Share News

ఉచిత బస్సు తప్ప.. అంతా ఉత్తుత్తే

ABN , Publish Date - May 02 , 2024 | 12:07 AM

కాంగ్రెస్‌ దుష్ట పరిపాలనలో ఉచితబస్సు తప్ప.. ఇతర హామీలేవి అమలు కావడం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న బస్సుయాత్ర బుధవారం సాయంత్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి రాత్రి 7.10గంటలకు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకుంది.

ఉచిత బస్సు తప్ప.. అంతా ఉత్తుత్తే

కాంగ్రెస్‌ దుష్ట పరిపాలనలో హామీలేవీ నెరవేరడం లేదు

మానుకోట జిల్లా ఉండాలంటే. బీఆర్‌ఎస్‌ గెలవాలె

బస్సుయాత్ర, కార్నర్‌ మీటింగ్‌లో మాజీ సీఎం కేసీఆర్‌

మహబూబాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ దుష్ట పరిపాలనలో ఉచితబస్సు తప్ప.. ఇతర హామీలేవి అమలు కావడం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న బస్సుయాత్ర బుధవారం సాయంత్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి రాత్రి 7.10గంటలకు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకుంది. కానీ ఆయన ప్రచారంపై బుధవారం రాత్రి 8గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించిన నేపథ్యంలో.. 7.20గంటలకు ఇందిరాగాంధీ సెంటర్‌కు చేరుకున్న ఆయన 14 నిమిషాల పాటు ప్రసంగించారు. తాను మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే.. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎత్తివేస్తామని స్పష్టంగా చెబుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికి బ్రేక్‌ వేయాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపించాలని పిలుపునిచ్చారు. తన ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధిస్తే.. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు నష్టపోతున్నారని, కరీంనగర్‌ జిల్లాలో వడ్లు కొనడం లేదని, వాటిని ఆరబెట్టుకున్న ఓ రైతు కుప్పకూలి గుండెఆగి మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకంతో ఆటోరిక్షా కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో ఈ ప్రాంతానికి ఎన్నడు నీళ్లు రాలేదని, వెన్నవరం కాలువల ద్వారా చుక్క నీరు రాలేదని, కాళేశ్వరం కట్టిన తర్వాతనే వెన్నవరం కాలువల ద్వారా నీళ్లు వచ్చాయని వివరించారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎందుకు రాలేదంటూ ప్రజలను ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని, రైతుబంధు ఇవ్వడం లేదని, అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణకు న్యాయం చేసేందుకు తనగొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. బీజేపీ మోదీ ప్రభుత్వం గోదావరి నీళ్లను తీసుకుపోతోందని, సీఎం రేవంత్‌రెడ్డి మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌, నర్సంపేటల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఖమ్మంలో మురికినీరు వస్తోందని విచారం వ్యక్తం చేశారు. కరెంట్‌, భగీరథ పథకాలు ఎక్కడికి పోయాయయని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గిరిజనులను గౌరవించలేదని, మహబూబాబాద్‌ ప్రాంతంలో సేవాలాల్‌ దేవాలయాన్ని బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్మించామని, గిరిజనులకు రిజర్వేషన్లను కల్పించామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ కార్నర్‌ మీటింగ్‌లో మహబూబాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, ఎమ్మెల్సీలు వద్దిరాజు రవిచంద్ర, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సత్యవతిరాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు డీఎ్‌స.రెడ్యానాయక్‌, బానోత్‌ శంకర్‌నాయక్‌, హరిప్రియ, రేగ కాంతారావు, మానుకోట, ములుగు జడ్పీ చైర్‌పర్సన్‌లు ఆంగోతు బిందు, బడె నాగజ్యోతి, మునిసిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివా్‌సరెడ్డి, కేఎ్‌సఎన్‌.రెడ్డి, గుడిపుడి నవీన్‌రావు, కుడితి మహేందర్‌రెడ్డి, యాళ్ల మురళీధర్‌రెడ్డి, ఎండి.ఫరీద్‌, చిట్యాల జనార్థన్‌, షేక్‌.మహబూబ్‌పాషా, తేళ్ల శ్రీనివాస్‌, నాయిని రంజిత్‌, సుధాగాని మురళి, ముత్యం వెంకన్న పాల్గొన్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌ ఖుషీ..

మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రోడ్‌షోకు జనం భారీగా తరలిరావడంతో మాజీ సీఎం కేసీఆర్‌ ఖుషీ అయ్యారు. భద్రాద్రి జిల్లా నుంచి మానుకోటకు చేరుకున్న కేసీఆర్‌కు పట్టణ శివార్లలో నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇందిరాగాంధీ సెంటర్‌ వరకు రోడ్‌షో నిర్వహించారు. బస్సులో నుంచే అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ తెలంగాణ పాటలకు నృత్యాలు చేశారు. సభ ప్రదేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటాలతో ఎగురవేసిన బెలూన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. యంత్రాల ద్వారా చల్లిన గులాబీ రంగు కాగితాలతో ఆ ప్రాంతమంతా గులాబీమయమైంది.

Updated Date - May 02 , 2024 | 12:07 AM