సహజ అందాల సిరి.. తూర్పు గోదావరి

ఓవైపు కొబ్బరి చెట్లతో తివాచీ పరిచినట్టు పచ్చగా కనిపించే కోనసీమ, ఇంకోవైపు గోదావరి వయ్యారాలు, మరోవైపు విస్తారమైన అటవీ ప్రాంతాలూ, సాగరతీరాలూ, అభయారణ్యాలూ... తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి అందాలకూ, పర్యాటక ప్రాంతాలకూ కొదవ లేదు. కాకినాడ పట్టణం కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో కావలసినంత విజ్ఞానాన్నీ, వినోదాన్నీ ఆస్వాదించవచ్చు. చరిత్రలో ఎన్నో ఘనతలకు సాక్షిగా నిలిచిన చారిత్రక నగరం రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఈ జిల్లాలోనే గోదావరి తీరాన ఉంది. రాజరాజనరేంద్రుడి పాలన, నన్నయ భారత రచన లాంటి ఎన్నో చారిత్రక ఘటనలకు వేదికై నిలిచింది రాజమహేంద్రి నగరం. గోదావరి నదిని తల్చుకోగానే గుర్తుకువచ్చే అపరభగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జ్ఞాపకాల్ని ఈ జిల్లా పదిలంగా దాచుకుంది. వితంతు వివాహాలను ప్రోత్సహించి సంఘ సంస్కరణ చేపట్టిన సుప్రసిద్ధ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఈ నేలమీదే నడయాడారు. అన్నార్తుల పాలిట నిత్యాన్నదాతగా, కలియుగంలో అన్నపూర్ణగా మన్ననలంది ఇంగ్లాండ్ రాజు 7వ ఎడ్వర్డ్ నుంచి పట్టాభిషేక ఆహ్వానం అందుకున్న డొక్కా సీతమ్మ అన్నదానంతో పునీతమైన భూమి తూర్పు గోదావరి జిల్లా.

తూర్పు గోదావరి జిల్లా ముఖ్య కేంద్రం కాకినాడ. ఇక్కడ బీచ్‌ పర్యాటకుల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఏటా కాకినాడలో జరిగే సాగర సంబరాల వేడుక పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడున్న హోప్ ఐలాండ్ మరో ప్రత్యేక ఆకర్షణ ఉంది. కాకినాడకు చేరువలోనే ఉన్న కోరంగి అభయారణ్యం జీవవైవిధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. అరుదైన వృక్షాలు, జంతుజాలంపై పరిశోధన చేసేవారికి ఈ అభయారణ్యం ఒక విశ్వవిద్యాలయం వంటిదనడం అతిశయోక్తి కానే కాదు. కాకినాడ-యానాం రోడ్డులో కోరంగి దగ్గర మడ అడవులు ప్రత్యేక టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందాయి. మారేడుమిల్లి పరిసరాల్లోని జలతరంగిణి, అమృత జలపాతాలు, కాఫీ తోటలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తున్నాయి. గోదారికి పూలకిరీటంగా విలసిల్లుతున్న కడియం ప్రాంతం కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే ఉంది. ఇక్కడి నుంచి ఒక్క పూల మొక్కయినా తీసుకెళ్ళని సందర్శకులుండరు. కోనసీమ సోయగాలకు నెలవైన తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల సందర్శన పర్యాటకులకు జీవితకాలపు మధురానుభుతిని అందిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కోసం కాకినాడ కోటయ్య కాజా, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు లాంటి నోరూరించే రకరకాల స్వీట్లు మీ నోటిని తీపి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక జాప్యం చేయక చలో ఈస్ట్ గోదావరి...


