వైవిధ్యానికి పెట్టింది పేరు... అందమైన చిత్తూరు!

చిత్తూరు జిల్లాను తలుచుకోగానే కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులు... పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగ రూపంలో పరమశివుడు పూజలందుకుంటున్న శైవక్షేత్రం శ్రీకాళహస్తి.. సత్యప్రమాణాలకు సాక్షిగా వరసిద్ధి వినాయకుడు ధర్మపరిపాలన చేస్తున్న కాణిపాకం క్షేత్రాలు తలపునకు వస్తాయి. అత్యంత పవిత్రమైన, ప్రాచీనమైన, ఈ పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న కారణంగా చిత్తురు జిల్లా అంటే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అందరిలోనూ ముద్రపడిపోయింది. ఈ జిల్లా ఆధ్యాత్మిక స్థలాలకు మాత్రమే గాక మరెన్నో రమణీయ పర్యాటక ప్రదేశాలకు, ప్రకృతి సౌందర్యానికి కూడా నెలవై ఉంది.

ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతితో ముడిపడిన విజ్ఞానదాయకమైన, వినోదభరితమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, చారిత్రక కేంద్రాలను చిత్తూరు జిల్లాలో తిలకించవచ్చు. చంద్రగిరి కోట, తలకోన - నెలకోన జలపాతాలు, మదనపల్లె సమీపంలో హార్స్‌లీ హిల్స్‌, కైలాసకోన వాటర్‌ ఫాల్స్‌, గెల్లతీగ, పులిగుండు తదితర అటవీ పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లాకు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇలా ఇంకెన్నో విశేషాలు తెలుసుకోవడానికి చిత్తూరు జిల్లాను ఒకసారి చుట్టివద్దామా !


చంద్రగిరి కోట..

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల కీర్తికి ప్రతీకగా చంద్రగిరి కోట నిలిచింది. ఆనాటి ఆనవాళ్లు, రాజులు వినియోగించిన వస్తువులు, పడక గదులు, రహస్య మందిరాలను చూస్తుంటే నాటి చరిత్ర మన కళ్ళముందు కదలాడి మధురానుభూతిని మిగిల్చుతుంది. అప్పటి చారిత్రక విశేషాలను తెలియజేసేందుకు ఏపీ టూరిజం శాఖ సాయంత్రం వేళల్లో ఆకర్షణీయమైన సౌండ్‌ అండ్‌ లైట్‌షోను కూడా ఏర్పాటుచేసింది. చంద్రగిరి కోట గురించి వివరించేందుకు అన్ని భాషలు తెలిసిన గైడ్లు కూడా అందుబాటులో ఉంటారు. సంవత్సరంలో నవంబరు నుండి ఫిబ్రవరి వరకు సాయంత్రం 6.30 గంటలకు తెలుగులో, 7.30 గంటలకు ఇంగ్లీష్‌లో- మార్చి నుండి అక్టోబరు వరకు సాయంత్రం 7 గంటలకు(తెలుగు), సాయంత్రం 8 గంటలకు (ఇంగ్లీష్‌) భాషల్లో వివరిస్తారు.

ఎలా వెళ్ళాలంటే...

చంద్రగిరి కోట తిరుపతి నుండి 15 కిలోమీటర్లు దూరంలో ఉంది. బస్సులు, ప్రయివేటు వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

శేషాచలం కొండలు...

