ఇదీ మన గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లాను తలుచుకోగానే నోరూరించే గోంగూర పచ్చడి, నషాళాన్ని తాకే కారం ఘాటు వెంటనే గుర్తుకొస్తాయి. రుచులే కాదు.. పర్యాటకుల అభిరుచులను కూడా పరిపూర్ణంగా సంతృప్తిపరుస్తుంది గుంటూరు జిల్లా పర్యాటకం. ఆధ్యాత్మికతతో కూడి ఆహ్లాదంగా విరాజిల్లుతోన్న ఈ జిల్లాలోని అమరావతి పట్టణం ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దేవేంద్రుడి చేత ప్రతిష్ఠించబడి వేల సంవత్సరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్న అమరేశ్వరస్వామి ఆలయం ఇక్కడే కొలువై ఉంది. ప్రపంచానికి శాంతి, కరుణ, దయ గుణాలను అందించిన బౌద్ధమత చారిత్రక ప్రాధాన్యతతో అమరావతి పట్టణం ఎంతో పేరుగాంచింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చారిత్రక వారసత్వ నగరంగా కూడా అమరావతి గుర్తింపు పొందింది. ఇవే కాదు, మనసును ఉల్లాసపరుస్తూ ఆంధ్రాగోవాగా పేరొందిన సూర్యలంక సముద్రతీరం... బాపట్ల వద్ద 1400 ఏళ్ళ కిందటి శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీసమేత క్షీరభావన్నారాయణస్వామి ఆలయం... ఆచార్య నాగార్జునుడు నిర్మించిన నాగార్జున విశ్వ విద్యాలయం.. ఒకవైపు అనుపు అందాలు .. మరోవైపు ఎత్తిపోతల సవ్వళ్లూను. కృష్ణమ్మను ఆనుకుని ఉన్న అనుపులో కాలుపెడితే వీచే చల్లటి గాలులకు మైమరవాల్సిందే... పక్షుల కిలకిలరావాల మధ్య ఎత్తిపోతలలో విడిదిని ఆజన్మాంతం మరువలేము. ఇక విజ్ఞానపు వెలుగులను నిరంతరం ప్రసరించే నాగార్జున కొండపై విహారం జ్ఞానాన్వేషకులకు క్షణమొక పండుగలాంటి అనుభూతిని మిగుల్చుతుంది. ఇక ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ జిల్లాలోని భట్టిప్రోలుకు అత్యంత ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేమిటంటే తెలుగులిపికి శ్రీకారం చుట్టింది ఇక్కడే మరి. ఇంకెందుకాలస్యం పదండి గుంటూరు జిల్లాలోకి...


అమరేశ్వర స్వామి ఆలయం

Amareswara-Temple

కృష్ణానది ఒడ్డున భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయం మూడు ప్రాకారాలతో పలు దేవతలు కొలువై ఉన్న ఉపాలయాలతో నిత్యం భక్తజన సందర్శనతో అలరారుతోంది. బౌద్ధుల ఆరాధ్య క్షేత్రంగా క్రీ.పూ 3వ శతాబ్దంలో బౌద్ధమత వ్యాప్తికి కంకణం కట్టుకున్న మౌర్య అశోకుడు బుద్ధుని ధాతువులతో మహాచైత్యాలు నిర్మించేందుకు మహాదేవభిక్షును శ్రీలంక పంపారు. మార్గమధ్యలో కృష్ణానది ఒడ్డున బుద్ధుని ధాతువులతో మహాచైత్యం నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వాసిష్ట పుత్రువులు మావి, శివస్కంద శాతకర్ణి, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణిల సహాయంతో బౌద్ధస్థూపం అభివృద్ధికి ఆదరణ లభించింది. తరువాత వచ్చిన చాళుక్య, పల్లవ, శాలంకాయన, విష్ణుకుండిన, కాకతీయ, కోట వంశముల పరిపాలన కాలంలో బౌద్ధమతం ఆదరించ బడింది. తరువాత వచ్చిన రాజుల నిర్లక్ష్యంతో మహాచైత్యం శిథిలమైంది. తరువాత కల్నల్‌ మెకంజీ తవ్వకాలలో మహాచైత్యంలోని అపురూప శిల్పసంపద వెలుగుచూసింది. వాటిలో ప్రధానమైన శిల్పాలను ఇతర దేశాలకు, చెన్నై మ్యూజియానికి తరలించారు. మిగిలిన శిలాఫలకాలను స్థానికంగా కేంద్ర పురావస్తు శాఖ ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసి భద్ర పరిచింది. దేశవిదేశాల నుంచి యాత్రికులు దీనిని సందర్శిస్తుంటారు. ప్రపంచ దేశాలలోని బౌద్ధులు చారిత్రక ప్రాధాన్యతను బట్టి అమరావతిని పవిత్రస్థలంగా భావించి సందర్శిస్తుంటారు.