శతాబ్దాల చరిత... రాజమహేంద్రి ఘనత

కవిత్రయంలో ఒకరైన నన్నయ భట్టారకుని భారత రచన, రాజరాజనరేంద్రుడి పాలన, కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణ... చరిత్రలో ఇలాంటి ఎన్నో ఘనతలకు సాక్షిగా నిలిచిన చారిత్రక నగరం గోదావరి తీరంలో ఉన్న రాజమహేంద్రవరం. గోదావరి గట్టున ఉన్న రాళ్లబండి మ్యూజియం, దామెర్ల ఆర్ట్‌ గ్యాలరీ, గౌతమీ గ్రంథాలయం, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం జన్మగృహం, పెద్ద మసీదు, గౌతమీఘాట్‌ను ఆనుకొని ఉన్న టెంపుల్‌ స్ట్రీట్‌లో ఇస్కాన్‌ టెంపుల్‌, ఆశ్రమాలు ఈ నగరంలో చూడాల్సిన ముఖ్యప్రదేశాల్లో కొన్ని. రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఎపిటిడిసి), ఒక పైవ్రేట్‌ ఏజెన్సీ పర్యాటకుల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో బోట్‌ షికారు నిర్వహిస్తున్నాయి. వీటిలో స్పీడ్‌ బోట్లు కూడా ఉన్నాయి. రోజూ సాయంత్రం పుష్కర ఘాట్‌లో గోదావరి మాతకు ఇచ్చే నిత్య హారతి కన్నులపండుగగా ఉంటుంది.

ఎలా వెళ్ళాలంటే...

రాజమహేంద్రవరానికి దేశంలోని పలు ప్రాంతాలనుంచి రైలు సౌకర్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల నుంచి బస్సుల్లో చేరుకోవచ్చు. ఇక్కడికి సుమారు 16 కి.మీ.దూరంలో మధురపూడి విమానాశ్రయం ఉంది.

అపర భగీరథుడి జ్ఞాపకాలు

గోదావరిపై అనకట్ట నిర్మించి, ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణగా మార్చి, అపర భగీరథునిగా ఖ్యాతి పొందిన వ్యక్తి సర్‌ అర్థర్‌ కాటన్‌. ధవళేశ్వరంలో 1852లో కాటన్‌ మహాశయుడు నిర్మించిన బ్యారేజీ తప్పక చూడాల్సిన ప్రదేశం. ఈ బ్యారేజీ నిర్మాణానికి లండన్‌ నుంచి కాటన్‌ తీసుకువచ్చిన కొన్ని యంత్రాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇక్కడి మ్యూజియంలో కాటన్‌ జీవిత విశేషాలు, ఆయన ఉపయోగించిన పరికరాలు, గోదావరి ఆనకట్ట నిర్మాణ వివరాలు చూడవచ్చు.

ఎలా వెళ్ళాలంటే...

రాజమహేంద్రవరానికి మూడు కి.మీ. దూరంలో ఉన్న ధవళేశ్వరానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

గోదారికి పూలకిరీటం

జిల్లాలోని కడియం ప్రాంతాన్ని సువిశాలమైన పూలతోటగా అభివర్ణించవచ్చు. కడియం మండలం వేమగిరి, కడియపులంక, కడియపు సావరం, కడియం, బుర్రిలంక, వెంకాయమ్మపేట, పొట్టిలంక, వీరవరం, జేగురుపాడు, దామిరెడ్డిపల్లి, దుళ్ల గ్రామాలలో సుమారు 600 వరకూ నర్సరీలు ఉన్నాయి. ఎటుచూసినా రంగురంగుల పూలూ, వేరెక్కడా దాదాపుగా కనిపించని దేశ, విదేశీ రకాల మొక్కలూ కనువిందు చేస్తాయి. వీటి ఖరీదు ఒక్క రూపాయి నుంచి రూ.యాభై వేల వరకూ ఉంటుంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొనుగోలుదారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో రిసార్ట్స్‌ కట్టడానికీ, ధవళేశ్వరం నుంచీ కడియపులంక వరకూ కాలువలో హౌస్‌ బోట్‌ విహారం ఏర్పాటు చేయడానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎలా వెళ్ళాలంటే...

రాజమహేంద్రవరం నుంచి 10 కి.మీ., కాకినాడ నుంచి 60 కి.మీ. దూరంలో కడియం ఉంది.

