పర్యాటక స్వర్గధామం ... ’ కృష్ణా ’

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ: స్కల్ప్చర్‌ గార్డెన్‌: ప్రకాశం బ్యారేజీ భవానీ ద్వీపం గుణదల మేరీమాత చర్చి ఐదవ శతాబ్దపు గుహలు గాంధీ హిల్‌ విక్టోరియా జూబిలీ మ్యూజియం కూచిపూడి కొండపల్లి’ బొమ్మలు కలంకారీ నగిషీలు బౌద్ధ క్షేత్రాలు కొల్లేరు సరస్సు కొండపల్లి కోట మచిలీపట్నం కోట కళకారుల సౌరభం గోదావరి పవిత్ర సంగమం నాగాయలంక మంగినపూడి బీచ్‌ పవిత్ర సాగర సంగమం బ్రహ్మయ్యలింగం చెరువు మచిలీపట్నం పాండురంగడు శ్రీ పృధ్వీశ్వరుడు శ్రీకాకుళాంద్ర దేవాలయం పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వరుని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరాలయం హంసలదీవి వేణుగోపాలుని సంగమేశ్వరం కొల్లేటి పెద్దింట్లమ్మ బలివే సుబ్రహ్మణ్యేశ్వరుడు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ :

ప్రకాశం బ్యారేజికి అతి సమీపంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గుడి ప్రత్యేక సందర్శనీయ స్థలం. రాష్ట్రంలో తిరుపతి తర్వాత రెండో అతి పెద్ద దేవాలయం ఇది ! కృష్ణానదిలో పవిత్ర స్నానం ఆచరించి దుర్గమ్మను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ప్రతి ఏటా పది రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇంద్రకీలాద్రి కొండ దిగువన అర్జున వీధి మొదట్లో హజరత్‌బల్‌ మశీదు ఉంది. మహ్మద్‌ ప్రవక్తకు చెందిన పవిత్ర అవశిష్టం ఈ మసీదులో ఉంది. ప్రతి సంవత్సరం ఒకసారి పెద్ద సంఖ్యలో ముస్లింలు వచ్చి సందర్శిస్తుంటారు.

స్కల్ప్చర్‌ గార్డెన్‌ :

పద్మావతి ఘాట్‌కు అభిముఖంగా పీఎన్‌బీఎస్‌ వెనుక రాజీవ్‌గాంధీ పార్కు చక్కటి సందర్శనీయ ప్రదేశం. హార్టీకల్చర్‌ అట్రాక్షన్స్‌, వాటర్‌ ఫౌంటెయిన్స్‌ ఆకట్టుకుంటాయి. బస్‌స్టేషన్‌ నుంచి కొద్దిగా బయటకు నడిచి వస్తే పోలీసు కంట్రోల్‌ రూమ్‌ దగ్గర పాత ఇనుప వ్యర్థాలతో తయారు చేసిన బొమ్మలతో కూడిన ’స్కల్ప్చర్‌ గార్డెన్‌’ ఉంది.

ప్రకాశం బ్యారేజీ :

కృష్ణానది తీరాన.. కొండ సానువుల మధ్య విజయవాడ నగరం ఏర్పడింది. విజయవాడలో 4014 అడుగుల పొడవున ఉండే ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. మహాబలేశ్వరం నుంచి వచ్చే కృష్ణమ్మను చిట్టచివరిగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజి నిలువరిస్తుంది. విజయవాడను ఆనుకుని సువిశాలమైన వాటర్‌ రిజర్వాయర్‌ ఏర్పడటానికి ప్రకాశం బ్యారేజీ దోహదపడుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం లేజర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి పర్యాటక సొబగులు అద్దింది. ప్రకాశం బ్యారేజీని చూడాలంటే విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) నుంచి కేవలం కొద్ది దూరం నడిచి చేరుకోవచ్చు. యాత్రీకులకు పీఎన్‌బీఎస్‌ కూడా ఒక ఎంటర్‌‌టైన్‌మెంట్‌ స్టేషన్‌. ఇది ఎంతో ఆకర్షణీయంగా, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బ్యారేజీ దగ్గర కృష్ణానది వెంబడి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులలో భాగంగా అత్యుత్తమ పొడవైన ఘాట్లను నిర్మించారు. గత కృష్ణా పుష్కరాలకు కోట్లాదిమంది భక్తులు ఈ ఘాట్లలోనే స్నానాలు చేశారు. కృష్ణానదీ తీరానికి పున్నమి, దుర్గా, కృష్ణవేణి, పద్మావతి, విజయకృష్ణ ఘాట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి విజయవాడ నగరం మీదుగా మూడు కాలువలు వెళుతున్నాయి. పర్యాటకులకు ఇవి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. నగర పరిధిలో కృష్ణా కెనాల్‌, బందరు, రైవస్‌, ఏలూరు కాల్వగట్లను పచ్చదనంతో తీర్చిదిద్దారు.