చిత్తూరు జిల్లాలో ప్రధానంగా శేషాచలం కొండలు జీవవైవిధ్యానికి ప్రతిబింబమై వైజ్ఞానిక రంగానికి పెట్టనికోటగా నిలిచాయి. ఎన్నో అరుదైన జాతుల మొక్కలు ఈ కొండల్లో ఉన్నాయి. సుమారు 175 రకాల పక్షుల జాతులను కూడా ఈ ప్రాంతంలో గుర్తించారు. క్రయ్సోపిలియ టాప్రోబానిక అని పిలిచే ఎగిరే పామును శేషాచలం జీవావరణ ప్రాంతంలో కనిపెట్టారు. ఇక్కడే సుమారు ఐదు కుటుంబాలకు చెందిన 60కి పైగా జాతులకు చెందిన సీతాకోకచిలుకలు ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఎర్రచందనం వృక్షాలు పెరిగే అరుదైన నేల అయిన నల్లమల అటవీ ప్రాంతంలో చిత్తూరు జిల్లా కూడా భాగమే. ప్రపంచానికి తెలియని మరెన్నో ప్రకృతి రహస్యాలను చిత్తూరు జిల్లాలో దాగున్నాయనడం అతిశయోక్తి కాదు. శేషాచలం కొండల్లో పరిశోధనలకోసం, వైజ్ఞానిక పర్యటనల కోసం ఎందరో వస్తుంటారు. ఆరోగ్యం కోసం, ఆహ్లాదం కోసం ఈ కొండల్లోని పలు ప్రాంతాల్లో ట్రెకింగ్ క్యాంపులు జరుగుతుంటాయి.

తలకోన..

చిత్తూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన తలకోన పర్యాటకులకు అత్యంత ఆహ్లాదభరితమైన అనుభూతిని ఇస్తోంది. శేషాచల పర్వత అటవీ ప్రాణువుల్లో ఉన్న తలకోన సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తులో అత్యంత చల్లదనమైన ప్రాంతం. ఎత్తయిన కొండలు, ఆకాశాన్ని అంటినట్టుండే వృక్షాలు, జలపాత సోయగాలు, పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణుల పలుకరింపుల నడుమ ఉషోదయ సంధ్యావేళలో తలకోన ప్రకృతి అందాలను చూసి తనివితీరవలసిందే. మాటల్లో వర్ణించేందుకు వీలుకాని ప్రకృతి రమణీయ మనోహార ప్రాంతమిది. తలకోన అటవీ ప్రాంతం అందాలను ఆస్వాదించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే గాక కర్నాటక, తమిళనాడు నుంచి కూడా పెద్దఎత్తున సందర్శకులు వస్తుంటారు.

తలకోనలోని ఎత్తయిన కొండల నుంచి నిత్యం జాలువారే జలపాతాలు కనువిందు చేస్తుంటాయి. ఆ కింద పర్యాటకులు జలకాలాడుతూ మైమరచిపోతుంటారు. దాదాపు 300 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఏడాది పొడవునా పర్యాటకులు, భక్తులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ కాస్త జాగ్రత్త వహించి జలపాతంలో స్నానం చెయ్యాల్సి ఉంటుంది.

తలకోన అడవుల్లో అరుదైన వృక్ష సంపద కనిపిస్తుంది. ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు, సీరియళ్లు ఇక్కడ షూటింగ్‌ జరుపుకున్నాయి. జలపాతంతో పాటు ఇక్కడ శివాలయం కూడా ఉంది. దీనిని సిద్ధేశ్వరాలయం అంటారు. వారాంతపు రోజులను తలకోనలో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పేదల ఊటీగా పేరొందిన తలకోన పర్యాటక ప్రాంతాన్ని సందర్శించని జిల్లావాసులుండరు. వేసవిలో పర్యాటకులను ఎంతో ఆహ్లాదపరిచే తలకోన సందర్శనకు ఏపీ టూరిజం కాటేజీలను ఏర్పాటు చేసింది. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపాన బోటింగ్‌తో పాటు పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది.

నెలకోన

తలకోన అడవిలోనే తలకోన, నెలకోన అనే పేర్లతో జంట జలపాతాలున్నాయి. వీటిలో నెలకోన జలపాతం రెండు కొండల మధ్యలో ఉంది. ఈ కొండల మధ్యన మనకు కనిపించనంతటి ఎత్తు నుంచి నీరు అక్కడి కొలనులో పడుతుంటుంది. చూడటానికి ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ రెండు కొండల మధ్య పెద్ద గుండు కూడా ఉంది. అక్కడి ప్రకృతిని, పక్షులను జంతుజాలాన్ని వీక్షించేందుకు అటవీ శాఖవారు వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. రమణీయంగా, గంభీరంగా ఉండే నెలకోన వద్దకు పర్యాటకులు ఒంటరిగా వెళ్లరాదని హెచ్చరిస్తుంటారు.