ఇతర సందర్శనీయ స్థలాలు

Boudha Kshethram

విజయవాడ అమరావతి మార్గంలో వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి ఆలయం, అమరావతి క్రోసూరు మార్గంలో ధరణికోటలోని బలుసులమ్మ, వినాయక ఆలయాలు, మల్లాదిలోని వెంకటేశ్వరస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాలతో పాటు అమరావతిలో షిర్డీ సాయిబాబా ఆలయం, రామలింగేశ్వరస్వామి ఆలయం, మల్లేశ్వరస్వామి ఆలయం, కోదండరామాలయం, పాండురంగ స్వామి ఆలయం, వాసవీ అమ్మవారి ఆలయం ఉన్నాయి. వీటితో పాటు ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పుష్కరఘాట్‌లు సందర్శించవచ్చు.

ఎలా వెళ్ళాలంటే...

అమరావతికి చేరుకోవడానికి విజయవాడ, గుంటూరు, మంగళగిరి, సత్తెనపల్లి, క్రోసూరు పట్టణాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. రైలు మార్గం ద్వారా విజయవాడ, గుంటూరు చేరుకుని అమరావతికి ప్రత్యేక వాహనాలలో వెళ్ళవచ్చు. ఈ పట్టణాల నుంచి 35 - 40 కి.మీ దూరంలో అమరావతి ఉంది.

వసతులు:

పర్యాటకశాఖ వసతిగృహాలు, రెవెన్యూ, పంచాయితీరాజ్‌, ప్రయివేటు వసతి గృహాలు ఉన్నాయి.

ఆహ్లాదకరం ఆంధ్రాగోవా సూర్యలంక సముద్రతీరం...

Suryalanka Beach

స్వచ్ఛమైన సముద్రపు కెరటాలు. ఇసుకతిమ్మెరలు. తెరచాపపడవలు.. సూర్యోదయ దర్శనం.. కన్నులపండువగా సూర్యలంక తీరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఆంధ్రాగోవాగా ఖ్యాతిగాంచింది. సూర్యలంక తీరప్రాంతం అర్ధచంద్రాకారంలో ఉండటంతో ఇక్కడ ప్రమాదాలు జరగటం తక్కువ. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో సహజసిద్ధంగా ఏర్పడిన సూర్యలంక సముద్రతీరం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఎలా వెళ్ళాలంటే...

సూర్యలంకకి రైలు, బస్సు సౌకర్యం ఉంది. ఇటు హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, తెనాలి, అటు ఒంగోలు, చీరాల పరిసరప్రాంతాల నుంచి పర్యాటకులు రైలు ద్వారా బాపట్ల రైల్వేస్టేషన్‌లో దిగి ఆటోలు, బస్సుల ద్వారా చేరుకోవచ్చు. బాపట్ల పట్టణం నుంచి తీరం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేసవిలో, కార్తీకమాసంలో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.

కాటేజీలు:

సూర్యలంక తీరంలో గడిపేందుకు వచ్చే పర్యాటకులకు కాటేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో హరితా బీచ్‌రిసార్ట్స్‌ ఉంది. ఏపీ టూరిజం వెబ్‌సైట్‌లో ముందుగా బుక్‌ చేసుకుంటేనే కాటేజీలు దొరుకుతాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక్కొక్క కాటేజీకి జీఎస్‌టీతో కలిపి 2,300 రూపాయలు చెల్లించాలి. శని,ఆదివారాలలో లైతే 3,420 రూపాయలు చెల్లించాలి. ఏసీలేని కాటేజీలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు 1500, శని, ఆదివారాలలో 2,100 చొప్పున చెల్లించాలి. టూరిజం బార్‌అండ్‌ రెస్టారెంట్‌ సౌకర్యం కూడా ఉంది.

