Share News

AP Election 2024: మీకు ఓటు వేయం!

ABN , Publish Date - May 04 , 2024 | 03:29 AM

సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర ్గం పులివెందుల. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకుంటారు. తాగేందుకు నీరు, తిరిగేందుకు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌, పేదలందరికీ ఇళ్లు, జనం బటన్‌ నొక్కుడు పింఛన్లు ఇలా అన్నీ అందరికీ అందుతాయని భావిస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సీఎం జగన్‌ విజయం కోసం ఆయన సతీమణి వైఎస్‌ భారతి పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.

AP Election 2024: మీకు ఓటు వేయం!

  • పులివెందులలో సీఎం సతీమణి భారతికి

  • తేల్చి చెప్పిన మహిళలు

  • ఇంటి పట్టా ఇచ్చినట్టే ఇచ్చి

  • వెనక్కి లాగేసుకున్నారు

  • నీటి సమస్యనూ పట్టించుకోరు

  • సమస్యలు ఏకరవు పెట్టిన మహిళలు

కడప, మే 3(ఆంధ్రజ్యోతి): సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర ్గం పులివెందుల. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకుంటారు. తాగేందుకు నీరు, తిరిగేందుకు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌, పేదలందరికీ ఇళ్లు, జనం బటన్‌ నొక్కుడు పింఛన్లు ఇలా అన్నీ అందరికీ అందుతాయని భావిస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సీఎం జగన్‌ విజయం కోసం ఆయన సతీమణి వైఎస్‌ భారతి పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మహిళల నుంచి ఊహించని నిరసన ఎదురవుతోంది. శుక్రవారం పులివెందుల మండలంలోని ఎర్రబల్లెకొత్తపల్లెలో భారతి చేపట్టిన ప్రచారంలో అడుగడుగునా సమస్యలు స్వాగతం పలికాయి.


పది ఇళ్లు ప్రచారం చేస్తే ఆరు ఇళ్లలోని మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఒకరిద్దరైతే.. ఏకంగా ‘మీకు ఓటేయం’ అని భారతికే తేల్చి చెప్పేశారు. ‘‘నాకు ఇంటి పట్టా ఇచ్చారు. ఇల్లు ఉందని మరలా పట్టా తీసేసుకున్నారు. మేం ఉండే ఇల్లు ఇదే. మాకెందుకు ఇంటి పట్టా ఇవ్వరు’’ అని సావిత్రి అనే మహిళ భారతిని ప్రశ్నించారు. దీంతో పక్కనే ఉన్న కొందరు నేతలు.. ఈసారి ఇల్లు ఇప్పిస్తామని సావిత్రమ్మకు సర్దిచెప్పే యత్నం చేశారు. అయితే, ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘మీకు ఎన్నిసార్లు చెప్పినా న్యాయం జరగలేదు. కనీసం ఆమెకన్నా చెప్పుకొంటే న్యాయం జరుగుతుందని చెబుతున్నా’’ అని అన్నారు.


అనంతరం, భారతి మరో ఇంటికి వెళ్లారు.. అక్కడ ఓ మహిళ మాట్లాడుతూ.. ‘‘మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి. మాకు పథకాలు రాలేదు. మీకు ఓటు వేయం’’ అని భారతికి తేల్చి చెప్పారు. మరికొందరు తాగునీటి సమస్య ఉందని, పింఛను రాయలేదని, ఇళ్లు లేవని సమస్యలను వివరించారు. దీంతో భారతి అవాక్కయ్యారు. ‘‘పులివెందుల నియోజకవర్గానికి వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఇళ్లు ఇస్తున్నాం. ఇంకా ఏంది సమస్యలు’’ అని పార్టీ నేతల వద్ద భారతి వాపోయినట్టు సమాచారం. కాగా.. భారతి ప్రచార కార్యక్రమానికి మీడియా రాకుండా పోలీసులతో పాటు స్థానిక నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ‘‘మీ ఆంధ్రజ్యోతిలో ఎందుకబ్బా, సమస్యలన్నీ రాస్తారు, లేనిపోని సమస్యలు వస్తాయి’’ అంటూ వైసీపీ నేతలు అన్నారు.

Updated Date - May 04 , 2024 | 07:07 AM