Share News

గంగా జమునా తెహజీబ్‌... మహరాజా కిషన్‌ ప్రసాద్‌

ABN , Publish Date - May 05 , 2024 | 12:41 AM

నిజాంల పాలనలో ఉన్నత పదవులన్నీ ముస్లింలకు మాత్రమే ఇచ్చేవారని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ అది వాస్తవ విరుద్ధం.

గంగా జమునా తెహజీబ్‌...  మహరాజా కిషన్‌ ప్రసాద్‌

అలనాటి కథ

నిజాంల పాలనలో ఉన్నత పదవులన్నీ ముస్లింలకు మాత్రమే ఇచ్చేవారని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ అది వాస్తవ విరుద్ధం. నిజాంల పాలనలో అనేకమంది హిందువులు ఉన్నత పదవులు పొందారు. మహరాజా కిషన్‌ ప్రసాద్‌ వంటి వారు దేశంలోనే అతి పెద్ద సంస్థానాలలో ఒకటైన హైదరాబాద్‌కు ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆయన కుటుంబంతో మాకు తరతరాలుగా అనుబంధం ఉంది. అది ఈ నాటికీ కొనసాగుతూనే ఉంది.

‘‘గంగా జమునా తెహజీబ్‌’’... హిందూ-ముస్లిం సఖ్యతకు ఒక ప్రాతిపదిక. దీనిని ఆచరించి నిరూపించిన వ్యక్తి మహరాజా కిషన్‌ ప్రసాద్‌. ఆయన నిజాం సంస్థానంలో ముందు పేష్కార్‌గా, ఆ తర్వాత దివాన్‌గా పని చేశారు. ప్రజలు ఆయన్ను ముద్దుగా ‘మహరాజ్‌’ అని పిలుచుకొనేవారు.

ఒకప్పటి పురానా మహల్‌ ప్రాంతం (ప్రస్తుతం పాతబస్తీ)లో ఆయన తెలియని వ్యక్తి ఎవరూ ఉండేవారు కాదు. ఆల్వాల్‌ ప్రాంతంలో మహరాజ్‌కు ఒక ఎస్టేట్‌ ఉండేది. అక్కడే ఆయన ఒక పెద్ద దేవాలయం నిర్మించినట్లు జ్ఞాపకం.

సంస్కృత పాఠశాలకు కూడా భూమిని విరాళంగా ఇచ్చారు. నిజాం పరిపాలనలో హిందూ-ముస్లింల మధ్య అంతరం లేకుండా చూడటంలో కిషన్‌ ప్రసాద్‌ కీలకమైన పాత్ర పోషించారు. అందుకే సామాన్య ప్రజలకు ఆయనపై చాలా అభిమానం. నా చిన్నప్పుడు మా మ్యూజిక్‌ రూమ్‌లో మహరాజ్‌ ఫొటో ఒకటి ఉండేది. ఒక రోజు నేను దానిని చూసి... ‘‘ఆ ఫ్యాన్సీ డ్రస్సు చాలా బాగుంది’’ అన్నానట.

నాన్న (రాజా ధన్‌రాజ్‌గిర్‌) ఈ విషయం అప్పుడప్పుడూ చెప్పి నవ్వేవారు. మహరాజ్‌ మనువరాలు షాద్‌ని... తమ్ముడు ధైర్యవాన్‌కి ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా మాకు బంధుత్వం కూడా ఉంది.

మహరాజ్‌ గురించి రాయటం మొదలుపెట్టినప్పుడు మూడు సంఘటనలు జ్ఞాపక పొరల నుంచి బయటకు వచ్చాయి. ఈ మూడూ ఆయన ఓరిమిని, సమయస్ఫూర్తిని తెలియజేస్తాయి.

చిన్నప్పుడు మహరాజ్‌ మా ఇంటికి తరచూ వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడు ఆయనకు నాలుగు వైపులా దండా పేషీ (నలుగురు సైనికులు రక్షణగా నిలబడేవారు) ఉండేది. అది దాటి ఎవరినీ ఆయన దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఒకసారి మా తమ్ముడు అనుకుంటా... అది దాటి లోపలకి వెళ్లి, సరదాగా ఆదాబ్‌ చేశాడు. వెంటనే మహరాజ్‌ లేచి తమ్ముడికి ఆదాబ్‌ చేశారు. నాన్న కంగారు పడ్డారు. ‘‘మీరు అంత చిన్న పిల్లాడికి ఆదాబ్‌ చేయకూడదు..’’ అని చెప్పబోయారు. అప్పుడు మహరాజ్‌... ‘‘నేను చేసిన ఆదాబ్‌ అతను ఎప్పుడూ మర్చిపోడు.

నేర్చుకుంటాడు’’ అన్నారు. ఇలాంటి మరొక సంఘటన బొంబాయి ధన్‌రాజ్‌ మహల్‌లో జరిగింది. ఒకసారి ఆయన ధనరాజ్‌ మహల్‌కు వచ్చారు. పిల్లలందరినీ పిలిచి... అందరికీ తలో బంగారు అష్రఫీ ఇచ్చారు. ఆ అఫ్రఫీని చూసి తమ్ముడు చున్నుకు కోపం వచ్చింది.