చూడదగిన చుట్టుపక్కల ప్రదేశాలు:

బాపట్ల ప్రాంతంలో 1400 సంవత్సరాలకు పూర్వ నిర్మించిన చారిత్రాత్మక కట్టడం శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీసమేత క్షీరభావన్నారాయణస్వామి దేవాలయం. చందోలులోని లింగోద్భవ క్షేత్రం, బండ్లమ్మ దేవాలయం, అల్లూరు నరసింహస్వామి దేవాలయం, తీరంలోని భజన హనుమంతుని దేవాలయం, పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన కళాశాలలు యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి.

అటు అనుపు అందాలు.. ఇటు ఎత్తిపోతల సవ్వళ్లు..
ఎంత చూసినా తనివి తీరదు.. మనసును కట్టిపడవేసి మరో లోకానికి తీసుకెళ్లే సొగసులతో అనుపు అందాలు యాత్రికులను కట్టిపడేస్తాయి. నాగార్జున సాగర్‌కు 6 కి.మీ దూరంలో ఉన్న అనుపు అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. క్రీ.శ 4వ శతాబ్దం కంటే ముందు నాటి వైభవాన్ని గుర్తుచేసే పునర్నిర్మిత కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. యాంపి థియేటర్‌, మహాస్థూపం, హరతి దేవాలయం, అశ్వమేథ యజ్ఞశాల, శ్రీచైత్యములు కనువిందు చేస్తాయి. ఆచార్య నాగార్జునుడు నిర్మించిన నాగార్జున విశ్వ విద్యాలయం, ఉపన్యాసశాల నమూనాలను కూడా ఇక్కడ చూడవచ్చు. వీటి వీక్షణలో సమయమే తెలియదంటే అతిశయోక్తి కాదు. బుద్ధ పూర్ణిమను ఇక్కడ మూడు రోజులపాటు ఓ పండుగలా జరుపుతారు. టిబెట్‌, నేపాల్‌ తదితర దేశాల నుంచి బౌద్ధ బిక్షవులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

ఎత్తిపోతలలో మనసే మురిసి..

Ethipothala

నాగార్జున సాగర్‌కు 10 కి.మీ దూరంలో ఉన్న ఎత్తిపోతల ఒక అందమైన ప్రదేశం. కొండకోనల నుంచి వడివడిగా పయనించి 70 అడుగుల ఎత్తునుంచి దూకే జలధారను చూడాలంటే రెండు కళ్లూ చాలవు. అలా దూకిన జలపాతం వంపుసొంపులు తిరుగుతూ కృష్ణమ్మ ఒడికి చేరుకుంటుంది. ఓవైపు జలపాత సవ్వడి, మరోవైపు పక్షుల కిలకిలరావాల మధ్య ఇక్కడి విడిదిని ఆజన్మాంతం మరువలేము. జలపాతంపై విద్యుద్దీపాలను కూడా అమర్చడంతో రాత్రి వేళ దీని వీక్షణ మరుపురాని అనుభూతిగా మిగిలిపోవాల్సిందే.

ఎలా వెళ్ళాలంటే...

అనుపు, ఎత్తిపోతల ప్రాంతాలను సందర్శించాలంటే గుంటూరు నుంచి 130 కి.మీ. దూరంలో ఉన్న మాచర్లకు రహదారి, రైలు మార్గం ద్వారా రావాలి. ఇక్కడి నుంచి నాగార్జున సాగర్‌లోని విజయపురిసౌత్‌ కాలనీలో విడిది చేయాలి. నేరుగా ఎత్తిపోతల, అనుపు వెళ్లేందుకు బస్సు సౌకర్యమైతే లేదు. ప్రత్యేక వాహనాలు, లేకుంటే ఆటోల్లో వెళ్లాల్సి ఉంటుంది.

విడిది:

టూరిజం శాఖ ఒక గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేసింది. ఏపీ టూరిజం వెబ్‌సైట్లోకి వెళ్లి గదులను బుక్‌ చేసుకోవచ్చు. జలపాత దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్దలకు రూ.20, పిన్నలకు రూ.15 చెల్లించాలి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో శని, ఆదివారాల్లో సుగాలీల నృత్య ప్రదర్శన జరుగుతుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే రెస్టారెంట్లో అల్పాహారం, భోజనం దొరుకుతుంది.

దేశంలోనే ఏకైక ఐల్యాండ్‌ మ్యూజియం...

