Share News

కుబేరుల కదనం!

ABN , Publish Date - May 01 , 2024 | 05:30 AM

ఆ ముగ్గురూ శ్రీమంతులు! వందల కోట్లకు పడగలెత్తిన కుబేరులు! ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం చూస్తే.. రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న అభ్యర్థుల్లోనే సంపన్నులు! చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బరిలో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు! మరి, అత్యధిక ఓట్లు సాధించి అధ్యక్షా! అనేదెవరో!?

కుబేరుల కదనం!

చేవెళ్లలో శ్రీమంతుల మధ్య త్రిముఖ పోరు

రంజిత్‌రెడ్డికి అసంతృప్త నేతల తలపోటు

గెలవాలనే ‘సంకల్పం’తో విశ్వేశ్వర్‌రెడ్డి పట్టు

బీసీ కార్డుతో పావులు కదుపుతున్న కాసాని

మూడొంతులు పట్టణ ప్రాంతం.. సెటిలర్లు కీలకం

ఆ ముగ్గురూ శ్రీమంతులు! వందల కోట్లకు పడగలెత్తిన కుబేరులు! ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం చూస్తే.. రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న అభ్యర్థుల్లోనే సంపన్నులు! చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బరిలో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు! మరి, అత్యధిక ఓట్లు సాధించి అధ్యక్షా! అనేదెవరో!?

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

హైదరాబాద్‌ను ఆనుకుని ఉండే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కాస్త విభిన్నం! ఇక్కడ మూడింట రెండొంతులు పట్టణ ప్రాంతమైతే.. మిగిలినది గ్రామీణం!

ఓటర్లలోనూ అత్యధికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారు! వారిలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరాది నుంచి వచ్చిన వారు ఉన్నారు! ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎ్‌సకు దాదాపు లక్ష ఓట్లు అధికంగా రాగా.. బీజేపీ గణనీయంగా మూడు లక్షలకుపైగా ఓట్లు సాధించింది!

అందుకే, ఇక్కడ లోక్‌సభ ఎన్నికల్లో ముక్కోణ పోరు సాగుతోంది! హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్‌.. పూర్వ వైభవానికి కాంగ్రెస్‌.. ఖాతా తెరవాలని బీజేపీ పోటీ పడుతున్నాయి.

సంక్షేమ, అభివృద్ధి మంత్రాన్ని కాంగ్రెస్‌.. మోదీ గ్యారెంటీలను బీజేపీ.. బీసీ కార్డును బీఆర్‌ఎస్‌ నమ్ముకున్నాయి. ఇక్కడ పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు అపర కుబేరులను రంగంలోకి దింపాయి.

పౌలీ్ట్ర వ్యాపారవేత్త, సిటింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డిని కాంగ్రెస్‌.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని బీజేపీ.. మాజీ జడ్పీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్‌ఎస్‌ బరిలోకి దింపాయి.

కాంగ్రె్‌సలో కంగాళీ

కాంగ్రె్‌సను చేవెళ్లలో అసంతృప్తుల బెడద వెంటాడుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి వరకూ తర్జనభర్జనలు పడిన కాంగ్రెస్‌ చివరకు బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డిని తీసుకొచ్చి టికెట్‌ ఇచ్చింది. నిజానికి, ఆయన కంటే ముందే పార్టీలో చేరిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డికి చేవెళ్ల టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చింది.

దీంతో ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్లాఆర్‌ తదితరులు కూడా ఈ సీటు ఆశించారు. కానీ, అనూహ్యంగా రంజిత్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చి సునీతకు మల్కాజిగిరి కేటాయించారు. అయితే, రంజిత్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ సీనియర్లు కొందరు ఇంకా జీర్ణించుకోవడం లేదు. అసంతృప్త నేతలను దారికి తెచ్చుకునే విషయంలో కాంగ్రెస్‌ నాయకత్వంతోపాటు రంజిత్‌ రెడ్డి కూడా ఇంకా పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. ప్రచారంలో కొందరు అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

కొన్నిచోట్ల బహిరంగంగానే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌ కేడర్‌పై కేసులు పెట్టిన వారిని తీసుకొచ్చి ఇప్పుడు వారి తరఫున ప్రచారం చేయమంటే ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. అసంతృప్త నేతలను పార్టీ నేతలు బుజ్జగించే యత్నాలు చేస్తున్నారు. చేరికలూ గందరగోళంగా మారాయి.

రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధమై వెనక్కి వెళ్లిపోయారు. పార్టీలో చేరాలనుకుంటున్న నాయకుల భవిష్యత్తుకు హామీ ఇచ్చేవారు.. పార్టీలోని సీనియర్లకు నచ్చచెప్పి భరోసా ఇచ్చేవారు లేకపోయారు. ఉమ్మడి జిల్లాలో కొంత పట్టున్న మహేందర్‌ రెడ్డి పూర్తిస్థాయిలో మల్కాజి గిరిపైనే దృష్టి కేంద్రీకరించారు.

ఈ నేపథ్యంలోనే, నిన్నమొన్నటి వరకు చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ గెలుపును సవాల్‌గా తీసుకుని పని చేస్తున్నారు.


కమలం.. కదనం!

బీజేపీ తన అభ్యర్థిని ఎంతో ముందుగానే ప్రకటించింది! దాంతో, ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అందరి కంటే ముందే ప్రచారం ప్రారంభించారు. తాజా రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంటూ దూసుకుపోతున్నారు. నిజానికి, ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో నాలుగు బీఆర్‌ఎస్‌, మూడు కాంగ్రెస్‌ గెలిచాయి.

బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అప్పటి పరిస్థితులతో పోలిస్తే పూర్తి భిన్నమైన వాతావరణం ఇప్పుడు నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కాషాయ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు సవాల్‌ విసురుతోంది. విశ్వేశ్వర్‌ రెడ్డి వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

భారీ బహిరంగ సభలు కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి ఆయా వర్గాలతో వేర్వేరుగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గంలో ఏమేం చేస్తానో చెబుతూ ‘చేవెళ్ల సంకల్ప పత్రాన్ని’ విడుదల చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా 3,700 కిలోమీటర్ల మేర తాను చేసిన ప్రజా ఆశీర్వాద యాత్రలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి ఇందులో సంకల్పం చెప్పుకొన్నారు.

ప్రధాని మోదీ పేరునే ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుని ఓట్లు అడుగుతున్నారు. ఆయన గెలుపు కోసం బీజేపీ కేడర్‌తోపాటు ఆ పార్టీ అనుబంధ సంస్థలు చాప కింద నీరులా పనిచేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి సానుకూల పరిస్థితులు ఉండడంతో గ్రామీణ ప్రాంతాలపై బీజేపీ ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది.

ఇక, విశ్వేశ్వర్‌ రెడ్డి భార్య, అపోలో ఆస్పత్రుల జేఎండీ సంగీతారెడ్డి కాలనీ అసోసియేషన్లు, మహిళా సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ప్రచారంలోకి జాతీయ నాయకులను కూడా రంగంలోకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. త్వరలో ప్రధాని మోదీ కూడా నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

సెటిలర్స్‌ ఓట్లే కీలకం

చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో మూడు సెగ్మెంట్లు హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉండగా మిగతా నాలుగు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో దాదాపు 65 శాతం పట్టణ ఓటర్లే. వీరిలో అత్యధికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారే. గెలుపోటములను శాసించే స్థితిలో ఉండడంతో వీరి ఓట్లు కీలకంగా మారాయి.

బీఆర్‌ఎస్‌ బీసీ కార్డు ఫలించేనా?

సిటింగ్‌ సీటును కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ తంటాలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 4 సెగ్మెంట్లలో గెలవడమే కాకుండా లక్షకుపైగా ఓట్లను అధికంగా సాధించిన ఈ పార్టీ.. పార్లమెంటు ఎన్నికల్లో తొలి నుంచీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.

సిటింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డికే టికెట్‌ ఇచ్చిన తర్వాత ఆయన కాంగ్రె్‌సలోకి వెళ్లిపోయారు. ఆయనతోపాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా అదే బాట పట్టారు.

బీసీల్లో కొంత పట్టున్న కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్‌ఎస్‌ బరిలోకి దింపింది. తద్వారా ఇక్కడ బీసీ కార్డును ప్రయోగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మంచి పట్టు ఉండడంతో సబితారెడ్డికి బాధ్యతలను అప్పగించారు.

Updated Date - May 01 , 2024 | 05:30 AM