Share News

Lok Sabha Polls 2024: పంతం.. నీదా..!? నాదా..!?

ABN , Publish Date - May 04 , 2024 | 06:15 AM

పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పేరు చెప్పగానే.. ‘ఆ.. అక్కడ మజ్లిసే గెలుస్తుంది’ అనే మాట సర్వసాధారణంగా వినిపించేది! సలావుద్దీన్‌ ఒవైసీ, బద్ధం బాల్‌రెడ్డి, ఆలె నరేంద్ర కాలంలో పోటాపోటీ నెలకొన్నా..

Lok Sabha Polls 2024: పంతం.. నీదా..!? నాదా..!?

పతంగితో కమలం ఢీ

హైదరాబాద్‌ లోక్‌సభలో ఉత్కంఠ పోరు

ఐదోసారి గెలుపునకు అసదుద్దీన్‌ పావులు

ముస్లిం కోటలో బీజేపీ ఖాతా

తెరవాలని మాధవీలత పట్టు

ఇక్కడి ఫలితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి

హైదరాబాద్‌ సిటీ, మే 3 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పేరు చెప్పగానే.. ‘ఆ.. అక్కడ మజ్లిసే గెలుస్తుంది’ అనే మాట సర్వసాధారణంగా వినిపించేది! సలావుద్దీన్‌ ఒవైసీ, బద్ధం బాల్‌రెడ్డి, ఆలె నరేంద్ర కాలంలో పోటాపోటీ నెలకొన్నా..

అసదుద్దీన్‌ బరిలోకి దిగినప్పటి నుంచి గత రెండు దశాబ్దాలుగా ఆయనకు తిరుగులేదు. కానీ, ఇప్పుడు అక్కడ పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మజ్లిస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు మారింది.

ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రసంగాలతోనే కాదు..

హావభావాలతోనూ ఇరువురూ రక్తి కట్టిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మజ్లిస్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ తమ పార్టీ గుర్తు పతంగిని ఎగరేస్తున్నట్లు చూపిస్తే.. ఎగురుతున్న గాలిపటాన్ని కాట్‌ (కట్‌) చేస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి మాధవీలత అభినయిస్తున్నారు.

ఇరువురి ప్రచార శైలి సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. అందుకే, ఈసారి హైదరాబాద్‌ పార్లమెంటు ఎన్నికపై జాతీయ స్థాయిలోనూ ఉత్కంఠ నెలకొంది.

నిజానికి, ఇక్కడ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు కూడా బరిలో నిలిచినా.. బీజేపీ, మజ్లిస్‌ మధ్యే ముఖాముఖి పోటీ నెలకొంది.

అంతేనా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఓట్లను ఎవరు ఎక్కువ చీలిస్తే వారికే విజయావకాశాలు ఉండే అవకాశం ఉందనే విశ్లేషణలూ వెలువడుతున్నాయి. ఇక, మత ప్రాతిపదికనే ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఓటింగూ అదే తరహాలో ఉండనుంది.

బీజేపీ అభ్యర్థి దూకుడు

అనూహ్యంగా మొదటి జాబితాలోనే హైదరాబాద్‌ అభ్యర్థిగా బీజేపీ మాధవీలతను ప్రకటించింది. అప్పటి నుంచి ఆమె ఇటు సోషల్‌ మీడియాలో అటు పాతబస్తీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

మహిళ కావడంతోపాటు వాగ్ధాటి ఆమెకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఓ టీవీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడిన తీరుకు ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. రుద్ర నమక చమకాలను లయబద్ధంగా పఠించడం పలువురిని ఆకర్షిస్తోంది.

పార్లమెంటు ఎన్నికల్లో నిలబడే లక్ష్యంతో చాలాముందు నుంచే ఆమె వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

లతా మా ఫౌండేషన్‌ ద్వారా పేద ముస్లింలకు రేషన్‌, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నారు. విరించి ఆస్పత్రిలో పలువురికి ఉచితంగా ప్రసవాలు చేసి వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయోధ్య బలరాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీతారామ కల్యాణం జరిపించారు. తద్వారా, హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడతాయని భావిస్తూ.. ముస్లిముల ఓట్లలోనూ చీలిక తీసుకొచ్చే దిశగా ఆమె పావులు కదుపుతున్నారు. అప్పుడే తన విజయం ఖాయమవుతుందని భావిస్తున్నారు.