Nagarjuna-Island

అది ఒక విజ్ఞాన గని.. నాగార్జునుడు సంచరించిన పవిత్ర ప్రదేశం.. నాగార్జున సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ రిజర్వాయర్లో డ్యాం నుంచి 14 కి.మీ దూరంలో ఉంది ఇది భారతదేశంలోనే ఏకైక ఐల్యాండ్‌ మ్యూజియంగా కీర్తి గడించింది. దేశంలో రెండవ అతిపెద్ద ఐల్యాండ్‌ మ్యూజియం కూడా ఇదే కావడం విశేషం. కృష్ణా నీటిని పెద్ద ఎత్తున నిల్వ ఉంచేందుకు రమారమి 600 అడుగుల లోతు తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాల్లో తొలి శిలాయుగం నుంచి బృహత్శిలాయుగం వరకు వృద్ధిచెందిన మానవ నాగరికత పరిణామ దశలు, అప్పటి పనిముట్లు దొరికాయి. క్రీ.శ 3-4 శతాబ్దాలకు చెందిన శిల్ప ఫలకాలు, శాసనాలు బయటపడ్డాయి. ఇక్ష్వాకుల కాలం నాటి శాసనాలు, మధ్యయుగం నాటి శిల్పాలు, ఆ కాలపు మట్టి పాత్రలు, రాతి గొడ్డళ్లు, రాతి బరిశెలు, నాణేలు వంటి పూర్వీకుల జీవనశైలికి అద్దం పట్టే అపూర్వ సంపద దొరికింది. వీటన్నింటినీ ఈ నాగార్జున కొండపై ఏర్పాటు చేసిన మ్యూజియంలో భద్రపరిచారు. 1956లో అప్పటి కేంద్ర శాస్త్రీయ పరిశోధన‌, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి హుమాయున్‌ కబీర్‌ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు.

బౌద్ధమత చిహ్నాలు కూడా..

బౌద్ధమతం ఇక్కడ వెల్లివిరిసినట్లు అనేక ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. నాగార్జున కొండపై బౌద్ధ మతానికి చెందిన శాసనమండపం, స్నానఘట్టం, బౌద్ధారామం, మహాస్థూపం, సింహళ విహార్‌, అశ్వమేథ యాగస్థలం, స్వస్తికాంకిత స్థూపం పునఃప్రతిష్టించారు. 144 ఎకరాల వైశాల్యం కలిగిన ఈ నాగార్జున కొండపై అణువణువూ జ్ఞాన సంపదతో కూడిందే.

ప్రయాణమూ ఆహ్లాదమే

నాగార్జున సాగర్‌ చేరుకున్నాక నాగార్జున కొండకు వెళ్లాలంటే లాంచీల ద్వారానే ప్రయాణం సాధ్యం. లాంచీ స్టేషన్‌ నుంచి 14 కి.మీ. మేర సుమారు ముప్పావు గంటపాటు సాగే ఈ ప్రయాణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. వెండి జలపాతంలో ఎగిరెగిరిపడే చేపలు, సుదూరంగా కనిపించే పచ్చని కొండలు, ప్రతిక్షణం పలుకరించే చల్లని గాలులు.. ఇలా ఎంతో మధురంగా ప్రయాణం సాగుతుంది. లాంచీలో ప్రయాణించేందుకు పెద్దలకు రూ. 120, పిల్లలకు రూ. 100. టికెట్లను లాంచీ స్టేషన్లో విక్రయిస్తారు.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ, గుంటూరుల నుంచి మాచర్లకు చేరుకున్నాక నాగార్జున సాగర్‌ వెళ్లాలి. మాచర్ల నుంచి సాగర్‌కు 25 కి.మీ హైదరాబాద్‌ నుంచి అయితే హైదరాబాద్‌-మాచర్ల బస్సు ఎక్కి నాగార్జున సాగర్‌లో దిగాలి. హైదరాబాద్‌ సీబీఎస్‌ నుంచి సాగర్‌కు 150కి.మీ. దూరం ఉంటుంది. రైలు ద్వారా రావాలంటే నడికుడి జంక్షన్‌కు వచ్చి అక్కడి నుంచి మాచర్ల మీదగా సాగర్‌ వెళ్లాలి.