గెల్లతీగ

తీగ జాతుల్లో అత్యంత పొడవైనది గెల్లతీగ. ఔషధాల తయారీలో దీనిని వినియోగిస్తారు. నెలకోనకు వెళ్లే దారిలో ఉన్న ఈ గెల్ల తీగ ఎంతో ప్రాచీనమైనది. ఈ తీగ దాదాపు కిలోమీటరు పొడవు ఉండగా, దీని శాఖోపశాఖలు సుమారు 5 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. తీగ చుట్టుకొలత 260 సెంటీమీటర్లు. గెల్లతీగ కాయలు ఒకొక్కటీ 100 సెంటీమీటర్లు పొడవు ఉంటాయి.

ఐతే సిద్ధక్క బావి

సుమారు 400 సంవత్సరాల ప్రాచీనమైన ఐతే సిద్ధక్క బావి తలకోనకు వెళ్లే మార్గంలో ధనువు తీసిన బండ వద్ద ఉంది. వీటితో పాటు వాచ్‌టవర్‌, ధనువుతీసిన బండను పర్యాటకులు వీక్షించవచ్చు.

ఎలా వెళ్ళాలంటే...

తిరుపతి నుంచి 67 కి.మీల దూరంలో తలకోన ఉంది. తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సు, ప్రైవేటు ట్రావెల్స్‌ ద్వారా తలకోనకు చేరుకోవచ్చు. ప్రజారవాణా ద్వారా అయితే తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సు, భాకరాపేట నుంచి ప్రైవేటు వాహనాలు అద్దెకు మాట్లాడుకోవచ్చు.

వసతి

తలకోనలో టీటీడీ ఆధ్వర్యంలోని వసతి గృహాలు ఉన్నాయి. ఆలయానికి సమీపంలో ఉన్న ఈ వసతి గృహాల అద్దె ప్రాతిపదికన కేటాయిస్తారు. నేరుగా సంప్రదిస్తే అప్పటికప్పుడే గదులు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ ఆధ్వర్యంలోని సీబీఈటీ సముదాయంలో వసతిగృహాలున్నాయి. వనదర్శిని డాట్‌ ఇన్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఈ గృహాలను బుక్‌ చేసుకోవాలి.

పులిగుండు

చిత్తూరు - పెనుమూరు రోడ్డులో కనిపించే ఈ పులిగుండు రెండు నిలువెత్తు రాతి కొండలు అతి దగ్గరగా కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. దీనిపైన శివుడు, అయ్యప్ప ఆలయాలున్నాయి. ఇక్కడ తరచుగా ట్రెక్కింగ్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తారు. ముఖ్యంగా మకర సంక్రాంతి 4వ రోజున పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ కొండల మీదకు ఎక్కుతారు. ఇక్కడి నుంచి తిరుపతి పరిసరాలు, అటవీ ప్రాంతాలు అతి రమణీయంగా కనిపిస్తాయి.

ఎలా వెళ్ళాలంటే...

తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో పులిగుండు ఉంది. బస్సులు, ప్రయివేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.

కైలాసకోన

చిత్తూరు జిల్లాలోని పుత్తూరు దగ్గర ఉన్న ఈ కైలాసకోన అసలు పేరు కైలాసనాథ కోన. కొండల పైనుంచి జాలువారే జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఎత్తయిన కొండల పైనుంచి రకరకాల ఔషధవృక్షాల వేర్లను తాకుతూ దాదాపు 100 అడుగుల పైనుంచి పడుతున్న ఈ జలపాతపు నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. ఈ నీటిలో స్నానం చేస్తే పలు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయంటారు.

ఎలా వెళ్ళాలంటే...