సర్వాంగ సుందర తీరం

తూర్పుగోదావరి జిల్లా ముఖ్య కేంద్రం కాకినాడ. ఈ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం ఉంది. మార్గమధ్యంలో కాకినాడ పోర్టు, ఫిషింగ్‌ హర్బర్‌, వాకలపూడి లైట్‌హౌస్‌ పర్యాటకులకు దర్శనమిస్తాయి. కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడి గ్రామాన్ని ఆనుకొని ఉన్న కాకినాడ బీచ్‌ పర్యాటకుల కోసం సర్వసుందరంగా రూపు దిద్దుకుంది. ‘సాగర సంబరాలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. వైజాగ్‌ తరహాలో ఈ బీచ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ బీచ్‌ నుంచి ఏడు కిలోమీటర్లు ముందుకు వెళితే ఉప్పాడ సముద్ర తీరం వస్తుంది. అంతెత్తున ఎగసి, రహదారి వరకూ దూసుకువచ్చే అలలను చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కాకినాడ తీరాన్ని ఆనుకుని ఉన్న ఉప్పుటేరుపై చెక్కవంతెన, సముద్రానికి దగ్గరగా టెంట్‌ హౌస్‌లు నిర్మించారు. ‘స్వదేశీ దర్శన్‌’ పథకం కింద కన్వెన్షనల్‌ భవనాలు, లేజర్‌ షో, వాటర్‌ క్రీక్‌, గ్యాలరీలు, సావనీర్‌ షాప్స్‌, పుడ్‌ కోర్టులు, అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. వీటిని త్వరలో ప్రారంభించనున్నారు. కేంద్ర జౌళిశాఖ ఆధ్వర్యంలో హరిత రిసార్ట్‌ సమీపంలో శిల్పారామం నిర్మించారు.

ఎలా వెళ్ళాలంటే...

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి కాకినాడకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. కాకినాడకు సుమారు 15 కి.మీ. దూరంలోని సామర్లకోట ప్రధానమైన రైల్వే జంక్షన్‌. కాకినాడ నుంచి, సామర్లకోట నుంచి ఆ సముద్రతీరాలకు సులువుగా చేరుకోవచ్చు.

వసతి

పర్యాటకుల సౌకర్యం కోసం కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో 2015 సంవత్సరంలో రూ.4.5 కోట్లతో హరిత రిసార్టు నిర్మించారు. ఇందులో 18 ఏసీ కాటేజీలను ఏర్పాటు చేశారు.

కాకినాడకు పెట్టని కోట

నదీ, సాగర సంగమ ప్రదేశంలో సహజసిద్ధంగా ఏర్పడిన అభయారణ్యం కోరంగి. సువిశాలమైన తీరం నుంచి కాకినాడను కాపాడే సహజసిద్ధమైన కోటగా కోరంగిని అభివర్ణిస్తుంటారు. దీన్ని 1978లో భారత ప్రభుత్వం రక్షిత అటవీప్రాంతంగా ప్రకటించింది. నీటి పిల్లి లేదా ఏటి పిల్లి అనే అరుదైన వన్యప్రాణి, అసంఖ్యాకమైన పక్షిజాతులు ఈ అరణ్యంలో కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో దేశాల నుంచి వలస పక్షులు కోరంగికి వస్తుంటాయి. కోరంగిలో 300 మీటర్ల పొడవైన చెక్కవంతెనలపై నడుస్తూ అభయారణ్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ పర్యాటకశాఖ బోటు షికారు ఏర్పాటు చేసింది. అలాగే కాకినాడ-యానాం రోడ్డులో కోరంగి దగ్గర మడ అడవులు ప్రత్యేక టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందాయి. మడ అడవుల మధ్య పడవ ప్రయాణం గొప్ప అనుభూతి.

ఎలా వెళ్ళాలంటే...