వసతులు:

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే మోటెల్‌ హోటల్‌, ఒక క్రైస్తవ సంస్థతో నిర్మితమైన హోటల్‌ మాతా సరోవర్‌లలో విడిది చేయొచ్చు. ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ ఉన్నా అది అధికారుల కోసమే. తెలంగాణ రాష్ట్రం వైపు నాగార్జున రిసార్ట్స్‌, విజయవిహార్‌లు ప్రముఖ హోటళ్లుగా చెప్పుకోవచ్చు.

భట్టిప్రోలులోనే తెలుగులిపికి శ్రీకారం...

Gauthama Budha Dhathavulu

తెలుగు లిపి భట్టిప్రోలులోనే ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి. మౌర్యలిపిలోని 23 అక్షరాలను ఈ స్థూపం వద్దనే కనుగొన్నట్లు ఆధారాలున్నాయి.

గౌతమ బుద్ధుని ధాతువులపై నిర్మితమై దక్షిణ భారతదేశంలోనే తొలి బౌద్ధ పుణ్యక్షేత్రంగా భట్టిప్రోలు విరాజిల్లింది. బుద్ధుడు నడయాడిన ప్రాంతంగా ఘన చరిత్రను సంతరించుకుంది. ఈ గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అత్యంత విశిష్టత కలిగిన బౌద్ధస్థూపం ఆవరణలో నెలకొల్పిన సింహగోష్టి విద్యాలయంలో ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలకు చెందిన శిష్యులు ఈ ప్రాంతానికి విచ్చేసి బుద్ధుని బోధనలు అభ్యసించినట్లు చరిత్ర తెలియచేస్తుంది. అమరావతి స్థూపం కంటే ముందుగానే భట్టిప్రోలు బౌద్ధస్థూపం నిర్మించినట్లు చరిత్ర తెలియచేస్తోంది.

స్థూపంలో లభ్యమైన శాసనాల ప్రకారం భట్టిప్రోలు గ్రామం ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా పేరొందినట్లు చరిత్ర పుటల్లో లిఖించబడింది. ఆనాటి ప్రతిపాలపురమే నేడు భట్టిప్రోలుగా రూపాంతరం చెందినట్లుగా చరిత్రలో పొందుపర్చారు. వాణిజ్య నగరంగా భట్టిప్రోలు విరాజిలినట్లు చారిత్రక ఆధారాలు లభించినట్లు చరిత్ర పుటల్లో లిఖించారు. భట్టిప్రోలులో 40 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మ్యూజియం, గ్రంథాలయ వసతి సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది.

శాసనాలలోని బుధ, సరిరానం, నిఖేతు, బుధశ, శరీరాని, మహియాసు, కమ్మ అనే వ్యాఖ్యల ఆధారంగా భట్టిప్రోలు స్థూపం యదార్థమైన బుద్ధుని ధాతువుపై నిర్మించినట్లు స్పష్టమవుతుంది. భట్టిప్రోలు స్థూపం వద్ద లభించిన శిలామంజూషికలు మరెక్కడా లభించిన దాఖలాలు లేవని చరిత్రకారులు అంటున్నారు. ఈ మంజూషికలలో పవిత్రమైన బుద్ధ ధాతువులు నిక్షిప్తమైనట్లు మంజూషికలపై చెక్కబడిన శాసనాలలోని అక్షరాలకు తెలుపు రంగు పూయబడి స్పష్టంగా చదవగలిగేటట్టు ఉన్నాయి. ఈ లేఖనాలు పరిశీలిస్తే తెలుగు లిపి భట్టిప్రోలులోనే ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ప్రతిపాలపురం మరియు పిధుండనగరంగా భావించబడిన భట్టిప్రోలులోని మమాస్థూపం భారతదేశలో గల అతి ప్రాచీన స్థూపాలలో ఒకటిగా గుర్తింపబడింది. కీ.శ. 1892లో అలెగ్జాండర్‌ రే ఇక్కడ పురాతత్వ తవ్వకాలు కొనసాగించి మహాస్థూపపు అవశేషాలు ఒకదానిపై ఒకటిగా మూడు చోట్ల నిక్షపం చేయబడిన మూడు ధాతు పేటికలను వెలుగులోకి తీసుకువచ్చారు. భట్టిప్రోలులో 40 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మ్యూజియం, లైబ్రరీలు వసతి సౌకర్యాలు కల్పించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది.

image-Icon చిత్రమాలిక :