తిరుపతి నుండి 45 కిలోమీటర్లు, మద్రాసు నుండి 100 కిలోమీటర్ల దూరంలో కైలాసకోన ఉంది. ఏపీ టూరిజం హరిత హోటల్‌లో బస చెయ్యవచ్చు. నాన్‌ ఏసీ, డీలక్స్‌ రూమ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రా ఊటీ హార్స్‌లీ హిల్స్‌..

చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వద్ద హిల్‌స్టేషన్‌ హార్సిలీహిల్స్‌ ప్రాంతం ఉంది. సముద్ర మట్టానికి 265 అడుగల ఎత్తులో ఉన్న హార్స్‌లీహిల్స్‌ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవుగా పేరొందింది. కొండదారిలో ఇరువైపులా నీలగిరి వృక్షాలు, సంపెంగ తోటలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. పచ్చని అడవులు, ఔషధ గుణాలు కలిగిన చెట్లతో కనిపించే హార్స్‌లీహిల్స్‌లోని ఆహ్లాదకర వాతావరణం కట్టిపడేస్తుంది. పొగమంచు, చల్లగాలితో ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవికాల విడిదిగా ఎంతో పేరొందిన హార్స్‌లీహిల్స్‌కు ఎందరెందరో పర్యాటకులు, ప్రముఖులు తరలివచ్చి సేదదీరుతుంటారు. ప్రత్యేకించి వేసవిలో అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా హార్స్‌లీహిల్స్‌కు పేరుంది. సుప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషీవ్యాలీ స్కూల్‌ ఇక్కడే ఉంది.

ఎలా వెళ్ళాలంటే...

తిరుపతికి 140 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రా ఊటీ హార్స్‌లీ హిల్స్‌ ఉంది. బస్సు, రైలు మార్గాల్లో మదనపల్లె రోడ్డుకు చేరుకుని హార్స్‌లీ హిల్స్‌ అందాల్లోకి అడుగుపెట్టండి. పలు ప్రయివేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

వసతి..

ఏపీ టూరిజం శాఖ వసతి, ఇతర పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుంది. చిన్న కాటేజీలు, పెద్ద కాటేజీలతో పాటు కొన్ని ప్రైవేట్‌ కాటేజీలు కూడా ఉన్నాయి. గదులను ఆన్‌లైన్‌లో కూడా బుక్‌ చేసుకోవచ్చు.

శ్రీవేంకటేశ్వరా జూలాజికల్ పార్క్ (ఎస్వీ జూ)

దేశంలోని అగ్రశ్రేణి జూలలో ఒకటిగా స్థానం సంపాదించుకున్న ఎస్వీ జంతుప్రదర్శనశాల సందర్శకులకు సరికొత్త అనుభూతిని మిగుల్చుతుంది. సింహాలను దగ్గరగా చూసేందుకు లయన్ సఫారీ సదుపాయం ఉంది. చెంగు చెంగున గెంతుతూ సందడి చేసే లేళ్ళు, దుప్పుల పరుగులతో పోటీ పడేందుకు ఏర్పాటు చేసిన డీర్ సఫారీ సందర్శకులను అలరిస్తాయి. జంతువులు, పక్షులు మాత్రమేగాక ఈ జూ అరుదైన వృక్షసంపద, పుష్పసంపదకు కూడా కేంద్రంగా ఉంది. విద్యార్థులలో జంతుజాలం, ప్రకృతి పట్ల అవగాహన పెంచేందుకు ఇక్కడ బయోస్కోప్ పేరిట ఒక అవగాహన కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. వృక్షసంపద, పుష్పసంపదను వివరించే చాయాచిత్ర ప్రదర్శనను కూడా తిలకించవచ్చు.

జూ సమీపంలోనే సైన్స్‌ సెంటర్‌ కూడా ఉంది. పిల్లలతో వచ్చే పర్యాటకులు సైన్స్‌ సెంటర్‌కు వెళితే విజ్ఞానపు గుళికలను ఆస్వాదించినట్టే ఉంటుంది.

ఎలా వెళ్ళాలంటే...

తిరుపతికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఎస్వీ జూ ఉంది. బస్సులు, ప్రయివేట్ వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

image-Icon చిత్రమాలిక :