కాకినాడ నుంచి 10 కి.మీ. దూరంలో కోరంగి అభయారణ్యం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ఆశల లంక... కడలిలో నెలవంక

కాకినాడకు సమీపంలోని హోప్‌ ఐలాండ్‌ (ఆశాద్వీపం) పెనుతుపాన్ల బారి నుంచి కాకినాడను కాపాడే సహజ రక్షణ కవచం. సుమారు 17.3 కిలోమీటర్ల పొడవు, 2.5 కిలోమీటర్ల వెడల్పుతో నెలవంకలా ఇది కనిపిస్తుంది. ఒకవైపు లోతైన సముద్రం, మరోవైపు బ్యాక్‌వాటర్స్‌ ఆహ్లాదం కలిగిస్తాయి. కాకినాడ పోర్టుకు వచ్చి వెళ్లే నౌకలను హోప్‌ఐలాండ్‌ నుంచి దగ్గరగా వీక్షించవచ్చు. ఈ దీవిలో 70 మత్స్యకార కుటుంబాల వారు నివసిస్తున్నారు. సముద్రం పొంగినా, పెనుతుపాన్లు వచ్చే సూచనలు తెలిసినా వీరు పడవల్లో కాకినాడకు వచ్చేస్తారు.

ఎలా వెళ్ళాలంటే...

కాకినాడ పోర్టులోని జవహర్‌ జెట్టి నుంచి హోప్‌ ఐలాండ్‌కు బోట్లు ఉన్నాయి. ప్రయాణం సుమారు 45 నిమిషాలు ప్రయాణం ఉంటుంది. ఉదయం బయలుదేరి వెళ్ళి, దీవిలో విహరించి, సాయంత్రానికి తిరిగి కాకినాడ చేరుకోవచ్చు.

అందాల అడవిమల్లి... మారేడుమిల్లి

ఎత్తెన కొండలు, గలగలపారే సెలయేళ్లు, వంపుసొంపుల రహదారులు, పక్షుల కుహు..కుహు రాగాలు.. చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి సొగసులు తూర్పుగోదావరి ఏజెన్సీ సొంతం. జిల్లాలోని మారేడుమిల్లి సమీపంలో అటవీశాఖ ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. వెదురుబొంగులలో పెట్టి తయారు చేసిన బొంగు చికెన్‌, బొంగు బిర్యాని ఇక్కడ స్పెషల్‌. మారేడుమిల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి, అమృత జలపాతాలు, కాఫీ తోటలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఎకో టూరిజంలో మరో ప్రధానమైన పర్యాటక ప్రాంతం జంగిల్‌ స్టార్‌. ఇది ఇక్కడికి దగ్గర్లోని పాములేరు వాగుకు సమీపంలో ఉంది.

ఎలా వెళ్ళాలంటే...

ఈ ప్రాంతాలు రాజమహేంద్రవరం నుంచి 80 కి.మీ., కాకినాడ నుంచి 108 కి.మీ. దూరంలో ఉన్నాయి. బస్సులు, ఇతర వాహనాల్లో చేరుకోవచ్చు.

వసతి

మారేడుమిల్లిలో అటవీశాఖ వారి వనవిహారి రిసార్ట్స్‌ ఉన్నాయి. ఇవన్నీ కర్రతో తయారు చేసినవే. బస చెయ్యాలనుకొనేవారు ఆన్‌లైన్‌ ద్వారా ముందుగా బుక్‌ చేసుకోవాలి. జంగిల్‌స్టార్‌ నేచురల్‌ క్యాంపులో రాత్రి బసచేసి, అటవీ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇద్దరు ఒక రోజు విడిది చెయ్యడానికి గదికి రూ. 5 వేలు చెల్లించాలి. పర్యాటకులు కోరితే ఫైర్‌ క్యాంప్‌ కూడా ఏర్పాటు చేస్తారు. వనసంరక్షణ సమితి సభ్యులు ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు.

