Share News

Association for Democratic Reforms: వైసీపీ అభ్యర్థుల్లో 87 మందిపై క్రిమినల్‌ కేసులు

ABN , Publish Date - May 10 , 2024 | 06:30 AM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 175మంది వైసీపీ అభ్యర్థుల్లో 87మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో టీడీపీ అభ్యర్థులు 42 మంది ఉండగా, బీజేపీ నుంచి 8 మంది, జనసేన అభ్యర్థులు 10మంది ఉన్నారు.

Association for Democratic Reforms: వైసీపీ అభ్యర్థుల్లో 87 మందిపై క్రిమినల్‌ కేసులు

టీడీపీలో 42 మందిపై కూడా: ఏడీఆర్‌

న్యూఢిల్లీ, మే 9(ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 175మంది వైసీపీ అభ్యర్థుల్లో 87మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో టీడీపీ అభ్యర్థులు 42 మంది ఉండగా, బీజేపీ నుంచి 8 మంది, జనసేన అభ్యర్థులు 10మంది ఉన్నారు. ఇక, 604 మంది కోటీశ్వరులు అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. వీరిలో వైసీపీ నుంచి 165, టీడీపీ 134, జనసేన 18, బీజేపీ 8, కాంగ్రెస్‌ 79, సీపీఎం, సీపీఐ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. తాజా ఎన్నికల్లో 229(10%) మంది మహిళలు పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికల్లో 193మంది పోటీ చేయగా ఈసారి ఆ సంఖ్య పెరిగింది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌), ఏపీ ఎలక్షన్‌ వాచ్‌ ఈ వివరాలను తమ నివేదికలో వెల్లడించాయి. మొత్తం అభ్యర్థుల్లో 543 మందిపై క్రిమినల్‌ కేసులు, 374 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వైసీపీ 87, టీడీపీ 42, కాంగ్రెస్‌ 42, జనసేన 10, బీజేపీ 8, సీపీఎం, సీపీఐలో ఐదుగురి చొప్పున అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులన్నాయి.

తీవ్రమైన నేరాలకు సంబంధించి వైసీపీ 49, టీడీపీ 85, కాంగ్రెస్‌ 20, జనసేన 7, బీజేపీ 5, సీపీఎం 3, సీపీఐ ఇద్దరు అభ్యర్థులపై కేసులున్నాయి. అసెంబ్లీ బరిలో మొత్తం 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యధికంగా రూ.931కోట్ల ఆస్తులున్నాయి.


రూ.824 కోట్లతో నెల్లూరు సిటీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ రెండోస్థానంలో ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ రూ.757 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నారు.

అత్యధిక అప్పులు ఉన్న వారిలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతికి రూ.197 కోట్లు, నారాయణ పొంగూరుకు రూ.190 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా సీఎం జగన్‌ కుటుంబానికి ఏడాదికి రూ.73 కోట్లు ఆదాయం ఉంది. జగన్‌ ఒక్కరికే ఏడాదికి రూ.57 కోట్ల ఆదాయం ఉంది.

రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి జనార్థన్‌రెడ్డి కుటుంబానికి రూ.37 కోట్లు, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి 34కోట్ల ఆదాయం ఉంది. విద్యార్హతల విషయంలో.. 1,055 మంది అభ్యర్థులు 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. 1,079 మంది డిగ్రీ లేదా ఆపై విద్యార్హతలు కలిగి ఉన్నారు. 120 మందికి డిప్లొమాలు ఉన్నాయి.86 మంది నిరక్షరాస్యులున్నారు.

Updated Date - May 10 , 2024 | 06:39 AM