Share News

ఆస్ట్రాజెనెకా, సీరమ్‌పై కేసు వేస్తాం

ABN , Publish Date - May 04 , 2024 | 05:07 AM

కొవిషీల్డ్‌ టీకా వేయించుకున్న కొంతకాలానికే తన కుమార్తెను పోగొట్టుకున్న ఓ తండ్రి.. ఆ టీకాతో దుష్ప్రభావాలున్నాయంటూ ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఆ కంపెనీపైన, సీరం సంస్థపైన కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమయ్యారు.

ఆస్ట్రాజెనెకా, సీరమ్‌పై కేసు వేస్తాం

టీకా మరణాలకు కారణమైన

అందరిపైనా న్యాయపోరాటం చేస్తాం

కొవిషీల్డ్‌ టీకా కారణంగా కుమార్తెను

కోల్పోయిన ఓ తండ్రి ఆవేదన

న్యూఢిల్లీ, మే 3: కొవిషీల్డ్‌ టీకా వేయించుకున్న కొంతకాలానికే తన కుమార్తెను పోగొట్టుకున్న ఓ తండ్రి.. ఆ టీకాతో దుష్ప్రభావాలున్నాయంటూ ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఆ కంపెనీపైన, సీరం సంస్థపైన కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన పేరు వేణుగోపాలన్‌ గోవిందన్‌. ఆయన కుమార్తె కారుణ్య వేణుగోపాల్‌ డేటా సైన్స్‌ విద్యార్థి. 2021 జూన్‌లో ఆమె కొవిషీల్డ్‌ టీకా తీసుకుంది.

టీకా తీసుకున్న ఎనిమిది రోజులకు ఆమె అనారోగ్యం బారిన పడింది. శరీరంలోని పలు అవయవాలు ఇన్‌ఫ్లమేషన్‌ (వాపునకు) గురయ్యాయి. దాదాపు నెలరోజుల తర్వాత 2021 జూలైలో ఆమె మరణించింది. చనిపోయేనాటికి ఆమె వయసు కేవలం 20 ఏళ్లు.

ఉన్న ఆమె తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు తమకు కానుకగా అందించిన కారుణ్యను అల్లారుముద్దుగా పెంచుకున్నామని.. టీకా తీసుకోకముందు ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని, పూర్తి ఆరోగ్యంతో ఉండేదని.. కేవలం వ్యాక్సిన్‌ కారణంగా ఆమెను కోల్పోయామని వేణుగోపాలన్‌ గోవిందన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన టీకా కార్యక్రమాల విభాగం కారుణ్య మరణంపై విచారణ జరిపి 2021 నవంబరులో ఒక నివేదిక ఇచ్చింది. దాంట్లో ఆమె కారుణ్య మరణాన్ని ‘బీ1’ కేటగిరీలో చేర్చింది. అంటే.. ఆమె మరణానికి టీకానే కారణమనడానికి తగిన ఆధారాలు లేవని అర్థం.

దీంతో గోవిందన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె మరణానికి ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని.. టీకా దుష్ప్రభావాలను ముందుగానే గుర్తించి, తక్షణం చికిత్స చేసేలా ఒక ప్రొటోకాల్‌ రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంను కోరారు.

ఈ కేసు విచారణలో భాగంగా 2022 నవంబరులో కేంద్ర ప్రభుత్వం.. కొవిడ్‌ టీకా కారణంగా సంభవించే మరణాలకు పరిహారం ఇచ్చే బాధ్యత తమది కాదని సుప్రీం కోర్టుకు తేల్చిచెప్పింది. తాజాగా.. ఈ టీకా దుష్ప్రభావాలపై ఆస్ట్రాజెనెకా ప్రకటన నేపథ్యంలో కారుణ్య తల్లిదండ్రులు మళ్లీ కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. దీనిపై గోవిందన్‌ ‘ఎకనమిక్‌ టైమ్స్‌ వార్తాసంస్థ’కు ఒక వ్యాసం రాశారు.

కొవిషీల్డ్‌ టీకాను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చిన రెండునెలల్లోపే.. అంటే, 2021 మార్చిలోనే యూర్‌పలోని 15 దేశాలు ఈ టీకా వల్ల కలిగే దుష్ప్రభావాలను గుర్తించి.. ప్రజలకు ఇవ్వడం నిలిపివేశాయని గుర్తుచేశారు.

యూరప్‌ దేశాల్లో ఈ టీకా వేయడాన్ని ఆపేసిన విషయం తెలిసీ దాన్ని మనదేశంలో ఎందుకు నిలిపివేయలేదని ప్రభుత్వాన్ని, సీరమ్‌ సంస్థను ప్రశ్నించారు.

న్యాయం కోసం.. ప్రజారోగ్యం పేరిట ఇలాంటి దారుణాలు మళ్లీ చేయకుండా ఉండడం కోసం.. ఎంతోమంది మరణాలకు కారణమైనవారందరిపైనా తమలాగానే ఈ టీకా కారణంగా పిల్లలను కోల్పోయిన మరో ఏడు కుటుంబాలతో కలిసి ఈ పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - May 04 , 2024 | 05:07 AM