Share News

తామరాకు

ABN , Publish Date - May 06 , 2024 | 01:35 AM

రోజు ముగిసే సమయానికి భిక్షువు తన జోలె కుమ్మరించి ఒక్క నాణెం కోసం వెతుక్కున్నట్టు నేనూ, ఎక్కడైనా ‘రా’ అనే ఒక్క అక్షరం ఉందేమో...

తామరాకు

రోజు ముగిసే సమయానికి

భిక్షువు తన జోలె కుమ్మరించి

ఒక్క నాణెం కోసం వెతుక్కున్నట్టు నేనూ,

ఎక్కడైనా ‘రా’ అనే ఒక్క అక్షరం ఉందేమో

ఇన్ని వేల ఉత్తరాల్లోనని!

పోగొట్టుకున్న ప్రేమ

పోగొట్టుకోలేని ప్రాణం

సర్దుకొని సాగలేని రెండు విరుద్ధాలు

గుప్పెడు శరీరంలో,

దేన్ని ఎటు నుంచి లాగి ఎటు ముడివేయాలని?

పొద్దు తోటే గుండె కుంగుతుంది

నడిరేయి మైదానంలో

మూడోకంటికి తెలియని తుఫాను,

ఏం పట్టుకుపోయిందో

ఎంత మేట కొట్టుకుపోయిందో

ఎవరూ అడగరు,

ఈ అంతర్లీనపు ఆస్తి నష్టం గురించి.

మరోసారి పగిలిపోయాక

నువ్వున్న నిన్న

నువ్వు లేని నిన్న

ఏదీ మతిలో ఉండదు

గుర్తు రానంత దూరం పోలేక

గుర్తు చేయకూడనంత దూరం మాత్రమే వెళ్తాను!

ఇదో లోకం

నవ్వే మనుషులు గ్రహాంతరవాసుల్లా

ప్రేమ ఎబ్బెట్టుగా

స్వేచ్ఛ అబద్ధంలా

దుఃఖం అజరామరంగా

లోకాన్ని చూసే నా చూపు మారిపోతుంది!

ఇప్పుడు ఏదీ స్పష్టంగా కనిపించదు

ఏ ముఖమూ గుర్తుపట్టలేను

కంటి ముందు కొందరు మనుషులు

కొన్ని వాహనాలు - కొన్ని వస్తువులు

శూన్యం అనలేని మసక

మరణం అనలేని మనుగడ!

రేఖాజ్యోతి

97044 23255

Updated Date - May 06 , 2024 | 01:35 AM