భవానీ ద్వీపం :

కృష్ణానదిలో సహజిసిద్ధంగా ఏర్పడిన దీవులలో పర్యాటకంగా అభివృద్ధి చెందిన దీవి భవానీ ద్వీపం‌. అటు అమరావతి, ఇటు విజయవాడను అనుకుని కృష్ణానది మధ్యలో పర్యాటకుల కోసం స్వాగతం పలుకుతున్న దీవి ఇది ! మొత్తం 270 ఎకరాలలో భవానీ ఐల్యాండ్‌ విస్తరించి ఉంది. ఇందులో ప్రస్తుతం 130 ఎకరాల వరకు పర్యాటకంగా అభివృద్ధి చెందింది. భవానీ ఐల్యాండ్‌లో మిగిలిన 140 ఎకరాలలో ఏపీటూరిజం, ఏపీటీడీసీ శాఖలు సంయుక్తంగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భవానీ ఐల్యాండ్‌ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం అని చెప్పాలి. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న భవానీపురానికి పర్యాటకులు చేరుకోవాల్సి ఉంటుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి చెందిన హరిత బెర్మ్‌ ఇక్కడ ఉంటుంది. హరిత బెర్మ్‌పార్క్‌ కూడా పచ్చటి చెట్ల నడుమ ఓ రిసార్ట్‌లా ఉంటుంది. కాలుష్య పూరిత నగరానికి దూరంగా .. అటవీ ప్రాంతంలా కనిపించే వాతావరణంతో పచ్చటి చెట్ల నడుమ భవానీ ఐల్యాండ్‌లో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చుకోవచ్చు. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ కోసం కూడా చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఏసీ కాటేజీలు, కాన్ఫరెన్స్‌ హాల్‌ , రెస్టారెంట్స్‌ వంటివి ఇక్కడ ఉన్నాయి. కృష్ణానది ఒడ్డున ఈ హరిత బెర్మ్‌పార్క్‌ ఉంటుంది. హరిత బెర్మ్‌పార్క్‌ దగ్గర బోటింగ్‌ యూనిట్‌ ఉంటుంది. ఇక్కడ ఏపీటీడీసీకి చెందిన బోట్లలో భవానీ ఐల్యాండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. పది నిమషాల బోటు ప్రయాణం ద్వారా భవానీ ద్వీపం చేరుకోవచ్చు. మార్గ మధ్యలో ప్రకాశం బ్యారేజీ , ఇంద్రకీలాద్రి అందాలను ఆస్వాదించవచ్చు. దగ్గరకు సమీపించగానే ముందుగా భవానీ ఐల్యాండ్‌లోని ఎత్తైన ఫన్‌ టవర్‌ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. జెట్టీ పాయింట్‌ దిగ గానే పర్యాటకులు ప్రకృతి ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆకాశం కనిపించనంతగా పచ్చటి చెట్లతో భవానీ ఐల్యాండ్‌ కప్పుకుని ఉంటంది. తివాచీ పరిచినట్టుగా పచ్చటి ల్యాన్‌లు ఆకట్టుకుంటాయి. ద్వీపంలో మొత్తం 30 వరకు ఏసీ కాటేజీలు ఉన్నాయి. ఇరన్‌తో ఈ కాటేజీలను ఏర్పాటు చేశారు. నాలుగు ట్రీ టాప్‌ కాటేజీలు ఉన్నాయి. ద్వీపంలో రోప్‌ గేమ్స్‌ ఉంటాయి. ఉయ్యాలలు, స్పైడర్‌నెట్స్‌ , బ్యాలెన్సింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, ఆర్చరీ, గన్‌షూట్‌, నెట్‌ క్రికెట్‌, రైడర్స్‌ వంటి అనేక వినోదాలు ఉన్నాయి. ద్వీపంలో పిల్లల నుంచి పెద్దలను ఆకట్టుకునేందుకు అనేక సెల్ఫీ పాయింట్లు ఉన్నాయి. ఒక రెస్టారెంట్‌, ఒక స్నాక్స్‌ కెఫే ఉంది. భవానీ ద్వీపంలో డైనోసార్‌, గోల్ఫ్‌సిమ్ములేటర్‌, మేజ్‌ గార్డెన్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మరో నెలలో ఇవి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌పై సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఇవన్నీ ఒకటి అయితే అత్యద్భుతమైన ఆనందం మరొకటి ఉంది. దేశంలోనే ఎక్కడా లేని మ్యూజికల్‌ డ్యాన్సింగ్‌ ఫౌంటెయిన్‌ - లేజర్‌ షో ఇక్కడి ప్రత్యేకత. ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటలకు ద్వీపానికి వచ్చిన వారికి 20 నిమషాల పాటు ఆనందం వర్ణనాతీతం. గోవా తరహా వాటర్‌ స్పోర్ట్స్‌ ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఏపీటీడీసీ అధీనంలో స్పీడ్‌బోట్లు, మెకనైజ్డ్‌ బోట్లు ఉన్నాయి. ఫంటూన్‌ , బస్‌ బోటు (ఏసీ) తో పాటు బోధిసిరి (ఏసీ) డబుల్‌ డెక్కర్‌ భారీ క్రూయిజ్‌ ఉంది. బోట్‌ పార్టీలకు అద్దెకు ఇస్తారు. కృష్ణానదిలో పలు ప్రైవేటు బోటింగ్‌ యూనిట్స్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ కార్యకలాపాలను అందిస్తున్నాయి. కయాక్‌, వాటర్‌ రోలర్స్‌ , జెట్‌ స్కీయింగ్‌ తదితర అనేక గోవా తరహా వాటర్‌ స్పోర్ట్స్‌ సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. భవానీ ద్వీపం చుట్టూ మరో ఆరు దీవులు ఉన్నాయి. వీటిని కూడా కల్చరల్‌, హెరిటేజ్‌, హెల్త్‌, ఫారెస్ట్‌ తదితర పర్యాటకాలను అభివృద్ధి చేయటానికి ఇటీవలే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించటం జరిగింది. ఈ దీవులన్నీ కలిస్తే 20000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీవులు ఉంటాయి. ఇవన్నీ అభివృద్ధి చెందితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద పర్యాటక విస్తీర్ణ ప్రాంతంగా భాసిల్లుతుంది.

