Share News

ఓ లక్ష్యంతో టీడీపీలోకి వచ్చా

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:38 AM

‘కాంగ్రెస్‌ పార్టీని వీడి ఒక లక్ష్యంతో టీడీపీలోకి వచ్చా. ఆర్డీఎస్‌, ఎల్లెల్సీ గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను సాధించెంత వరకూ నేను నిద్రపోను’ అని మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి అన్నారు. గురువారం

ఓ లక్ష్యంతో టీడీపీలోకి వచ్చా

కర్నూలు జిల్లా ప్రజలు నాకు దేవుళ్లు

కోడుమూరును వదలి వెళ్లలేకున్నా: కోట్ల

సభలో కన్నీరు కార్చిన జయసూర్య ప్రకాశ్‌రెడ్డి

కోడుమూరు, ఏప్రిల్‌ 18: ‘కాంగ్రెస్‌ పార్టీని వీడి ఒక లక్ష్యంతో టీడీపీలోకి వచ్చా. ఆర్డీఎస్‌, ఎల్లెల్సీ గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను సాధించెంత వరకూ నేను నిద్రపోను’ అని మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి అన్నారు. గురువారం కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి హాజరయ్యారు. ‘కర్నూలు పార్లమెంటు నుంచి నేను పోటీ చేయకపోవడంతో 14 లక్షల మంది ఓటర్లు చింతిస్తున్నారు. కర్నూలు జిల్లా ప్రజలు నాకు దేవుళ్లాంటివాళ్లు. వదిలి వెళ్లాలంటే తట్టుకోలేపోతున్నా. ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలను వదిలిపెట్టి వెళ్లాలంటే తట్టుకోలే పోతున్నా’ అని అన్నారు. ఆ సమయంలో ఆయన గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నేత కంటతడి పెట్టడంతో ఒక్కసారిగా అక్కడ నిశబ్ద వాతావరణం ఏర్పడింది. అక్కడ ఉన్న కోట్ల అభిమానులు సైతం కన్నీరు పెట్టారు. తేరుకున్న అనంతరం కోట్ల మాట్లాడుతూ... పార్టీలో వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగాపోతే తప్పకుండా టీడీపీ గెలుస్తుందని అన్నారు. టీడీపీ గెలవాలి కాబట్టి అభిమానులంతా కలిసి కట్టుగా పని చేసి కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. తప్పకుండగా టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక రైతు బిడ్డగా రైతులకు ఇచ్చిన హామీలను తప్పకుండగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Apr 19 , 2024 | 04:38 AM