Share News

పలు అస్తిత్వాల అనువర్తనం ‘ఆసు’

ABN , Publish Date - May 06 , 2024 | 01:45 AM

‘‘కవికి సమాజానికి మధ్య సమన్వయం కుదిరేవరకూ కవి కవిత్వం రాస్తూనే ఉంటాడు.’’ నిబద్ధతగల ఏ కవీ దీనికి అతీతుడు కాడు. ఈ కోవకు చెందినవాడే వెల్దండి శ్రీధర్‌. ఇటీవలి కాలంలో తను వెలువర్చిన...

పలు అస్తిత్వాల అనువర్తనం ‘ఆసు’

‘‘కవికి సమాజానికి మధ్య సమన్వయం కుదిరేవరకూ కవి కవిత్వం రాస్తూనే ఉంటాడు.’’ నిబద్ధతగల ఏ కవీ దీనికి అతీతుడు కాడు. ఈ కోవకు చెందినవాడే వెల్దండి శ్రీధర్‌. ఇటీవలి కాలంలో తను వెలువర్చిన కవితా సంపుటి ‘ఆసు’ వొక చర్చనీయ సందర్భం. తెలుగు సాహిత్యంలో 2002 నాటికే అంతకు క్రితం ఉన్న సాహిత్య భావజాలానికి, పోస్ట్‌ మాడ్రనిజం అస్తిత్వ భావజాలానికి మధ్య నిలబడి సందిగ్ధత జూలు విదుల్చుకుంది. చాలామంది తమ కవిత్వంలో నిప్పురాజేసే కార్యక్రమానికి స్వస్తి చెప్పి అస్తిత్వ వాదాల్లోకి జొరబడిపోయారు. ఈ మూసల్లోంచి బయట పడి కొత్త మార్గాన్ని అనుసరిస్తున్న వాడే వెల్దండి శ్రీధర్‌.

ముందుమాటలో జూకంటి జగన్నాథం చెప్పినట్లు కవి తన కవిత్వంలో ‘నిప్పు’ను అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. శీర్షిక చూచాయగా అస్తిత్వ ప్రకటన చేస్తున్నా పేదరికం, దోపిడీల కాళ్ల కింద నలిగిన చిన్ననాటి అనుభవాల్లోంచి భావప్రకటన ఒక్కసారిగా Incredibleను కూడా వెంటేసుకొని విరుచుకు పడుతుంది. ‘ఖాళీ ఫ్లవర్‌’ కవితలోని అభివ్యక్తి పాఠకుడిని కాస్త ఘాటుగా తాకుతుంది. గిట్టుబాటు ధర పొందలేని రైతు నిస్సహా యతని నిటారుగా నిలబెట్టి రాజ్యాన్ని నిలదీస్తాడు:


‘‘మరుజన్మలోనైనా

ఖడ్గమై మొలిస్తే బావుండు

పంటను పెంటలా చూసేవాడి

తలను తుత్తునియలు చేయడానికి’’

కాలం కవిత్వాన్ని శాసిస్తుంది అనడం కొన్నిసార్లు అతిశయోక్తి అవుతుందేమో కానీ అన్నిసార్లు కాదు. రెండు దశాబ్దాల నుండి తెలుగు కవిత్వం దళిత, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వాల్ని పొదివి పట్టుకొని జాగ్రత్తగా అడుగులేస్తుంది. దీనికి గుర్తుగా యాస, భాష ప్రత్యేక సూచికాంకాలయ్యాయి. ఇష్టపడి కొందరు, అనివార్యంగా మరి కొందరు మొత్తానికి దాదాపు ఏదో ఒక సందర్భంలో ఈ కాల ప్రవాహంలో అడుగుమోపినవారే. శ్రీధర్‌ ఈ తరహా ప్రాంతీయ అస్తిత్వ వాదాన్ని పదును పెట్టడంలో భాగంగా నిర్ద్వందంగా నినదిస్తాడు.

‘‘పంచాయితద్దూ

పెద్దమనుషులొద్దూ

ఏండ్లసంది గెట్టు పెట్టే ఉన్నది

గీతదాటితే మరోసారి సాయుధ పోరాటం

హద్దుల ఉంటే అలైబలై పీరీల పండుగ’’

పై వాక్యాలు పూర్తిగా ప్రాంతీయ అస్తిత్వంలో మునిగి తడితడిగా వడివడిగా కవిత్వంలోకి అడుగులేసిన భావ ప్రకంపనలు. ఇలాంటి స్నిగ్ధ వ్యక్తీకరణ వెల్దండి శ్రీధర్‌ ‘మోదుగుపూలు’ కవితలో చూడొచ్చు.

‘‘గుండెలోని

మంటలు కొన్ని అడవిని చేరి

పాఠాలేవో నేర్పుతూ

మింటిని తాకుతాయి

అరుణారుణ సూర్య బింబాలు

అడవి అంచున ఉదయిస్తాయి’’


- దీనిలో డిక్షన్‌ పాతది కాని వ్యక్తీకరణ కూర్పులో కొత్తదనం ఉంది. ఇదే కవితలోని ‘‘మోదుగుపూలు బడుగుజీవుల ఆకలి డొక్కలు’’ అనే పదాలు దృశ్యసాదృశ్యాన్ని అర్థ పరిపుష్టిని కలిగి ఉన్నాయి.

వెల్దండి శ్రీధర్‌ కుటుంబ వృత్తి రీత్యా నేతపని చేసేవారు. ‘ఆసు’ అనే శీర్షిక ఈ కవితా సంపుటికి ఆ నేపథ్యంలోంచే ఎంచుకున్నది కావచ్చు.