గుణదల మేరీమాత చర్చి:

గుణదలలో సెయింట్‌ మేరీస్‌ చర్చి ఉంది. నగర తూర్పు భాగంలో కొండపై ఈ చర్చి ఏర్పడింది. దేశంలోనే ఈ చర్చికి విలక్షణమైన స్థానం ఉంది. ప్రతి ఏటా గుణదల తిరునాళ్ళ మహోత్సవాలు ఇక్కడ జరుగుతాయి.

ఐదవ శతాబ్దపు గుహలు:

మొగల్రాజపురంలో ఐదవ శతాబ్ద కాలంలో ఏర్పడిన గుహలు ఉన్నాయి. నటరాజ, వినాయక, అర్థనారీశ్వర శిల్పాలు ఇక్కడ ఉన్నాయి.

గాంధీ హిల్‌ :

విజయవాడ రైల్వేస్టేషన్‌ వెనుక గాంధీ హిల్ ఉంది. గాంధీపర్వతంపై దేశంలోనే మొట్టమొదటి 500 అడుగుల ఎత్తైన గాంధీ స్థూపం ఉంది. దీనికి అనుబంధంగా మొత్తం ఆరు స్థూపాలు ఉంటాయి. 1968 అక్టోబర్‌ 6న అప్పటి భారత దేశ అధ్యక్షులు డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ఇక్కడ స్థూపంతో పాటు గాంధీ మెమోరియల్‌ లైబ్రరీ, సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను ప్రారంభించారు. విజ్ఞాన, వినోద, జాతీయోద్యమ ఘట్టాలకు సంబంధించిన పుస్తకాలెన్నో ఇక్కడ ఉన్నాయి. గాంధీ ఉపయోగించిన చరకా ఒకటి ఇక్కడ గతంలో ఉండేది. ఇప్పుడు లేదు. గాంధీ హిల్‌ చుట్టూ తిరిగి రావటానికి వీలుగా చిన్న పిల్లల ట్రెయిన్‌ ఉంది. కొండ దిగువన ప్లానిటోరియం ఉంది. ఘాట్‌ మార్గంలో గాంధీ హిల్‌ మీదకు చేరుకోవచ్చు. ఈ కొండ మీద నుంచి చూస్తే విజయవాడ నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు.