ఇక్కడ ఏపీ టూరిజం సంస్థ రూ. తొమ్మిది కోట్లతో ఇరవై కాటేజీలు నిర్మిస్తోంది. మరో రెండు, మూడు నెలల్లో ఇవి సిద్ధం అవుతాయి.

కోనసీమ సోయగాలు

కోనసీమలో సువిశాల తీరం, వైనతేయ నదీపాయ, సాగర సంగమ ప్రాంతం ఓడలరేవు. చల్లదనం అందించే సర్వే తోటలతో ఆకట్టుకుంటుంది. ఇదే గ్రామం కేంద్రంగా సముద్రంలో చేపల వేట కోసం బోట్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. బీచ్‌ రిసార్ట్ట్స్‌ ఏర్పాటుతో పర్యాటకులను ఇది బాగా ఆకర్షిస్తోంది. కోనసీమలో తొలి బీచ్‌ రిసార్ట్స్‌ ఇవే కావడం విశేషం. అమలాపురం నుంచి ఓడలరేవు బీచ్‌ వరకు రహదారి నిర్మించారు.

ఎలా వెళ్ళాలంటే...

అమలాపురానికి సుమారు 18 కి.మీ. దూరంలో ఓడలరేవు ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

హౌస్‌ బోట్లలో విడిది

వశిష్ఠ పాయ ఒడ్డున కోనసీమలో కొలువుతీరిన దిండి దశాబ్దకాలంలో పర్యాటకంగా బాగా ప్రాచుర్యం పొందింది. దిండికి సమీపంలోనే అంతర్వేది నరసింహస్వామి ఆలయం ఉంది. ఆలయ సందర్శనతోపాటు సమీపంలోనే ఉన్న బీచ్‌ను చూడొచ్చు. ఈ తీరం సమీపంలో సముద్రంలో వశిష్ఠ గోదావరి కలిసే చోటును ‘అన్నాచెల్లెళ్ల గట్టు’గా పిలుస్తారు. అలాగే ఇక్కడి లైట్‌ హౌస్‌ మరో ఆకర్షణ. వసతి: హరిత కోకోనట్‌ కంట్రీ రిసార్ట్స్‌ పేరుతో ఏపీ టూరిజం ఇక్కడ వసతి అందిస్తోంది. వశిష్ఠ నది పాయలో హౌస్‌ బోట్లు ఉంటాయి. వాటికి ఏసీ సదుపాయం ఉంది. రాత్రి బస చెయ్యడానికి బుక్‌ చేసుకోవచ్చు. దూరప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకుల కోసం దిండి రిసార్ట్స్‌లో 32 ఏసీ గదులు ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. రెస్టారెంట్‌, జిమ్‌, స్విమ్మింగ్‌పూల్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, వాటర్‌ వాకింగ్‌బాల్‌, స్పోర్ట్స్‌సెకిల్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ విలాసవంతమైన పైవ్రేటు రిసార్ట్స్‌ కూడా ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే...

దిండికి రాజమహేంద్రవరం నుంచి 78 కి.మీ., కాకినాడ నుంచి 87 కి.మీ. దూరం ఉంది. జిల్లాలోని ప్రధాన ప్రాంతాలనుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

గత వైభవ ప్రాకారాలు...

రామచంద్రపురంలోని కోట గత వైభవానికి చిహ్నంగా నిలుస్తోంది. 1865లో అప్పటి రాజులు దీన్ని నిర్మించారు. కోటలోకి ముందున్న పెద్ద ప్రాకారాలు దాటుకుంటూ వెళ్లాలి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ సినిమా షూటింగ్‌లు ఈ కోటలో ఎక్కువగా జరుగుతాయి.

ఎలా వెళ్ళాలంటే...

రాజమహేంద్రవరం నుంచి 42 కి.మీ., కాకినాడ నుంచి 27 కి.మీ. దూరంలో రామచంద్రపురం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి బస్సు సదుపాయం ఉంది. సమీప రైల్వే స్టేషన్‌ సుమారు 20 కి.మీ. దూరంలోని అనపర్తిలో ఉంది.

image-Icon చిత్రమాలిక :