Share News

గోవాపై బీజేపీ, కాంగ్రెస్‌ ధీమా!

ABN , Publish Date - May 04 , 2024 | 05:03 AM

మూడో విడతలో భాగంగా గోవాలోని రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

గోవాపై బీజేపీ, కాంగ్రెస్‌ ధీమా!

  • ప్రధాని మోదీ కరిష్మాపైనే బీజేపీ ఆశలు

  • ప్రభుత్వ వ్యతిరేకతే కూటమి ప్రచారాస్త్రం

పనాజీ, మే 3: మూడో విడతలో భాగంగా గోవాలోని రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఇక్కడ ప్రధాని మోదీ కరిష్మాతో గెలుపొందాలని బీజేపీ భావిస్తుండగా.. ఉపాధి కల్పన, అవినీతి రహిత పాలన అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్‌ తన ప్రచారాస్త్రాలుగా ఎంచుకుంది.

ఉత్తర, దక్షిణ గోవా ఎంపీ స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర గోవా నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఐదుసార్లు ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి రమాకాంత్‌ ఖలా్‌పతో పోటీపడుతున్నారు.

ఇక దక్షిణ గోవాలో బీజేపీ మహిళా అభ్యర్థి, వ్యాపారవేత్త పల్లవి డెంపో, కాంగ్రెస్‌ అభ్యర్థి విరియాతో ఫెర్నాండెజ్‌తో తలపడనున్నారు. ఈ ఎన్నికలపై బీజేపీ గోవా అధికార ప్రతినిధి యతీశ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజ లు స్థిరత్వం కోరుకుంటున్నారు.

వారికి కిచిడీ (బహుళ పార్టీల) ప్రభుత్వం అక్కర్లేదు’ అని అన్నారు. వచ్చే ఐదేళ్లపాటు దేశాన్ని ఎవరు పాలించాలనేది ప్రజలు ఓటేసే ముందు ఆలోచించాలన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించారని, ప్రపంచ నాయకుడిగా ఎదిగారని అన్నారు. బీజేపీ పాలనలో జనం అభివృద్ధిని చూశారని నాయక్‌ అన్నారు.

గోవాలోని రెండు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంటుందని, దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాల మార్కుని దాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాగా, ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇండియా కూటమిలో భాగమైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జీఎ్‌ఫపీ) ప్రధాన కార్యదర్శి దుర్గాదాస్‌ కామత్‌ అన్నారు. ‘రాష్ట్రంల నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది..

అలాగే మైనింగ్‌ సమస్యను పరిష్కరించడంలోనూ, గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని కామత్‌ విమర్శించారు.

ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనూకలంగా మలచుకోవాల్సిన బాధ్యత ఇండియా కూటమిపై ఉందన్నారు. ఈ నెల 7న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి చెందిన ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కూటమి అభ్యర్థుల ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సభలకు హాజరవుతున్నారని కామత్‌ చెప్పారు.

2019 ఎన్నికల్లో ఉత్తర గోవాలో సిట్టింగ్‌ ఎంపీ నాయక్‌ 2.44 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. దక్షిణ గోవాలో బీజేపీ అభ్యర్థి నరేంద్ర సవైకర్‌ 9,755 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఫ్రాన్సిస్కోపై విజయం సాధించారు.

Updated Date - May 04 , 2024 | 05:03 AM