విక్టోరియా జూబిలీ మ్యూజియం :

రెండు, మూడవ శతాబ్దాల చారిత్రక వారసత్వ జ్ఞాపకాలకు చిహ్నంగా విజయవాడలోని విక్టోరియా జూబిలీ మ్యూజియం నిలుస్తుంది. ఇండో - యూరోపియన్‌ నిర్మాణ శైలిలో విక్టోరియా జూబిలీ మ్యూజియం ఉంటుంది. బుద్దిజం, హిందూ మత వ్యాప్తి కాలం నాటి శిల్పాలు, నిర్మాణ శిధిలాలు, పాత్రలు, ఆయుధాలు , నాణాలు వంటివి అనేకం ఇక్కడ ఉన్నాయి. 1887లో క్వీన్‌ విక్టోరియా గోల్డెన్‌ జూబిలీ సెలబ్రేషన్స్‌ సందర్బంగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఆనాటి కృష్ణా జిల్లా కలెక్టర్‌ రాబర్ట్‌ సీవెల్‌ ఈ మ్యూజియానికి శంకుస్థాపనరాయి వేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ఇక్కడో 1921 లో మహాత్మాగాంధీకి త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఈ మ్యూజియంలో చారిత్రక గ్యాలరీలు ఉన్నాయి. కత్తులు, కవచాలు, నగలు, మట్టిపాత్రలు, ఫిరంగులు వంటి 2,3,4, శతాబ్దాల నాటికి సంబంధించిన అనేకమైనవి ఇక్కడ ఉన్నాయి. పురాతన కాలం నాటి వస్తువులు, నాణాలు, ఆయుధాలు, శిల్పాలు వంటివి సేకరించి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇదే మ్యూజియం ప్రాంగణంలో కొత్తగా బాపు మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. బాపు మ్యూజియం కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం పక్కనే ఉన్న ఈ విక్టోరియా జూబిలీ మ్యూజియంకు పురావస్తు ప్రేమికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

తెలుగు సాంస్కృతిక ఔన్నత్యానికి ప్రతీక.. ’ కూచిపూడి’ :

విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో కూచిపూడి గ్రామం ఉంది. కూచిపూడి గ్రామం కల్చరల్‌ విలేజ్‌గా ప్రసిద్ధిపొందింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ గ్రామాన్ని పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి నృత్యానికి ఆద్యుడైన సిద్ధేంద్రయోగి పుట్టిన స్థలం ఇది. ఇక్కడ ఏర్పాటైన సిద్దేంధ్ర కళాక్షేత్రం ప్రతి ఏటా వందల సంఖ్యలో విద్యార్థులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పిస్తోంది. కూచిపూడి వికసించటానికి ఇక్కడే బీజం పడుతోంది. వేదాంతం వంశీకులు కూచిపూడిని మరింత విస్తృతం చేశారు. కూచిపూడి గ్రామాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

