Share News

గజదొంగ పశ్చాత్తాపం

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:43 AM

పూర్వం రాజగృహ అనే పట్టణంలో లోహకురుడనే దొంగ ఉండేవాడు. అతను చాలా క్రూరుడిగా, ప్రమాదకరమైనవాడిగా పేరు పొందాడు. లోహకురుడి కొడుకు రోహిణేయుడు. తండ్రిని మించిన తెలివితేటలు, ధైర్యం...

గజదొంగ పశ్చాత్తాపం

సద్బోధ

21న మహావీర జయంతి

పూర్వం రాజగృహ అనే పట్టణంలో లోహకురుడనే దొంగ ఉండేవాడు. అతను చాలా క్రూరుడిగా, ప్రమాదకరమైనవాడిగా పేరు పొందాడు. లోహకురుడి కొడుకు రోహిణేయుడు. తండ్రిని మించిన తెలివితేటలు, ధైర్యం కలిగినవాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడిచి... గజదొంగ అయ్యాడు. లోహకురుడు వృద్ధాప్యంతో మంచం పట్టాడు. మరణించేముందు కొడుకును పిలిచి ‘‘మహావీరుడి బోధలు ఎన్నడూ వినకు. ఎందుకంటే ఆయన బోధలు మన వృత్తికి తగినవి కావు’’ అని చెప్పాడు. అలాగేనని తండ్రికి రోహిణేయుడు మాట ఇచ్చాడు.

కొన్నాళ్ళ తరువాత... రోహిణేయుడు ఒక నగరంలో నుంచి వెళుతూ ఉండగా... మహావీరుడు కొందరికి దీక్ష ఇస్తున్నట్టు తెలిసింది. మహావీరుడి ప్రసంగం అతనికి వినిపిస్తోంది. వెంటనే అతను చెవులు రెండూ మూసుకొని, వేగంగా నడవడం ప్రారంభించాడు. కొద్దిదూరం వెళ్ళగానే అతని కాలికి పదునైన ముల్లు గుచ్చుకుంది. ముల్లును తొలగించడానికి... ఒక చెవి మీద నుంచి చేతిని తియ్యాల్సి వచ్చింది. ‘‘ఎవరి పాదాలు నేలను తాకవో, ఎవరు కనురెప్పలు ఆర్పరో, ఎవరి శరీరానికి చెమట పట్టదో, ఎవరి మెడలో వేసిన పూల మాల వాడిపోదో... అటువంటి వారే దివ్యులైనవారు. దేవతలు’’ అని మహావీరుడు చెప్పిన మాటలు అతని చెవిన పడ్డాయి. తన పాదం నుంచి ముల్లును తొలగించుకున్న రోహిణేయుడు అక్కడి నుంచి బయటపడ్డాడు.

క్రమంగా అతని దుండగాలు మితిమీరాయి. అతని దోపిడీల్లో సంపద పొగొట్టుకున్నవారు రాజును కలిసి... రోహిణేయుడి బారి నుంచి తమను కాపాడాలని విన్నవించుకున్నారు. ఆ బాధ్యతలను మంత్రి అభయకుమారుడికి రాజు అప్పగించాడు. మంచి వ్యూహకర్త అయిన మంత్రి... కీలకమైన ప్రదేశాల్లో, సంపన్నులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సైనికులతో గట్టి నిఘా పెట్టాడు. వారు వలపన్ని రోహిణేయుణ్ణి పట్టుకున్నారు. అయితే అతని దగ్గర దొంగ సొత్తు ఏదీ దొరకలేదు.

న్యాయస్థానంలో రోహిణేయుణ్ణి ప్రవేశపెట్టినప్పుడు... తను దగ్గరలో ఉన్న గ్రామంలోని రైతుననీ, తనకు ఏ పాపం తెలీదనీ వాదించాడు. రాజభటులు ఆ గ్రామంలో తన గురించి ఆరా తీస్తారని అతనికి తెలుసు. అందుకే ముందుజాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. అతను తమ గ్రామం వాడేనని అక్కడివారు చెప్పడంతో.... న్యాయమూర్తులు అతణ్ణి విడిచిపెట్టారు.

