Share News

AP Election 2024: ‘గాజుగ్లాసు’పై గందరగోళం!

ABN , Publish Date - May 02 , 2024 | 05:40 AM

జనసేనకు చెందిన గాజుగ్లాసు గుర్తుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) తాజా ఉత్తర్వులు ప్రతిపక్ష టీడీపీ కూటమితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లందరినీ గందరగోళంలో పడేశాయి.

AP Election 2024: ‘గాజుగ్లాసు’పై గందరగోళం!

  • జనసేన పోటీచేసే స్థానాల వరకే ఈసీ ఊరట

  • విచారణ మూసివేసిన హైకోర్టు

  • ఈసీ నిర్ణయంపై తక్షణమే కోర్టుకు టీడీపీ

  • జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాం

  • స్వతంత్రులకు ఆ గుర్తు కేటాయించడం సరికాదు

  • మాపై ప్రతికూల ప్రభావం.. ఈసీ ఉత్తర్వులతో ఓటర్లలో మరింత అయోమయం

  • గాజుగ్లాసును జనసేనకే రిజర్వు చేయాలి.. ఈసీని అలా ఆదేశించాలని అభ్యర్థన

  • నేడు హైకోర్టులో విచారణ.. మళ్లీ కోర్టుకెళ్లాలని జనసేన కూడా యోచన

అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): జనసేనకు చెందిన గాజుగ్లాసు గుర్తుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) తాజా ఉత్తర్వులు ప్రతిపక్ష టీడీపీ కూటమితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లందరినీ గందరగోళంలో పడేశాయి. జనసేన పోటీచేసే రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఇతరులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించబోమని.. ఆ పార్టీ బరిలోకి దిగిన 21 అసెంబ్లీ స్థానాలున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులెవరికీ ఈ గుర్తు ఇవ్వొద్దని రిటర్నింగ్‌ అధికారు(ఆర్వో)లకు ఆదేశాలిచ్చామని ఈసీ బుధవారం హైకోర్టుకు నివేదించింది. కోర్టు దీనిపై విచారణను కూడా మూసివేసింది. అయితే ఈసీ నిర్ణయం తమ కూటమిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున.. గాజుగ్లాసు గుర్తును ఇతర స్వతంత్ర అభ్యర్థులెవరికీ కేటాయించకుండా జనసేనకే రిజర్వ్‌ చేసేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బుధవారమే అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు.

గుర్తింపులేని రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులకు గానీ, స్వతంత్ర అభ్యర్థులకు గానీ ఈ గుర్తును కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు గురువారం విచారణ జరుపనుంది. ‘జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజుగ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా పోటీ చేస్తున్నాయి. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు.. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు.. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రచారం కూడా చేస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోను సైతం విడుదల చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసీ కేటాయించిన గుర్తులను అభ్యర్థులు ఓటర్ల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల గుర్తుది కీలక పాత్ర.


అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యులైన ఓటర్లు.. ఎన్నికల గుర్తును ఆధారంగా చేసుకుని తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. నిబంధనలను అనుసరించి ఈసీ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించింది. ఫ్రీ సింబల్‌ జాబితాలో ఉన్న ఈ గుర్తును ఆ జాబితా నుంచి తొలగించి తమకు రిజర్వ్‌ చేయాలని ఆ పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపులేని రిజిస్టర్డ్‌ పార్టీ అభ్యర్థులకు కేటాయించారు. ఈ నేపథ్యంలో జనసేన హైకోర్టును ఆశ్రయించగా.. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు, జనసేన పోటీలో ఉన్న రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఇతర స్వతంత్ర, గుర్తింపులేని రిజిస్టర్డ్‌ పార్టీలకు గాజుగ్లాసు సింబల్‌ కేటాయించి ఉంటే సవరించాలని ఆర్వోలను ఆదేశించినట్లు ఈసీ హైకోర్టుకు నివేదించింది. కమిషన్‌ ఉత్తర్వులు ఓటర్లను మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి.

62 అసెంబ్లీ, 5 పార్లమెంటు నియోజకవర్గాలకు ఈసీ ఉత్తర్వులు వర్తించడం లేదు. జనసేనకు సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని కమిషన్‌ తీసుకున్న నిర్ణయం కూటమి అభ్యర్థుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఈసీ నిర్ణయం ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసే పార్టీలు, అభ్యర్థుల సమానావకాశాలను దెబ్బతీస్తుంది. ప్రతికూల పరిస్థితులు కల్పిస్తుంది. పోటీ చేసే అభ్యర్థులు, ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఎన్నికల గుర్తుల కేటాయింపు.. నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. మా హక్కులకు భంగం కలుగుతున్న నేపఽథ్యంలో వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపండి’ అని పిటిషన్‌లో రామయ్య కోరారు.


‘గాజుగ్లాసు’పై ఆర్వోలకు ఆదేశాలిచ్చాం: ఈసీ

జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలు ఉన్నలోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు, గుర్తింపులేని రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలకు గాజుగ్లాసు గుర్తు కేటాయించవద్దని ఆర్వోలను ఆదేశించినట్లు ఈసీ అంతకుముందు హైకోర్టుకు తెలిపింది. అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న స్వతంత్ర, గుర్తింపులేని రిజిస్టర్డ్‌ పార్టీలకు ఈ సింబల్‌ కేటాయించవద్దని, ఒకవేళ కేటాయించి ఉంటే సవరించాలని వారిని నిర్దేశించినట్లు నివేదించింది. ఈ నిర్ణయంతో ఈ పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపింది. ఈసీ నిర్ణయంపై జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు తరఫు సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ సంతృప్తి వ్యక్తం చేయడంతో న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ వ్యాజ్యంపై విచారణను మూసివేశారు. అయితే ఈసీ నిర్ణయం కూటమిలోని ఇతర భాగస్వాములను అయోమయంలో పడేసిందని టీడీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ ఇబ్బందులను జనసేన కూడా గుర్తించింది. మరోసారి కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది.

Updated Date - May 02 , 2024 | 06:55 AM