులెత్తేశారు. క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి, పెవిలియన్ బాట పట్టారు. మధ్యలో కెప్టెన్ రిషభ్ పంత్ (27) కాసేపు రాణించాడే తప్ప.. అతనూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక దాదాపు డీసీ పని అయిపోయిందనుకున్న తరుణంలో.. కుల్దీప్ యాదవ్ ఊపిరి పోశాడు.

ఆచితూచి ఆడుతూనే.. వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు కుల్దీప్ బాదాడు. 26 బంతులు ఆడిన అతను.. 5 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 35 పరుగులు చేసి, జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. చివరివరకూ క్రీజులోనే నిల్చొని, గౌరవప్రదమైన స్కోరు జోడించి, ఘోర పరిస్థితి నుంచి జట్టుని బయటపడేసి, డీసీ పరువుని కాపాడాడు. ఇక కేకేఆర్ బౌలర్ల విషయానికొస్తే.. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా.. అరోరా, రానా తలా రెండు, మిచెల్ స్టార్క్, నరైన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు. మరి.. 154 పరుగుల స్కోర్‌ని ఢిల్లీ బౌలర్లు డిఫెండ్ చేసుకోగలుగుతారా? లేదా? అనేది చూడాలి.

Updated Date - Apr 29 , 2024 | 09:52 PM