శ్రీరామనవమి రోజు విల్లు ఎక్కుపెట్టి బాణం వదులుతున్నట్లు ఫోజు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఆమె మసీదు వైపు బాణం వదులుతూ ఫోజు ఇచ్చారంటూ ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు కూడా.

ఇక, నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో అభివృద్ధి కుంటుపడిందని, యువతులను అరబ్‌ షేక్‌లకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా ఇక్కడి ప్రతినిధులు పట్టించుకోవడం లేదని, వితంతువులకు ఆధారం కల్పించడం లేదని, అభివృద్ధి శూన్యమని ఆరోపిస్తున్నారు. బోగస్‌ ఓట్లతోనే మజ్లిస్‌ గెలుస్తోందని, దానిపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే, నియోజకవర్గ పరిధిలో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ సహాయ నిరాకరణ ఆమెకు సమస్యలు సృష్టిస్తోందని అంటున్నారు.

ఆమెకు టికెట్‌ కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్‌ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ గెలిస్తే పాతబస్తీలో ఖాతా తెరవడమే కాదు.. దేశంలోనే పెను సంచనలమూ అవుతుంది. అందుకే, ఇక్కడ గెలుపును బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

మజ్లిస్‌ వ్యూహాత్మక అడుగులు

ఎప్పట్లాగే బీజేపీ అభ్యర్థి పోటీని హైదరాబాద్‌లో తొలుత మజ్లిస్‌ లైట్‌ తీసుకుంది. తమ గెలుపు ఖాయమని భావించింది. కానీ, మాధవీలత ప్రచార జోష్‌తో అప్రమత్తమైంది. రంజాన్‌ నెలలోనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచార తీవ్రత పెంచారు.

అదే సమయంలో ముస్లిం ఓట్లు చీలకుండా అసదుద్దీన్‌ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. బద్ధ శత్రువైన ఎంబీటీ బరిలో నిలవకుండా మజ్లిస్‌ జాగ్రత్తలు తీసుకుందనే ప్రచారం జరిగింది. నిజానికి, ఎంబీటీ పోటీ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో యాకత్‌పురాలో మజ్లిస్‌ బొటాబొటి మెజారిటీతో బయటపడింది. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మెజారిటీలు తగ్గిపోయాయి.

పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎంబీటీ బరిలోకి దిగితే ముస్లిం ఓట్లను గణనీయంగా చీల్చేందుకు అవకాశం ఉంటుంది. అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చేకూరుస్తుంది.

ఈ నేపథ్యంలోనే, మజ్లిస్‌ తరఫున కొంతమంది మత పెద్దలు ఎంబీటీ నేతలతో చర్చలు జరిపారు. ఫలితంగా పోటీ నుంచి ఆ పార్టీ తప్పుకుంది. దాంతో, అత్యధికంగా ఉన్న ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడతాయని, తమ గెలుపు ఖాయమనే అంచనాల్లో మజ్లిస్‌ ఉంది.

ఇక, మతతత్వ బీజేపీ గెలిస్తే ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో కల్లోలం ఏర్పడుతుందని మజ్లిస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. తనను, తన సోదరుడు అసదుద్దీన్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ముస్లిముల మనసు చూరగొనే ప్రయత్నాలను ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ చేశారు.

మసీదుపై బాణం ఎక్కుపెట్టినట్లు చేస్తూ మాధవీలత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.ఈసారి తెలుగులో పాటలు రూపొందించి మజ్లిస్‌ ప్రచారం నిర్వహిస్తోంది.

మీకు గుర్తున్నాయా!? దివంగత మజ్లిస్‌ అధినేత సలావుద్దీన్‌ ఒవైసీతో బీజేపీ నేతలు బద్ధం బాల్‌ రెడ్డి, ఆలె నరేంద్ర తలపడిన రోజులు!? అప్పట్లో హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనేవి!

రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి! ఇందుకు కారణం.. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై పోటీగా విరించి ఆస్పత్రుల అధినేత కొంపెల్ల మాధవీలతను బీజేపీ బరిలో నిలపడం.. ఆమె దూకుడుగా ప్రచారంలో దూసుకుపోతుండడమే! దాంతో, ఇక్కడ హైటెన్షన్‌ పోరు నెలకొంది!!

Updated Date - May 04 , 2024 | 11:06 AM