Share News

పన్నున్‌ హత్యకు కుట్ర అవాస్తవం

ABN , Publish Date - May 01 , 2024 | 05:40 AM

అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ను ఆ దేశంలోనే హత్య చేసేందుకు భారత్‌ కుట్ర పన్నిందన్న వార్తలను విదేశీ వ్యవహారాల శాఖ ఖండించింది. ఇది బాధ్యతారాహిత్య, నిరాధార, అనవసర ఆరోపణ అని వ్యాఖ్యానించింది. అమెరికా

పన్నున్‌ హత్యకు కుట్ర అవాస్తవం

అది బాధ్యతారాహిత్య ఆరోపణ

విదేశీ వ్యవహారాల శాఖ వివరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ను ఆ దేశంలోనే హత్య చేసేందుకు భారత్‌ కుట్ర పన్నిందన్న వార్తలను విదేశీ వ్యవహారాల శాఖ ఖండించింది. ఇది బాధ్యతారాహిత్య, నిరాధార, అనవసర ఆరోపణ అని వ్యాఖ్యానించింది. అమెరికా భూభాగంలోనే పన్నున్‌ను కాల్చి చంపేందుకు భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) అధికారి విక్రం యాదవ్‌ ప్రయత్నించారంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనాన్ని ప్రచురించింది. దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ ఒక తీవ్రమైన విషయంపై అసత్యాలు ప్రచురించినట్టు తెలిపారు. గత ఏడాది ఇదే అంశంపై అమెరికా సమాచారాన్ని పంపించగా, దానిపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తోందని పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతుండగానే మళ్లీ ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పన్నున్‌ ఉగ్రవాది అంటూ కేంద్ర ప్రభుత్వం ముద్ర వేసింది. అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉన్న అతనిపై ఇక్కడ పలు కేసులు ఉన్నాయి. ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను కెనడాలో భారత ఏజెంట్లు హత్య చేశారన్న సమాచారం తమకు ఉందంటూ గత ఏడాది ఆ దేశ ప్రధాని ఆరోపించారు. ఆ తరువాత కొన్ని రోజులకు పన్నున్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతన్ని అమెరికాలో హత్య చేసేందుకు భారత అధికారులతో కలిసి నిఖిల్‌ గుప్తా అనే వ్యక్తి పనిచేస్తున్నట్టు ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ‘రా’ అధికారి విక్రం యాదవ్‌కు ఇందులో సంబంధం ఉందంటూ తాజాగా కథనం వెలువడింది.

Updated Date - May 01 , 2024 | 07:46 AM