Share News

బీఆర్‌ఎస్‌కు ఒక్కటీ రాదు

ABN , Publish Date - May 04 , 2024 | 05:48 AM

అపరిమిత అధికారాలతో కేసీఆర్‌ చాలా పిచ్చిపనులు చేశారని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలో

బీఆర్‌ఎస్‌కు ఒక్కటీ రాదు

  • రాష్ట్రంలో బీజేపీకి 11-12 ఎంపీ స్థానాలు.. రంజిత్‌రెడ్డి నాకు అసలు పోటీయే కాదు

  • అపరిమిత అఽధికారంతో కేసీఆర్‌ పిచ్చిపనులు

  • అప్పటి అప్పులను రేవంత్‌ కడుతున్నారు

  • రుణమాఫీ.. గోడమీద ‘రేపు’ లాంటిదే

  • మేడిగడ్డ ప్రయోజనకరమైన ప్రాజెక్టేమీ కాదు

  • పాలిటిక్స్‌లో రేవంత్‌ నాకంటే ప్రొఫెషనల్‌

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ బిగ్‌ డిబేట్‌లో

  • చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): అపరిమిత అధికారాలతో కేసీఆర్‌ చాలా పిచ్చిపనులు చేశారని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలో ఎక్కడా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి చేతుల్లో రాష్ట్రం లేదని, తెలంగాణలోనే అలా జరిగిందని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చి తప్పు చేశారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. శుక్రవారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘బిగ్‌ డిబేట్‌’లో విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.

రంజిత్‌రెడ్డిపై ఈసారి ప్రతీకారం తీర్చుకుంటారా..?

ఆయన నాకు పోటీ కాదు.. నా పోటీ కేసీఆర్‌, కేటీఆర్‌తో ఉండేది. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీతోనే ఉండేది. నాకు వరమిచ్చినట్టుగా సునీతా మహేందర్‌రెడ్డిని ప్రకటించి తప్పించారు. ఆమెకు ఇక్కడ పరిచయాలు ఎక్కువగా ఉన్నందున ఆమె ఉంటే పోటీ టఫ్‌గా ఉండేది. రంజిత్‌రెడ్డికి పెద్దగా లేవు. భూ లావాదేవీలు, వ్యాపార ఒప్పందాలున్న నేతలే ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఎమ్మెల్యేలు ఎలాగైనా గెలిపించాలని సీఎం రేవంత్‌ ఒత్తిడి చేస్తున్నారు.

సీఎం రేవంత్‌, మీరు జిగ్రీ దోస్తులు కదా..?

దోస్తులు దోస్తులే.. పాలిటిక్స్‌ పాలిటిక్సే. రాజకీయాల్లో రేవంత్‌ నాకంటే ఎక్కువ ప్రొఫెషనల్‌గా ఉంటాడు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండేది కదా..?

కేసీఆర్‌ అప్పులు చేసిండు. రేవంత్‌ అప్పులు కడుతున్నడు. రాష్ట్రానికి వచ్చే ఆదాయమంతా రూ.1.40 లక్షల కోట్లే. ఇందులో రూ.80 వేల కోట్లు అప్పులు కట్టేందుకు, రూ.60 వేల కోట్లు జీతాలకు చెల్లించాల్సిందే. పెద్దన్న అని మోదీ రూ.9 వేల కోట్లు ఇచ్చారు కాబట్టే ఇప్పుడు రాష్ట్రం నడుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకోకుండా ఏఐసీసీ ఆరు గ్యారంటీలను రేవంత్‌ నెత్తిన పెట్టింది. ఇందులో రేవంత్‌ తప్పేం లేదు. అవి ఇప్పుడు గుదిబండలా మారాయి. రూ.2 లక్షల రుణమాఫీకే రూ.30 వేల కోట్లు కావాలి. ఇప్పుడు రూ.3 వేల కోట్లు కూడా లేవు.

రుణమాఫీ డెడ్‌లైన్‌ ఆగస్టు-15 పెట్టుకున్నారు కదా?

అప్పు అడిగితే గోడ మీద ‘రేపు’ అని రాస్తారు.. ఆ రేపు ఎప్పటికీ రాదు. ఇదీ అలాంటిదే. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుల చెల్లింపును 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుకుంటే మంచిది. దానికి కేంద్రం సహకారం కావాలి. మేడిగడ్డ పెద్ద ప్రయోజనకరమైన ప్రాజెక్టేం కాదు. మూసీనది సుందరీకరణకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేయడం కూడా సరికాదు.

