Share News

బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటే

ABN , Publish Date - May 02 , 2024 | 05:55 AM

కేసీఆర్‌.. తెలంగాణకు శనిలా దాపురించాడని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మంలో నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తానని కేసీఆర్‌ చెప్పడం

బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటే

నామాను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానని కేసీఆర్‌ చెప్పడమే నిదర్శనం

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్య

టీడీపీ కార్యాలయానికి మంత్రి, నేతలు

ఎన్నికల్లో సహకరించాలని వినతి

నేలకొండపల్లి/ఖమ్మం మామిళ్లగూడెం, మే 1: కేసీఆర్‌.. తెలంగాణకు శనిలా దాపురించాడని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మంలో నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తానని కేసీఆర్‌ చెప్పడం చూస్తే.. బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు ఉందని చెప్పకనే చెప్పినట్టుందని అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాయమాటలతో రెండు సార్లు అధికారం చేపట్టిన కేసీఆర్‌.. ధనిక రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. రాముడి పేరు చెప్పి, నాలుగు అక్షింతలు పంచి మూడో సారీ ప్రధాని కావాలని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు తెలివిగల వారని, ఖమ్మం ప్రజలు ఇంకా చైతన్యవంతులని, ఎవరిని గెలిపించుకోవాలో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు రాష్ట్రంలో కనీసం 15స్థానాల్లోనైనా కాంగ్రె్‌సను గెలిపించాలన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సకు టీడీపీ స్థానిక నాయకులు సహకరించాలని పొంగులేటి కోరారు. రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత కేతినేని హరీశ్‌ చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను ఓడించేందుకు టీడీపీ కార్యకర్తలు విశేష కృషి చేశారని ప్రశంసించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తాము పని చేస్తామని ఆ పార్టీ నేతలు వాసిరెడ్డి రామనాధం, కేతినేని హరీశ్‌ చెప్పారు.

Updated Date - May 02 , 2024 | 05:55 AM