Share News

బీజేపీతోనే అభివృద్ధి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:04 AM

భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించి దేశం అభివృద్ధిలో అగ్రభాగానికి చేరిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్‌ గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మానుకోట జనసభను సోమవారం నిర్వహించారు.

బీజేపీతోనే అభివృద్ధి

పదేళ్ల పాలనలో అన్నిరంగాల్లోనూ పురోగతి

జాతీయ రహదారులకు మహర్దశ

రామప్పకు యునెస్కో గుర్తింపునిచ్చింది బీజేపీయే

గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క-సారలమ్మ పేరు

మానుకోట జనసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించి దేశం అభివృద్ధిలో అగ్రభాగానికి చేరిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్‌ గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మానుకోట జనసభను సోమవారం నిర్వహించారు. ఈ సభకు హాజరైన నడ్డా మాట్లాడుతూ దేశంలోని జాతీయ రహదారులకు మహర్దశ కల్పించేందుకు కృషి చేశామని, హైదరాబాద్‌ నుంచి మహబూబాబాద్‌ మీదుగా భద్రాచలం వరకు జాతీయ రహదారి నిర్మించడంతో పాటు పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రంలో హైదరాబాద్‌ తరహాలో పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన చరిత్ర ప్రధాని మోదీదని, ప్రసిద్ధ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఇవ్వడంతో పాటు జాతీయ గిరిజన యూనివర్సిటీని ములుగులో ఏర్పాటు చేసి సమ్మక్క-సారలమ్మ పేరిట నామకరణం చేశామన్నారు.

ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి..

మానుకోట పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. అంతేకాకుండా మానుకోట మునిసిపాలిటీని అమృత్‌ పథకంలో చేర్చేలా కృషి చేస్తామని, బంజారాల సమస్యల పరిష్కారానికి పాటుపడతామన్నారు. ఏకలవ్య రెసిడెన్షియల్‌, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని పేర్కొన్న ఆయన తమ ప్రభుత్వం ఎంతో ధైర్యంగా 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందని, ఎస్టీల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు చేపట్టిందని తెలిపారు. తమ పాలనలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ ఇస్తున్నామని, ఈ పథకాలు మరో ఐదేళ్లు కొనసాగిస్తామని చెప్పారు. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చిన తాము మరో మూడు కోట్ల ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా 70ఏళ్ల పైబడిన వారికి చికిత్స లభిస్తోందని, త్వరలోనే పైపులైన్‌ ద్వారా ఇంటింటికి గ్యాస్‌ సరఫరా చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీ లక్ష్మణ్‌, మానుకోట ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మార్తినేని ధర్మారావు, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, యాప సీతయ్య, వద్దిరాజు రాంచం దర్‌రావు, చీకటి మహేష్‌గౌడ్‌, మోసంగి మురళి, సింగారపు సతీష్‌, భూక్య సంగీత, వెంకటనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శశివర్దన్‌రెడ్డి, బోయినపల్లి లక్ష్మణ్‌రావు, దార ఇందుభారతి, పల్లె సందీప్‌, చుక్కల నరేష్‌, సిరికొండ సంపత్‌, వల్లభు వెంకటేశ్వర్లు, క్యాచువల్‌ శ్యాంసుందర్‌శర్మ, ఆకుల శ్రీనివాస్‌, రాధాపటేల్‌, మదన్‌, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆశీర్వదించి గెలిపిస్తే 24 గంటలు ప్రజా సేవలో ఉంటా

- బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్‌

మహబూబాబాద్‌ రూరల్‌, మే 29: దేశంలో మళ్లీ బీజేపీదే అధికారమని, మూడోసారి ప్రధానిగా మోదీనేనని, తనను ఆశీర్వదించి గెలిపిస్తే 24గంటలు ప్రజాసేవలో ఉంటానని ఆ పార్టీ మానుకోట ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్‌ పేర్కొన్నారు. సోమవారం జరిగిన మానుకోట జనసభలో మాట్లాడిన ఆయన బీఆర్‌ఎస్‌ తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఇచ్చిందని, తనకు బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇవ్వకుండా మోసం చేస్తే బీజేపీ ఆదరించిందన్నారు. తాను గతంలో మానుకోట ఎంపీగా పనిచేసిన సమయంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని, ఇంకా చేయాల్సి ఉందన్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. తన మీద తనకు నమ్మకం లేక ఆయన దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాల హామీలతో గద్దె నెక్కిన రేవంత్‌రెడ్డి వాటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో దోపిడీ, లంచగొండి తనం పెరిగిందే తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మూడో సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మానుకోట పార్లమెంట్‌ స్థానంలో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నిధులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరగనుందన్నారు.

ముందుగానే వచ్చిన నడ్డా...

గంట పర్యటనలో.. అరగంట ప్రసంగం..

ప్రధాని మోదీ.. జై శ్రీరామ్‌ నినాదాలు

సోమవారం మిట్ట మధ్యాహ్నం జరిగిన బీజేపీ మానుకోట జనసభ విజయవంతమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా అధికారిక షెడ్యూల్‌ ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలకు మహబూ బాబాద్‌ సభా వేదికపై ప్రసంగించాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీ లక్ష్మణ్‌, మానుకోట అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్‌తో కలిసి వచ్చిన ఆయన అక్కడ్నుంచి నేరుగా కారులో ఎన్టీఆర్‌ స్టేడియంలోని సభావేదికపైకి సరిగ్గా 2.21 గంటలకు చేరుకున్నారు. పది నిమిషాల పాటు ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్‌ ప్రసంగించిన అనంతరం 2.31 గంటలకు జేపీ నడ్డా ప్రసంగం ఆరంభమైంది. 30 నిమిషాల పాటు అనర్గళంగా తన ప్రసంగాన్ని కొనసాగించి 3.01 గంటలకు ముగించారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులు ఆయన్ను సత్కరించాక హైదరాబాద్‌ తిరుగుపయన మయ్యారు. మానుకోట సభ మధ్యాహ్నం 3 గంటలకని ప్రకటించినా 12 గంటల నుంచే జనం రాక ప్రారంభమైంది. ఇక సభలో ప్రధాని మోదీ.. జైశ్రీరామ్‌ నినాదాలు వినిపించాయి.

Updated Date - Apr 30 , 2024 | 12:04 AM