బీజేపీ మళ్లీ వస్తే ఇక్కడి నుంచి మంత్రులెవరవుతారు?

అందరికీ వస్తే అందరూ తీసుకుంటారు. కానీ, కాంగ్రె్‌సలో ఉన్నట్టు ఇక్కడ మంత్రి పదవులను ఎంజాయ్‌ చేయలేరు.


మీ మనస్తత్వానికి ఇన్ని పార్టీలు మారకూడదు. కేసీఆర్‌ ఫ్యామిలితో విభేదాలేంటి.?

నేను పార్టీలు మారలేదు. పార్టీలే మారాయి. కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పులపాలు చేశాడు. కుటుంబ పాలనే అక్కడ అసలు సమస్య. దానిని అంతం చేయాలని కాంగ్రె్‌సలో చేరితే ఇక్కడా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిన్రు. కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి మాత్రమే ఢీకొంటాడని నమ్మాను. ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని కోరాను. అయితే సీనియర్లు నన్ను వ్యతిరేకించారు.. కోపగించుకున్నారు.

చేవెళ్లలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కదా?

ఈ విషయంలో నాకు రంజిత్‌రెడ్డి హెల్ప్‌ చేస్తున్నారు. 4 లక్షల ముస్లిం, 2లక్షల క్రైస్తవుల ఓట్లు ఉన్నాయని అంటున్నారు. అది మతతత్వ భాష. 23 లక్షల హిందువుల ఓట్లు కూడా ఉన్నాయి. మతాల గురించి ఆయన చెబుతున్న మాటలను నేను ప్రచారం చేస్తే చాలు.. నాకు వచ్చేవి వచ్చేస్తాయి. నేను బీజేపీలో ఉన్నా వ్యక్తిగత అభిమానంతో 20 శాతం ముస్లింలు నాకు మద్దతుగా ఉన్నారు.

బీజేపీ అర్బన్‌ పార్టీ అంటారు.. ఇక్కడ గ్రామీణ ఓటర్లు ఎక్కువ కదా?

నేను గ్రామీణ ప్రాంతాల్లో చాలా తిరిగాను. ప్రతీ గ్రామంలో పరిచయం ఉంది. అర్బన్‌లోనే నేనంటే 80 శాతం తెలియదంటారు. గ్రామీణంలోనే 99శాతం మందికి తెలుసు.

కవితను అరెస్టు చేయకపోవడమే గత ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమన్నారు?

కవితను అరెస్టు చేశారు, రామమందిరం పూర్తయింది. ఈ అంశాలు ఎన్నికల్లో నాకు అనుకూలంగా మారుతాయి. ఈ విషయంలో బీఆర్‌ఎ్‌సకు ఎలాంటి సానుభూతి రాలేదు. బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు ఉందని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నమ్మడంతో కాంగ్రె్‌సకు లాభించింది.

తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు..?

11-12 వచ్చే అవకాశాలున్నాయి. అసదుద్దీన్‌ను ఓడించడం గతంలో అసాధ్యం. ఇప్పుడు సాధ్యమే. హైదరాబాద్‌లో మాధవీలత గెలుస్తారు. బీఆర్‌ఎస్‌కు ఒక్కటీ రాదు.

బీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకు పెరిగితే మీకు నష్టమే కదా..?

కొన్ని ప్రాంతాల్లోనే నష్టం. చేవెళ్లలో అంతగా పెరగలేదు. సభలకు జనం వస్తున్నారని ఆదరణ పెరిగిందని అనలేం.

ముగ్గురు ధనిక అభ్యరులే.. ప్రజలు ఆశలు పెరగవా?

నల్లధనం ఉన్నోడు పంచిపెడుతడు. తెల్లధనం ఉన్నోడు పంచి పెట్టడు. ఇంత ప్రకటించాడంటే ఒక్కపైసా లంచం తీసుకోడు, రాజకీయాల్లోకి పైసల కోసం రాలేదన్న ముద్ర కూడా ఉంటుంది. అది నాకు చాలా అడ్వాంటేజ్‌.

గెలిస్తే చేవెళ్లకు ఏంచేస్తారు..?

బీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నా.. వెయ్యి కోట్ల బీజాపూర్‌ హైవే తెచ్చాను. తాండూరు రాయిపై జీఎస్టీ 18 నుంచి 5శాతానికి తగ్గించాను. ఇప్పుడు గెలిస్తే.. కేంద్ర పథకాలు ఇక్కడ అమలయ్యేలా చూస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను.

Updated Date - May 04 , 2024 | 06:42 AM