Share News

మునుగోడులో 46.6 డిగ్రీలు

ABN , Publish Date - May 02 , 2024 | 05:05 AM

సూరీడు తగ్గేదేలే అంటూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారుతోంది. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రత బుధవారం రెండో

మునుగోడులో 46.6 డిగ్రీలు

రాష్ట్రంలో మరో 13 చోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వడదెబ్బకు ఏడుగురి మృతి

మరో 3 రోజులు వడగాలుల తీవ్రత

‘గ్రేటర్‌’లో 20% పెరిగిన విద్యుత్‌ వినియోగం

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): సూరీడు తగ్గేదేలే అంటూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారుతోంది. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రత బుధవారం రెండో రోజూ 46 డిగ్రీలు దాటిపోయింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో అత్యధికంగా 46.6 డిగ్రీలు నమోదయింది. ఉదయం 9 గంటల నుంచే వీస్తున్న వడగాలులు, ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో బుధవారం వడదెబ్బ తగిలి ఓ ఉపాధ్యాయురాలు, బాలుడు సహా ఏడుగురు మరణించారు. గురు, శుక్ర, శని వారాల్లో వడగాలులు వీస్తాయని, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో గురువారం వడగాలుల తీవ్రత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే నెలలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. మండుతున్న ఎండలతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరెంట్‌ వినియోగం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మంగళవారం 88.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదు అయింది. గత సంవత్సరం ఏప్రిల్‌ కంటే ఈ ఏడాది అదే నెలలో 20 శాతం విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది.

గత పదేళ్లలో ఈ స్థాయిలో ఎండలు కాయడం ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మునగాల, ములుగు జిల్లా మంగపేట మండలం, భద్రాచలంలో 46.5, ఖమ్మం జిల్లా వైరా, ఖమ్మం ఖానాపురంలో 46.4, జగిత్యాల జిల్లా నేరెళ్ల, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4, మంచిర్యాల జిల్లా జన్నారం, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 46.2, మంథనిలో 46.1, రామగుండం, సుల్తానాబాద్‌, ఆలుబాకలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో 45 డిగ్రీలు దాటింది. ఆ మార్కు దాటిన ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 43-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. బుధవారం కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 43.4 డిగ్రీలు నమోదైంది. ఎండల తీవ్రత, వడగాలులతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వ్యాపారాలు డీలా పడుతున్నాయి.


ఎన్నికల శిక్షణకు హాజరై తిరిగి వెళ్తూ..

వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఎన్నికల శిక్షణకు హాజరై తిరిగి వెళుతున్న రాణి(45) అనే ఉపాధ్యాయురాలు వడదెబ్బ తగిలి బస్టాండ్‌ వద్ద కుప్పకూలిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతిచెందారు. కరీంనగర్‌ జిల్ల రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన యశ్వంత్‌ (5) అనే బాలుడు, జగిత్యాల జిల్లా కోరుట్లలో పత్తిపాక రమేష్‌ అనే చిరు వ్యాపారి వడదెబ్బతో మృతిచెందారు. జనగామ, ఆదిలాబాద్‌ జిల్లాలో వడదెబ్బ తగిలి ఇద్దరు ఉపాధి కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

మేలోనూ మంటలే!

విశాఖపట్నం: ఎల్‌నినో బలహీనపడినా దాని ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం అగ్నిగుండంలా మారాయి. మే నెలకు సంబంధించి బుధవారం భారత వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. తెలంగాణ, ఏపీలో సగటున 2-4 రోజులు వడగాడ్పులు వీయనున్నాయి. కొన్ని భాగాలు తప్ప దేశంలో కనీస ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఈ నెలలో దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయి.

Updated Date - May 02 , 2024 | 05:05 AM