Share News

AP ELECTION 2024: హలో .. వస్తున్నాం!

ABN , Publish Date - May 10 , 2024 | 06:19 AM

పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచే ఓటు సందడి మొదలైంది. మన రాష్ర్టానికి చెందిన ప్రవాసులు, ఇతర రాష్ర్టాలలోని ఐటీ ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనేందుకు భారీగా తరలివస్తున్నారు. దేశీయంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర దూరప్రాంత నగరాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, ఉపాధి పొందుతున్నవారు కూడా ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు.

AP ELECTION 2024:  హలో .. వస్తున్నాం!

ఎన్నికల కోసం ఏపీకి భారీగా ప్రవాసులు.. రేపు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానం

షార్జా నుంచి ఎక్కువగా కదులుతున్న ఆంధ్రులు

దక్షిణ తూర్పు ఆసియా దేశాలు, అమెరికా, కెనడా,

ఫ్రాన్స్‌, యూరప్‌, ఆస్ర్టేలియాల నుంచి కూడా...

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లోని

ఐటీ ఉద్యోగులు భారీగా విజయవాడకు రాక

(హైదరాబాద్‌, విజయవాడ- ఆంధ్రజ్యోతి):

పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచే ఓటు సందడి మొదలైంది. మన రాష్ర్టానికి చెందిన ప్రవాసులు, ఇతర రాష్ర్టాలలోని ఐటీ ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనేందుకు భారీగా తరలివస్తున్నారు. దేశీయంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర దూరప్రాంత నగరాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, ఉపాధి పొందుతున్నవారు కూడా ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు. గురువారం నుంచే రాష్ట్రానికి వచ్చే ప్రవాసులతో విమానాలు, రైళ్లు, బస్సులు కిటకిటలాడిపోతున్నాయి.

హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రాక ప్రారంభమైంది. ఒక్క హైదరాబాద్‌ నుంచే లక్షన్నర మంది ఏపీకి తరలి వస్తున్నారన్నది ఆర్టీసీ అధికారుల అంచనాగా ఉంది. వారం రోజుల మందుగానే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మే 11, 12, 13 తేదీలలో షెడ్యూల్‌ బస్సులలో సీట్లన్నీ బుక్‌ అయిపోయాయి. మే 13 వ తేదీన ఓటు హక్కు వినియోగించుకుని తిరుగు ప్రయాణమయ్యేవారు ఎక్కువమంది ఉంటారు.

అలాంటివారు బుకింగులకు పోటెత్తడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే బస్సులు కూడా నూరు శాతం రిజర్వేషన్‌ను పూర్తి చేసుకున్నాయి. దీంతో భారీగా రాకపోకలు ఉంటాయన్న అంచనాతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వారి కోసం అదనంగా 70 స్పెషల్‌ బస్సులు నడపాలని నిర్ణయించామని ఆర్టీసీ పీఎన్‌బీఎస్‌ డీసీటీఎం బషీర్‌ అహ్మద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. రానున్న రెండు రోజులలో ఈ సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత స్లాక్‌ (మందకొడి)సీజన్‌లో ఆర్టీసీ దూరప్రాంత షెడ్యూల్డ్‌ బస్సులలో 30 శాతం ఆక్యుపెన్సీ కూడా దాటడం లేదు. అలాంటిది గురువారం సాయంత్రం నాటికి 80 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. దీనిని బట్టి హైదరాబాద్‌, ఇతర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఏపీకి వస్తున్నారన్నది అర్ధమౌతోంది.


హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలలో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న వారంతా.. సెలవులు పెట్టి ఏపీకి వచ్చేస్తున్నారు. ప్రవాస భారతీయులు ఇప్పటికే స్వల్ప సంఖ్యలో వచ్చారు. బుధవారం విజయవాడలో జరిగిన మోదీ రోడ్డు షో కార్యక్రమంలో ప్రవాస భారతీయులు ప్లకార్డులు చేతబూని మరీ పాల్గొన్నారు. దక్షిణ తూర్పు ఆసియా దేశాలలో ఉంటున్నవారితో పాటు అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, ఆస్ర్టేలియా, యూరప్‌ ప్రాంతాలలో ఉంటున్న ప్రవాసులు తమ దేశాల నుంచి ఢిల్లీ, హైదరాబాద్‌లకు విమానాల్లో రావటానికి బుక్‌ చేసుకున్నారు.

గల్ఫ్‌ దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రవాసులు విజయవాడ విమానాశ్రయానికి నేరుగా బుక్‌ చేసుకున్నారు. గల్ఫ్‌ దేశాల నుంచి చూస్తే ప్రధానంగా షార్జా నుంచి విజయవాడకు ప్రవాసుల రాకపోకలు పెరిగాయి. 11న భారీ సంఖ్యలో ప్రవాసీయులు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నట్టు ఎన్‌ఆర్‌ఐ వేమూరి రాజేశ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

50 రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు....20 రైళ్లకు అదనపు కోచ్‌లు

మే 10నుంచి 14వరకు హైదరాబాద్‌ నుంచి ఏపీలోని ఆయా ప్రాంతాలకు వెళ్లే 50 రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మే10, 12 తేదీల్లో సికింద్రాబాద్‌-విశాఖపట్నం (12740), మే11, 13 తేదీల్లో విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (12739), మే11న సికింద్రాబాద్‌-విశాఖపట్నం (22204), మే12న విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (22203), మే9నుంచి 11వరకు మచిలీపట్నం-బీదర్‌ (12749) మే10 నుంచి 12వరకు బీదర్‌-మచిలీపట్నం (12750), మే10, 11 తేదీల్లో కాచిగూడ-గుంటూరు (17252). మే11,12 తేదీల్లో గుంటూరు-కాచిగూడ (17251), మే10, 11 తేదీల్లో కాచిగూడ-రేపల్లె (17625), మే12, 13 తేదీల్లో రేపల్లె- వికారాబాద్‌ (17626), మే10 నుంచి 12 వరకు గుంటూరు-తిరుపతి (17261), మే11నుంచి 13వరకు తిరుపతి-గుంటూరు (17262), మే10 నుంచి 12 తేదీల్లో గుంటూరు-వికారాబాద్‌ (12747), మే10 నుంచి 12 వరకు వికారాబాద్‌-గుంటూరు, (17248) మే11నుంచి 13వరకు గుంటూరు-విశాఖపట్నం (17239), మే12నుంచి 14 వరకు విశాఖపట్నం-గుంటూరు (17240), మే11నుంచి 14వరకు సికింద్రాబాద్‌ -వియవాడ, (17214), మే11 నుంచి 14 వరకు విజయవాడ,-సికింద్రాబాద్‌ (17213), మే9 నుంచి 11 వరకు నర్సాపూర్‌-ధర్మవరం (17247), తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు

Updated Date - May 10 , 2024 | 06:19 AM