వెంటనే ఆయన మొహం మీద విసిరాడు. నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది. కానీ మహరాజ్‌ చాలా ఓరిమితో... ‘ధన్‌రాజ్‌... వాళ్లు పిల్లలు. వాళ్లకేం తెలుసు! నాదే తప్పు... వాళ్లకు ఆడుకోవటానికి ఏదైనా తేవాల్సింది. అష్రఫీ వాళ్లేం చేసుకుంటారు’ అని సర్ది చెప్పారు. ఆ మర్నాడు నేవీ స్టోర్స్‌ నుంచి మా అందరికీ రకరకాల ఆట బొమ్మలు తెచ్చి ఇచ్చారు.

మొఘల్స్‌తో సంబంధం...

మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ వద్ద మహరాజా తోడర్మల్‌ ఆర్థిక మంత్రిగా పని చేసేవారు. ఆయన వంశానికి చెందిన రాజా మూల్‌చంద్‌... నిజాముల్క్‌ఉల్క్‌ హైదరాబాద్‌ సంస్థానికి పునాది వేసినప్పుడు, ఆయనతో పాటుగా హైదరాబాద్‌కు వచ్చారు.

ఆ తర్వాత ఆ వంశంవారు ఆసఫ్‌ జాహీల వద్దే ఉండిపోయారు. నిజాం... మహరాజ్‌ చిన్నప్పటి నుంచీ కలిసి చదువుకున్నారు. కలిసి గుర్రపు స్వారీ చేసేవారు. నిజాం రాజ్యాభిషేకం తర్వాత మహరాజ్‌ కిషన్‌ ప్రసాద్‌ ప్రధాని అయ్యారు.


ఇక రాజ భక్తికి సంబంధించిన సంఘటన ఫలక్‌నామా ప్యాలె్‌సలో జరిగింది. ఒకసారి ఫలక్‌నామా ప్యాలెస్‌ ఆస్తుల విషయంలో నోటీస్‌ వచ్చింది. ఈ నోటీస్‌ వచ్చిన సమయానికే నిజాం లోపలి నుంచి బయటకు వస్తున్నారు. నోటీసు విషయం నిజాంకు తెలిస్తే కోపం వచ్చే అవకాశం ఉందని... మహరాజ్‌ ఆ నోటీసును తీసుకొని నమిలి మింగేశారు. ఆ తర్వాత అధికారుల ద్వారా ఆ నోటీసును మళ్లీ తెప్పించుకున్నారు.

మహరాజ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో అనేకమంది కవులను, కళాకారులను ప్రోత్సహించారు. ఆయన ఉర్దూ, పర్షియన్‌, అరబిక్‌ భాషల్లో నిష్ణాతుడు. ‘షాద్‌’ అనే కలం పేరుతో కవిత్వం రాసేవారు.

విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌... మహరాజ్‌కు మంచి మిత్రుడు. విశ్వకవి హైదరాబాద్‌ వచ్చినప్పుడు మహరాజ్‌ ప్యాలె్‌సలోనే ఉండేవారు. ప్రస్తుతం షాద్‌నగర్‌... ఒకప్పటి ఆయన జాగీరులోనిదే. ఆయనకు కాలిగ్రఫీ (అందంగా రాయడం)లో మంచి నైపుణ్యం ఉంది.

ఆయన అక్షరాలు ముత్యాల్లా ఉండేవి. సాధారణంగా రాజ కుటుంబీకులు సామాన్య ప్రజలతో కలవటం చాలా తక్కువ. కానీ మహరాజ్‌... ఇటు సామాన్యులతో... అటు రాజకుటుంబీకులతోనూ ఒకే విధంగా కలిసిపోయేవారు. రోజూ ఆయన ప్యాలెస్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో కారులో నుంచి వెండి నాణేలు విసిరేవారు. వీటి కోసం ప్యాలెస్‌ ముందు కొన్ని వందల మంది గుమ్మిగూడేవారు. మహరాజ్‌ మరణం తర్వాత వారి కుటుంబ పరిస్థితులు మారిపోయాయి. వేల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. కొద్దికాలం క్రితం మహరాజ్‌ మనవడు... ఆయన ఫొటో ఆల్బమ్‌లను అమ్మకానికి పెట్టాడు. ఒకో ఆల్బమ్‌కు రెండు లక్షల రూపాయలు ఇచ్చి కొని, వాటిని నా దగ్గర భద్రపరిచాను. నిజాంల సమయంలో అనేక మంది మహరాజులు వారికి సేవ చేసి ఉండచ్చు. కానీ సామాన్య ప్రజలు కూడా మహరాజ్‌ అని పిలుచుకొనేది కిషన్‌ ప్రసాద్‌ అంకుల్‌నే!

Updated Date - May 05 , 2024 | 12:41 AM