Share News

వాహన రంగం నీరసం

ABN , Publish Date - May 02 , 2024 | 04:10 AM

దేశంలో వాహన విక్రయాలు ఏప్రిల్‌ నెలలో స్తబ్ధంగా ఉన్నాయి. ఆటోమొబైల్‌ రంగంలోకి కంపెనీలన్నీ కలిసి 3,38,341 లక్షల వాహనాలను విక్రయించాయి. గత ఏడాది ఇదే నెలలో అధిక సంఖ్యలో...

వాహన రంగం నీరసం

విక్రయాల్లో వృద్ధి అంతంతే

న్యూఢిల్లీ: దేశంలో వాహన విక్రయాలు ఏప్రిల్‌ నెలలో స్తబ్ధంగా ఉన్నాయి. ఆటోమొబైల్‌ రంగంలోకి కంపెనీలన్నీ కలిసి 3,38,341 లక్షల వాహనాలను విక్రయించాయి. గత ఏడాది ఇదే నెలలో అధిక సంఖ్యలో వాహనాలు అమ్ముడైన ప్రభావం (బేస్‌ ఎఫెక్ట్‌), ప్రస్తుత ఎన్నికల సీజన్‌ కారణంగా ఏప్రిల్‌లో ఆటో అమ్మకాలు నిస్తేజంగా సాగాయని అంటున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో 3,32,468 వాహనాలు అమ్ముడుపోయాయి. దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ 1.77 శాతం వృద్ధితో 1,37,952 కార్లు మాత్రమే విక్రయించగలిగింది. ప్రయాణికుల కార్లలో ద్వితీయ స్థానంలో ఉన్న హ్యుండై మోటార్స్‌ ఒక శాతం వృద్ధితో 50,201 కార్లు మాత్రమే విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్‌లో మారుతి 1,37,320 వాహనాలు విక్రయించగా హ్యుండై 49,701 కార్లు విక్రయించింది. సాధారణంగా ఎన్నికల సీజన్‌లో మార్కెట్లు నిస్తేజంగానే ఉంటాయని, ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే మళ్లీ జోరందుకుంటాయని మారుతి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) పార్థో బెనర్జీ అన్నారు. జూన్‌ వరకు మార్కెట్‌ పరిస్థితి ఇలాగే ఉండవచ్చునని ఆయన తెలిపారు. సరఫరాల వ్యవస్థ మెరుగుపడిన కారణంగా పరిశ్రమలో ఆర్డర్ల సంఖ్య కూడా తగ్గిందని హ్యుండై మోటార్‌ ఇండియా సీఓఓ తరుణ్‌ గార్గ్‌ అన్నారు. రుతుపవనాలు ప్రోత్సాహకరంగా ఉంటే గ్రామీణ అమ్మకాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.


  • టాటా మోటార్స్‌ 47,883 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్‌లో విక్రయించిన 47,007 యూనిట్లతో పోల్చితే అమ్మకాలు 2 శాతం పెరిగాయి.

  • టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ అమ్మకాలు 32 శాతం పెరిగి 15,510 యూనిట్ల నుంచి 20,494 యూనిట్లకు చేరాయి.

  • ఎంజీ మోటార్‌ ఇండియా రిటైల్‌ అమ్మకాలు 1.45 శాతం తగ్గి 4,485కి పడిపోయాయి. గత ఏడాది ఏప్రిల్‌ అమ్మకాలు 4,551 యూనిట్లు.

టూవీలర్‌ అమ్మకాలు: టీవీఎస్‌ మోటార్‌ 29 శాతం వృద్ధితో 3,01.449 వాహనాలు విక్రయించింది. రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ అమ్మకాల్లో 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 75,038 వాహనాలు విక్రయించింది.


2026 నాటికి చిన్న కార్ల పునరుజ్జీవం

దేశీయ మార్కెట్లో 2026 చివరికి లేదా 2027 ప్రారంభ సమయానికి చిన్న కార్లకు తిరిగి డిమాండు ఏర్పడవచ్చునని మారు తి సుజుకీ భావిస్తోంది. ఒకప్పుడు భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌ను ఏలిన చిన్న కార్ల విభాగం వాటా ఇప్పుడు 30 శాతం కన్నా దిగువకు పడిపోయింది. 2018-19 నుంచి తిరోగమనంలో ఉన్న ద్విచక్ర వాహనాల మార్కెట్‌ ఇప్పుడు పుంజుకున్నదని, అది చిన్న కార్ల మార్కెట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని పార్థో బెనర్జీ అభిప్రాయపడ్డారు.

Updated Date - May 02 , 2024 | 04:10 AM