కానీ అతనే గజదొంగ రోహిణేయుడనేది అభయకుమారుడి నమ్మకం. ఆ సంగతి అతని నోటి నుంచే చెప్పించడానికి ఒక పథకం వేశాడు. తన మనుషులతో రోహిణేయుణ్ణి తప్పతాగించి, స్పృహ తప్పేలా చేశాడు. రోహిణేయుడికి తెలివి వచ్చేసరికి... అతని చుట్టూ పరిసరాలన్నీ స్వర్గంలా కనిపించేలా ఏర్పాటు చేశాడు. అక్కడ కొందరు మహిళలను, పురుషులను దేవదూతల వేషంలో ఉంచాడు.

రోహిణేయుడు మేలుకున్నాడు. ‘‘నేనెక్కడ ఉన్నాను?’’ అని అక్కడ ఉన్నవారిని అడిగాడు.

‘‘నువ్వు స్వర్గంలో ఉన్నావు. నీ జీవితంలో చేసిన తప్పులన్నీ అంగీకరిస్తే... స్వర్గ సుఖాలు నీకు శాశ్వతంగా లభిస్తాయి’’ అని వారు చెప్పారు. ‘‘తక్షణం చెప్పాలి’’ అని ఒత్తిడి చేశారు.

రోహిణేయుడికి సందేహం కలిగింది. ఏం చేయాలని అతను ఆలోచిస్తూ ఉండగా... మహావీరుడి నుంచి విన్న మాటలు గుర్తుకువచ్చాయి. మానవుల మాదిరిగా వారి కాళ్ళు నేలను తాకుతున్నాయి. వాళ్ళు కనురెప్పలు ఆర్పుతున్నారు. వాళ్ళ శరీరాల మీద చెమట కనిపిస్తోంది. వాళ్ళ మెడలోని పూలదండల్లో కొన్ని పూలు వాడిపోయి ఉన్నాయి. ‘ఇది స్వర్గం కాదు. నా నోట నేను చేసిన దోపిడీల గురించి చెప్పించడానికి వేసిన ఎత్తుగడ’ అని గ్రహించాడు.

‘‘నాకేమీ తెలీదు’’ అని గట్టిగా చెప్పాడు. వారు అతణ్ణి బతిమాలి, బెదిరించి... ఫలితం లేకపోవడంతో వదిలేశారు.

‘మహావీరుడి మాటలు ఎంతో అద్భుతమైనవి. ఎంతో శక్తిమంతమైనవి. నేను విన్నది కొన్ని వాక్యాలే. అవి కూడా వినకూడదని ఎంతగా అనుకున్నా నా చెవిన పడ్డాయి. అవే నా జీవితాన్ని కాపాడాయి. ఇక మీదట దొంగతనాలు చేయను. మహావీరుణ్ణి ఆశ్రయిస్తాను’ అని రేహిణేయుడు నిశ్చయించుకున్నాడు. గతంలో తను చేసిన పనులన్నీ తలచుకొని పశ్చాత్తాపం చెందాడు. మహావీరుణ్ణి కలుసుకొని, ఆయన పాదాలమీద పడ్డాడు.

‘‘స్వామీ! నేను ఎన్నో పాపాలు చేశాను. ఆ జీవితం మీద విరక్తి కలిగింది. పాప విముక్తి పొందాలనుకుంటున్నాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి’’ అని ప్రార్థించాడు. మహావీరుడు అందుకు అంగీకరించి... రోహిణేయుడికి దీక్ష ఇచ్చాడు. మహావీరుడి బోధలు వింటూ, ఆయన నిర్దేశించిన అహింస, సత్యం, ఇతరుల ఆస్తిని ఆశించకపోవడం, దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యం అనే పంచవ్రతాలను పాటిస్తూ కైవల్యసాధన మార్గంలో పయనించాడు రోహిణేయుడు.

Updated Date - Apr 19 , 2024 | 05:43 AM