Share News

ఎర్ర మన్ను ఇల్లు

ABN , Publish Date - May 06 , 2024 | 01:38 AM

జానెడు చదరంగం పెట్టెల రెండు రాజ్యాలు ఇరికినట్టు దోసిట్ల వట్టుకునే గల్ల గురిగంత మా ఇంట్ల రూపాయి బిళ్ళలోలే ఇంతమందిమి...

ఎర్ర మన్ను ఇల్లు

జానెడు చదరంగం పెట్టెల రెండు రాజ్యాలు ఇరికినట్టు

దోసిట్ల వట్టుకునే గల్ల గురిగంత మా ఇంట్ల

రూపాయి బిళ్ళలోలే ఇంతమందిమి

సిన్నప్పుడు ఎట్లా ఉండేటోళ్ళమో,

ఇంత చిన్న ఇంట్ల శంకుమూలలు,

పొయ్యి పెట్టుకునే మూలలు లేవు

ఉన్నదళ్ల గీ మూల మీద గుడిసెనే

అయితే ఎండాకాలమచ్చిందంటే

సెర్లపొంటి ఏరుకచ్చుకునే తుంగసొప్ప

మా ఇంటి మీద వాలిన సల్లటి సుట్టమైతుండే

ఇసుక జల్లెడలెక్క ఉన్న ఇల్లు మొత్తం

వానాకాలం సూర్నీళ్లతో తానమాడుతదనే భయానికి

ఇస్కూల్‌ పిల్లగానికి అంగి తొడిగినట్టు

తాటిపత్రి కప్పేటోళ్ళం

ఎన్ని జేస్తే ఏం లాభం

ఎన్నడు లేని కప్పల పెళ్ళికి

ఈ యేడు ఎంత దయ కలిగిందో వానదేవునికి

చెరువు తల్లి గుండెలో మా గుడిసెను నింపుకోమన్నాడు.

ఎన్నిసార్లు చెప్పేదో నాయన

ఇంటి గచ్చు కింద ఎర్రమొరం పోపిద్దాంరా అని,

ఎవరికి తెలుసు, ఇప్పుడు గిట్ల ఎర్రమన్ను చెరువుల తేలిపోతదని

పాపం అరుగుమీద బొగ్గుతోని అక్కచెల్లెలు గీసుకున్న అష్టచెమ్మగళ్ళలో

ఇప్పుడు కట్ట మైసమ్మ ఒక్కతే కూసోని ఆడుకుంటున్నదేమో.

ఎన్ని కొంగలు గుడిసెమీద కూసోని ముచ్చట్లు పెట్టుకుంటున్నయో

మా తలాపుకున్న మట్టి గోడలల్ల

ఇప్పుడు ఎన్ని మన్నుపాములు పండుకున్నయో

ఇంటి ముందట ఇసుక కుప్పల

ఇప్పుడు ఎన్ని కప్పలు ఒర్రుతున్నయో

సక్కటి సెయి రాతతో ఉత్తరం రాసి

భద్రంగా బీరువాలో దాసుకొని

సమాధానం కోసం ఎదురుసూస్తున్నట్టు

ప్రభుత్వమైతే జాగ లెక్కలేసింది కానీ

ఇల్లు ఇచ్చేతందుకే తారీఖు చెప్పడం మర్సిపోయింది.

సందీప్‌ వొటారికారి

93902 80093

Updated Date - May 06 , 2024 | 01:38 AM