Share News

BJP : తెలంగాణలో 12 పక్కా

ABN , Publish Date - May 02 , 2024 | 05:26 AM

తెలంగాణలో బీజేపీ 12 సీట్లు ఖాయంగా గెలుచుకోబోతోందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. మరో మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉందని, స్థానిక నాయకత్వం కష్టపడితే

BJP : తెలంగాణలో 12 పక్కా

కష్టపడితే మరో మూడు స్థానాలు గెలిచే చాన్స్‌..

రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే

పార్టీ ముఖ్యనేతలతో అమిత్‌ షా ..

ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం

ఈ నెల 8, 10 తేదీల్లో రాష్ట్రంలో మోదీ ప్రచారం

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ 12 సీట్లు ఖాయంగా గెలుచుకోబోతోందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. మరో మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉందని, స్థానిక నాయకత్వం కష్టపడితే వాటిలో కూడా అద్భుతం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ అనూహ్య స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ప్రతి కార్యకర్త, తన కుటుంబంతోపాటు మరో మూడు కుటుంబాలను ప్రభావితం చేసేలా కష్టపడి పనిచేయాలని సూచించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, కన్వీనర్లు, జిల్లా అధ్యక్షులతో అమిత్‌ షా సమావేశమయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రచార సరళిని సమీక్షించారు. ఎన్నికలకు మరో పదిరోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రచారం మరింత ఉధృతంగా కొనసాగించాలని ఆదేశించారు. డబుల్‌ డిజిట్‌ స్థానాలు కైవసం చేసుకోవడంలో భాగంగా అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌.. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రచార సరళిని సమీక్షించారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, ఈ నెల 8, 10వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్‌కి మద్దతుగా ఈ నెల 8న వేములవాడలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అనంతరం వరంగల్‌లో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. 10న మహబూబ్‌నగర్‌లో, హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - May 02 , 2024 | 05:29 AM