Share News

RCB vs GT: విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. తక్కువ స్కోరుకే జీటీ ఆలౌట్

ABN , Publish Date - May 04 , 2024 | 09:35 PM

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించారు. తమ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించారు. ఫలితంగా..

RCB vs GT: విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. తక్కువ స్కోరుకే జీటీ ఆలౌట్

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించారు. తమ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించారు. ఫలితంగా.. జీటీ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాపార్డర్ విఫలమై జీటీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. మిడిలార్డర్‌లో వచ్చిన షారుఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), తెవాతియా (35) తమవంతు సహకారం అందించారు. వీళ్లు బాగా రాణించడం వల్లే.. జీటీ అంతమాత్రం స్కోరు చేయగలిగింది. లేకపోతే గుజరాత్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ జట్టు మొదట్లో తడబడింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి వెనువెంటనే మూడు వికెట్లు సమర్పించుకుంది. 5.3 ఓవర్లలో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి.. గుజరాత్ తీవ్ర కష్టాల్లో పడింది. అప్పుడు మిల్లర్, షారుఖ్ కలిసి మెరుగ్గా రాణించారు. మరో వికెట్ పడే అవకాశం ఇవ్వకుండా.. ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. వీళ్లిద్దరు నాలుగో వికెట్‌కి 61 పరుగులు జోడించారు. అయితే.. ఇంతలోనే మిల్లర్, షారుఖ్ ఔట్ పెవిలియన్ బాట పట్టారు. ఆ సమయంలో వచ్చిన తెవాతియా, రషీద్ కలిసి.. తమ జట్టుకి మంచి స్కోరు అందించడానికి తమవంతు ప్రయత్నాలు చేశారు. వాళ్లిద్దరు కలిసి.. ఆరో వికెట్‌కి 44 పరుగుల భాగస్వామ్యం జత చేశారు.

కానీ.. వాళ్లిద్దరు కూడా ఔట్ అయ్యాక గుజరాత్ పని కంచికి చేరినట్లయ్యింది. అప్పటికే బ్యాటర్లంతా చాపచుట్టేయడంతో.. టెయిలెండర్లు వారి వెనకాల పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా.. చివరి ఓవర్‌లో అయితే వరుసగా మూడు వికెట్లు పడ్డాయి. తొలి సుతార్ క్యాచ్ ఔట్ అవ్వగా.. మోహిత్ శర్మ రనౌత్ అయ్యాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ కూడా క్యాచ్ ఔట్ అవ్వగా.. 147 పరుగులకే జీటీ దుకాణం ఎత్తేయాల్సి వచ్చింది. మరి.. ఆ జట్టు నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేధిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Updated Date - May 04 , 2024 | 09:35 PM