Share News

SRH vs RR: రప్ఫాడించిన తెలుగోడు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - May 02 , 2024 | 09:24 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీడాభిమానుల అంచనాలకు తగినట్టు ఈసారి భారీ విధ్వంసం సృష్టించలేకపోయింది కానీ..

SRH vs RR: రప్ఫాడించిన తెలుగోడు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీడాభిమానుల అంచనాలకు తగినట్టు ఈసారి భారీ విధ్వంసం సృష్టించలేకపోయింది కానీ.. 200 పరుగుల మార్క్‌ని దాటేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ (76 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడం, ట్రావిస్ హెడ్ (58) అర్థశతకంతో రాణించడం, చివర్లో హెన్రిక్ క్లాసెన్ (42 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో.. హైదరాబాద్ జట్టు అంత భారీ స్కోరు చేసి, రాజస్థాన్‌కు 202 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు మొదట్లో తడబడింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి.. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లను భారీ షాట్లు కొట్టకుండా కట్టడి చేయగలిగారు. తొలి 8 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 2 వికెట్ల నష్టానికి కేవలం 48 పరుగులే చేసిందంటే.. ఆర్ఆర్ ఎంత బ్రహ్మాండంగా బౌలింగ్ వేసిందో అర్థం చేసుకోవచ్చు. అభిషేక్ (12), అన్మోల్ ప్రీత్ (5) వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. కానీ.. ఎప్పుడైతే నితీశ్ క్రీజులోకి వచ్చాడో, అప్పటి నుంచి హైదరాబాద్ స్కోరు క్రమంగా పెరుగుతూ వచ్చింది. హెడ్, నితీశ్ కలిసి.. ఒకవైపు ఆచితూచి ఆడుతూనే, మరోవైపు భారీ షాట్లతో దుమ్ముదులిపేశారు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

ఇక ట్రావిస్ ఔట్ అయ్యాక వచ్చిన క్లాసెన్ అయితే ఊచకోత కోశాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. అటు నితీశ్, ఇటు క్లాసెన్.. పోటాపోటీగా బౌండరీల వర్షం కురిపించి, ఆర్ఆర్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఫలితంగా.. హైదరాబాద్ స్కోరు 201/3కి చేరింది. ఈ మ్యాచ్ గెలవాలంటే.. రాజస్థాన్ 202 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి.. ఈ స్కోరుని హైదరాబాద్ బౌలర్లు డిఫెండ్ చేయగలరా? రాజస్థాన్‌ని అంత స్కోర్ చేయనివ్వకుండా కట్టడి చేయగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Updated Date - May 02 , 2024 | 09:24 PM