Share News

Delhi: మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్‌ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా?

ABN , Publish Date - May 02 , 2024 | 03:34 AM

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనేదే కాంగ్రెస్‌ ఉద్దేశం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Delhi: మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్‌ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా?

  • బీజేపీ ఉన్నంత వరకూ రిజర్వేషన్లు ఉంటాయి

  • ప్రధాని నరేంద్ర మోదీ

  • అబద్ధాలను పదే పదే చెప్పడం కాంగ్రెస్‌ నైజం: షా

  • ఎన్నికల అనంతరంకాంగ్రెస్‌ పని ఖతం

  • గాంధీజీ ఆకాంక్ష నెరవేరుతుంది: రాజ్‌నాథ్‌

బీజేపీ ఉన్నంత వరకూ రిజర్వేషన్లు ఉంటాయి: మోదీ

బనస్కంత, కోర్బా, న్యూఢిల్లీ, మే 1: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనేదే కాంగ్రెస్‌ ఉద్దేశం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒకవేళ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్‌ చెప్పదలచుకుంటే.. ఆ విషయాన్ని ఆ పార్టీ, ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు రాతపూర్వకంగా ఇవ్వగలవా? అని ప్రశ్నించారు. మతం పేరిట రిజర్వేషన్లను దుర్వినియోగపరచబోమంటూ కాంగ్రెస్‌ రాకుమారుడు చెప్పగలారా? అని రాహుల్‌ గాంధీ పేరును ప్రస్తావించకుండా మోదీ నిలదీశారు.


గుజరాత్‌లోని బనస్కంత జిల్లాలోని దీసా పట్టణంలో బుధవారం ఓ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. తాను, బీజేపీ ఉన్నంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రకటించారు. కాగా, రిజర్వేషన్లను తాము తొలగించబోమని, ఆ పనికి సిద్ధమైతే కాంగ్రె్‌సనూ అడ్డుకుంటామని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.


ఛత్తీ్‌సగఢ్‌ కోర్బా జిల్లాలోని కట్గోరా పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షా మాట్లాడారు. అబద్ధాలను బహిరంగంగా, బిగ్గరగా, పదే పదే చెప్పడం కాంగ్రెస్‌ నైజం అని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఒక కుటుంబం కోసం అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, చివరికి ఎన్నికల్లో ఓటమికి ఆయన్నే బాధ్యులను చేస్తారని పేర్కొన్నారు.

Updated Date - May 02 , 2024 | 03:34 AM