Share News

TG: తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు

ABN , Publish Date - May 02 , 2024 | 05:51 AM

తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంచుతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

TG: తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు

న్యూఢిల్లీ, మే 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంచుతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 5 గంటల్లోపు క్యూ లైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే తెలంగాణలో ఎండల తీవ్రత ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. అది ఈ విషయాన్ని ఈసీకి నివేదించింది.


అన్ని అంశాలు పరిశీలించిన ఈసీ... తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని మరో గంటసేపు పొడిగించాలని నిర్ణయించింది. మే 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. దీని ప్రకారం సాయంత్రం 6 గంటల్లోపు క్యూలైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే, 5 లోక్‌సభ నియోజకవర్గాల (ఆదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం) పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం పోలింగ్‌ సమయం పొడిగించలేదు. అవి.. సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రచాలం, కొత్తగూడెం, అశ్వారావుపేట. ఈ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది.

Updated Date - May 02 , 2024 | 05:51 AM