‘‘నాగలి లేనిదే పంటను తీయలేనట్లు

ఆసు లేనిదే బట్టను నేయలేం

చీర నేర్చిన ఊసులన్నీ

నునుగారంగా ఆసు నేర్పినవే’’ అంటాడు.

తెలంగాణ నేలకు ఒక ప్రత్యేకత ఉంది. పోరాటాల నేపథ్యం ఉంది. దీనికి పురాలంకృతంగా చరిత్రలో నలిగిపోయిన అణచివేత, దోపిడీల పునరావృతాలున్నాయి. ఎక్కడ అణచివేత అధికంగా అనిర్వచనీయమవుతుందో అక్కడ తిరుగుబాటు సాధారణ సంప్రదాయమవుతుంది. తెలంగాణ మట్టిలో పుట్టి గాయపడ్డ ప్రతి మనిషి ఈ భావనను బహిరంగంగానో, అంతర్గతంగానో వ్యక్తపరుస్తూనే ఉంటాడు. ‘‘ఒక మనిషి ఇంకో మనిషిని కొనగలిగేంత ఆర్థిక స్థితి కలిగి ఉండకూడదు’’ అలాంటి స్థితి నెలకొన్న ప్రతి చోట సమాజ విచ్ఛిన్నతకు బీజం పడుతూనే ఉంటుంది అంటాడు రూసో. కానీ అవి ఏ పేదవాడి ఎదురు చూపుల ముంగిటిలో ‘న్యాయాన్ని’ ఆవిష్కరించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అలా అని ఒక సభ్య సామాజిక వ్యాసాంశంగా ఈ విషయాన్ని నిష్కర్షగా చెప్పలేం. ఇక విడమర్చే వెసులుబాటు, విరుచుకుపడి ఖండించే aggressiveness కవికి ఉంటుంది. వెల్దండి శ్రీధర్‌ విషయంలోనూ అంతే... అదే అస్తిత్వం గాయపడ్డప్పుడు యుద్ధానికి సిద్ధమైన సైనికుడిలా తెగింపుతో ఊగిపోతాడు.

‘‘దొరలకు సైతం ఎదురు నిలబడి

కానూన్‌ తప్పనియ్యని నిఖార్సైన బిరుసుతనం

మాట తప్పితే కళ్ళకు మొక్కుతుంది

రివాజు తప్పి కలల దగ్గర పెట్టమంటే

అదే పాడె మీద కప్పే చివరి వస్త్రం అవుతుంది’’

కాని వాస్తవానికి ‘ఆసు’ కవితా సంపుటిలోంచి మట్టి వాసన అస్తిత్వానికంటే ముందుగా పాఠకుడిని కమ్ముకొని మైమర్చిపోయేలా చేస్తుంది. వెల్దండి శ్రీధర్‌ నొస్టాల్జియాలో బహుశా మట్టిదే మొదటి మెట్టేమో! ‘నవ్విన నాగలి’ అనే కవిత మొత్తం ప్రతీకాత్మకం. ఏ పదాల పెదాల్ని మూసేయాలన్నా మనసొప్పదు:


‘‘మెతుకు కావ్యానికి/ వాన చినుకులు ముందుమాట రాస్తున్నాయి/ మట్టి సారాన్ని సవరించి/ పచ్చదనాన్ని అదను మీద నాటుతున్నాయి/ పనిముట్లు స్వేదాన్ని చిందిస్తూ/ మేఘాల రుమాళ్లతో/ ముఖం తుడుచుకుంటు న్నాయి/ మన్నుకు వెన్న పూసి/ ఇంట్లోని చేతులన్నీ/ వెన్నెముకను నిటారుగా నిలబెడుతున్నాయి’’

వెల్దండి శ్రీధర్‌ ‘ఆసు’ కవితా సంపుటి జీవితాన్ని వివిధ కోణాల్లో మన కళ్ళముందుంచుతుంది. అన్ని కోణాల్ని స్పర్శించగల్గటం అసాధ్యం కాని కొంతవరకు ఊహించగలం. వెల్దండి శ్రీధర్‌ స్త్రీవాదం, దళితవాదం, విప్లవవాదం, ప్రాంతీయవాదం అన్నింటినీ తన కవిత్వంలో స్పృశించాడు. ఊపిరి సలపకుండా పనితో అలసిపోయి నిద్రలోకి జారిపోయిన భార్య గూర్చి రాస్తూ ఒక్క మాటలో ‘‘స్వప్నంలో ఎప్పుడో ఊపిరి తీసుకున్నట్లు కలగంటుంది’’ అంటాడు. అత్యున్నతమైన వ్యక్తీకరణ ఇది. బ్రివిటీని కావాల్సిన చోట వాడుకోవడమంటే ఇదే.

ఇలా సాగిపోయే ‘ఆసు’ కవితా ప్రవాహంలో వెల్దండి శ్రీధర్‌ తాత్విక భూమికల్లోకి ఇంకిపోవడానికి ‘మట్టిపాట’ రాగాన్ని ఎంతో హృద్యంగా ఆలపిస్తాడు.

‘‘నడిపించేది గుండె చప్పుడే అనుకుంటాం

మట్టి హృదయపు సవ్వడి విన్నవాడిదే

బతుకు పల్లవైనా... చరణమైనా..’’

ుఽ కందుకూరి దుర్గా ప్రసాద్‌

96189 29018

Updated Date - May 06 , 2024 | 01:45 AM