Share News

BRS MLAs : ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనాసక్తి?

ABN , Publish Date - May 02 , 2024 | 05:52 AM

ఓవైపు పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.

 BRS MLAs : ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనాసక్తి?

జీహెచ్‌ఎంసీలో కొందరి నామమాత్రపు ప్రచారం.. క్షేత్రస్థాయి పర్యటనలూ అంతంతే

అభ్యర్థులు వచ్చినప్పుడే వారి వెంట

పార్టీ క్యాడర్‌కూ దిశానిర్దేశం కరువు

ప్రత్యర్థులకు లోపాయికారీ మద్దతు?

అధికార పార్టీతో టచ్‌లో పలువురు!

సికింద్రాబాద్‌, మల్కాజిగిరి స్థానాల పరిధిలో బీఆర్‌ఎస్‌లో అయోమయం

హైదరాబాద్‌ సిటీ, మే 1 (ఆంధ్రజ్యోతి): ఓవైపు పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయినా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇల్లు దాటి బయటకు రావడంలేదు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజల్లోకి వెళ్లడంలేదు. అభ్యర్థి తమ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే వారి వెంట కనిపిస్తున్నారు తప్ప.. నియోజకవర్గంలో సొంతంగా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ఎమ్మెల్యే లేకుండా తాము మాత్రమే ప్రచారం చేస్తే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందోనని వారు కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ పరిణామాలు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్కో పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడం, ప్రతి ప్రాంతంలో తాము పర్యటించే అవకాశం లేని దృష్ట్యా ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహించాలని ఎంపీ అభ్యర్థులు కోరుతున్నారు. పార్టీ అగ్రనేతలు కూడా ప్రచారం విస్తృతం చేయాలని ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను ఆదేశించారు. ఒక్కో ఓటు ఎంతో కీలకమని, ప్రతి కార్యకర్త శ్రమించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల సూచించారు. అయినా కొందరు ప్రజాప్రతినిధులు, నేతల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. అయితే గ్రేటర్‌ పరిధిలోని కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వారు లోపాయికారీగా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులకు మద్దతిస్తున్నారని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సహకరించకుండా క్యాడర్‌ను కూడా కట్టడి చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.

తమకేమీ పట్టనట్లుగా..

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఓ ఎమ్మెల్యే స్థానికంగా ప్రచారం నిర్వహించడం లేదు. ఆయనకు స్థానిక కార్పొరేటర్లతో వైరం ఉండడంతో.. వారిని కూడా ప్రచారానికి ఆహ్వానించడం లేదు. క్యాడర్‌కూ ఎలాంటి సూచనలు చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బూత్‌ల వారీగా నమ్మకస్తులకు బాధ్యతలు అప్పగించిన ఈ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మరో సెగ్మెంట్‌లో మొన్నటి వరకు మౌనంగా ఉన్న ఓ ఎమ్మెల్యే మాత్రం.. ఒకటి, రెండు రోజులుగా ప్రచారం ప్రారంభించారు. సాయంత్రం వేళల్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కానీ, స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్‌ నేతలను ఆయన కలుపుకొని పోవడంలేదన్న విమర్శలున్నాయి. ఇక ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ సెగ్మెంట్‌లో గులాబీ పార్టీని ముందుండి నడిపించేవారు కరువయ్యారు. ఒకరిద్దరు నేతలు సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో కొంత గ్యాప్‌ కనిపిస్తోంది. ఇక్కడ ప్రచారంపైనా ఆ ప్రభావం ఉంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఎంపీ అభ్యర్థి వస్తేనే..

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఓ ఎమ్మెల్యే.. ఎంపీ అభ్యర్థి వస్తే తప్ప తన సెగ్మెంట్‌లో ప్రచారం చేయడంలేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండు, మూడు సమావేశాలు నిర్వహించడం మినహా ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం ప్రారంభించలేదు. ఈ నియోజకవర్గంలో కార్పొరేటర్లు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. మరో అసెంబ్లీ సెగ్మెంట్‌లో స్థానిక ఎమ్మెల్యే కినుక వహించారు. పార్టీ కార్యకర్తలు, కాలనీ సంఘాలు, బస్తీ సంఘాలతో సమావేశాలు తప్ప.. క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడం లేదు. శాసనసభ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని పోయిన ఈ ఎమ్మెల్యే.. ఇప్పుడు కొందరు పార్టీ నేతలను దూరం పెట్టారని అంటున్నారు.


ప్రత్యర్థికి లోపాయికారీగా!

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు అధికార కాంగ్రె్‌సలో చేరుతారన్న ప్రచారం మొన్నటివరకు జరిగింది. అయితే రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి హస్తం గూటికి చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసినా.. చివరి నిమిషంలో యూ టర్న్‌ తీసుకున్నారు. ఆ తరువాత కూడా కాంగ్రె్‌సలో ఎమ్మెల్యేల చేరికలు చోటుచేసుకోలేదు. అయితే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం పార్టీ మారాలన్న ఉద్దేశంతో కొందరు ఎమ్మెల్యేలు తాత్కాలికంగా చేరికను వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. దీంతో వీరు ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీకి పని చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రె్‌సతో టచ్‌లో ఉన్న ముగ్గురు, నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లోపాయికారీగా ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతునిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో ఓ హోటల్‌లో సమావేశమైనట్టు చెబుతున్నారు. మరో ఎమ్మెల్యే కూడా సదరు అభ్యర్థితో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మల్కాజిగిరి పార్టమెంట్‌ పరిధిలోని ఓ ఎమ్మెల్యే కూడా ప్రచారం విషయంలో అంటీముట్టనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.

Updated Date - May 02 , 2024 | 08:57 AM