Share News

జాతీయ స్థాయిలోనూ తీసికట్టు!

ABN , Publish Date - May 01 , 2024 | 05:53 AM

మహిళా సాధికారత గురించి రాజకీయ పార్టీలు చేసే ప్రకటనలకు, ఇచ్చే టికెట్లకు పొంతన ఉండటం లేదు. ఎన్నికల్లో మహిళలకు అంతంత మాత్రంగానే ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి

జాతీయ స్థాయిలోనూ తీసికట్టు!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: మహిళా సాధికారత గురించి రాజకీయ పార్టీలు చేసే ప్రకటనలకు, ఇచ్చే టికెట్లకు పొంతన ఉండటం లేదు. ఎన్నికల్లో మహిళలకు అంతంత మాత్రంగానే ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన రెండు దశల ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మహిళలు 8 శాతం మాత్రమే.

తొలి దశలోని 135 మంది మహిళా అభ్యర్థుల్లో అత్యధికంగా తమిళనాడులోనే 76 మంది ఉండటం విశేషం. రెండో దశ ఎన్నికల్లో గరిష్ఠంగా కేరళలో 24 మంది మహిళా అభ్యర్థులున్నారు. రెండు దశల్లో కలిపి బీజేపీ 69, కాంగ్రెస్‌ 44 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల కోసం ఎన్నో వాగ్దానాలు చేశాయి. మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలు, సేవా రంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం తదితర హామీలను బీజేపీ మేనిఫెస్టోలో పెట్టగా, మహిళల సాధికారతకు చట్టపరమైన సంస్కరణలు, సత్వరమే మహిళా రిజర్వేషన్‌ చట్టం తదితర హామీలను కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందుపరిచింది.

అయితే, ఈ నిబద్ధతను మహిళలకు టికెట్లు కేటాయించే విషయంలో చూపలేదు. ఒడిసాకు చెందిన బీజూ జనతా దళ్‌ (బీజేడీ) మాత్రమే తమ పార్టీ విధానంలో భాగంగా మహిళలకు ఎన్నికల్లో 33 శాతం టికెట్లు కేటాయిస్తోంది.

ఈనెల 19న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 1,625 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో మహిళలు 135 మంది మాత్రమే. ఈనెల 26న జరిగిన రెండో దశ ఎన్నికల్లో 1,198 మంది పోటీ చేయగా, వారిలో మహిళలు వంద మంది మాత్రమే. రెండు దశల్లోనూ కలిపి 2,823 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో మహిళలు 235 మంది మాత్రమే.

Updated Date - May 01 , 2024 | 07:41 AM