ప్రపంచం మెచ్చిన ’కొండపల్లి’ బొమ్మలు

కొండపల్లి... గ్రామీణ హస్తకళల గ్రామమైన కొండపల్లిలో తయారయ్యే బొమ్మలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయి. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా వందల సంఖ్యలో పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. పుణికి కర్రతో తేలికపాటి బరువుతో తయారు చేసే కొండపల్లి బొమ్మలు చూస్తే ముగ్ధులు కావాల్సిందే. గ్రామీణ జీవన విధానాలను కొండపల్లి బొమ్మలు సృజియిస్తాయి. కొండపల్లి అడవులలో తెల్ల, నల్లటి పుణికి కలప లభిస్తుంది. వీటిని కావాల్సిన సైజులలో కట్‌ చేసి బాపుదారు వంటి ప్రత్యేక పనిముట్లతో పలు ఆకృతులలో ఇక్కడి కళాకారులు బొమ్మలను చెక్కుతారు. పుణికి కర్ర చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ముందుగా వీటిని చెక్కి బొమ్మలను తయారు చేసిన తర్వాత వార్నీష్ పూసి రంగులద్ది ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. సంప్రదాయ సిద్ధమైన తాడిచెట్లు, ఏనుగు అంబారీలు, దశావతారాలు, పల్లెవాతావరణం వాటి అందాలను చూపించే దృశ్యాలు, వివిధ వృత్తులను చాటిచెప్పే బొమ్మలను తయారుచేస్తారు. గాజు పెట్టెలో ఉండే కొండపల్లి ఎడ్లబండి బొమ్మకు ఎంతో క్రేజ్‌ ఉంది. కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేయటానికి వీలుగా గ్రామంలో బొమ్మల కాంప్లెక్స్‌ ఉంటుంది.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లికి వెళ్ళడానికి బస్సులు, ప్రయివేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

కలంకారీ నగిషీలు :

Thotapalli Venkateswara Swamy Temple

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం దగ్గర పెడనలో కలంకారీ కళ ఎందరినో ఆకట్టుకుంటోంది. వస్ర్తాలపై కలంకారీ అద్దకం ఇక్కడి ప్రత్యేకత. మచిలీపట్నంలో గోల్డ్‌ కవరింగ్‌ పనులు జరుగుతుంటాయి. రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాల తయారీకి ఈ ప్రాంతం పెట్టింద పేరు. గ్రామీణ పర్యాటకం కింద క్రాఫ్ట్స్‌ విలేజ్‌గా కొండపల్లి, పెడనలు భాసిల్లుతున్నాయి.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వారా వెళ్ళవచ్చు.

బౌద్ధ క్షేత్రాలు :

దేశంలోని అతి ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలలో ఒకటి అమరావతి పట్టణం. అతి పెద్ద బౌద్ధస్థూపం ఇక్కడ ఏర్పాటైంది. రెండు వేల సంవత్సరాల నుంచీ అమరావతి బౌద్ధ యాత్రికుల సందర్శన ప్రాంతంగా భాసిల్లుతోంది. అమరావతి మ్యూజియం ఇక్కడ సందర్శించాల్సిన అతి ముఖ్యమైన వాటిలో ఒకటి. విజయవాడ చుట్టు పక్కల కృష్ణాజిల్లాలో భట్టిప్రోలు, గోలి, గుంటుపల్లి, ఘంటసాల, చిన గంజాం తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో బౌద్ధ స్థూపాలు, శిల్ప సంపద కనిపిస్తుంది. బౌద్ధ స్థూపాలు, విహారాలను ఇక్ష్వాకు, శాలివాహన, శాతవాహనుల కాలంలో నిర్మించారు.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నగరం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది. ఇక్కడ ఏపీటీడీసీ వారి కాటేజీలు ఉంటాయి. అమరావతితో పాటు పైన తెలిపిన బౌద్ధక్షేత్రాలకు విజయవాడ నుంచి పలు బస్సులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

కొల్లేరు సరస్సు :

తాజా నీటితో కళకళలాడే కొల్లేరును చూడటానికి రెండు కళ్ళు చాలవు. కొల్లేరు సరస్సు 300 చదరపు మైళ్ళ విస్తీర్ణం మేర విస్తరించి ఉంది. కొల్లేటి సరస్సు ఒక అద్భుతమైన ప్రాంతం. కొల్లేరు నీరు తాజాగా ఉంటుంది. కొల్లేరులో రాగండి, చందువా చేపలకు ప్రసిద్ధి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రాంతం ఉంటుంది. కొల్లేటి సహజ అందాలతో పాటు విదేశీ పక్షుల కిలకిలారావాలతో ఈ సరస్సు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కొల్లేరుకు సైబీరియా, ఫిజీ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి అక్టోబర్‌ , నవంబర్‌ నెలల్లో వస్తుంటాయి. దాదాపుగా 20 లక్షల పక్షులు ఈ కాలంలో కొల్లేరుకు వస్తుంటాయి. ఆటపాక పక్షుల కేంద్రం ఇక్కడ ఉంది. ఆసియన్‌ ఓపెన్‌ బిల్డ్‌ స్టార్క్స్‌, పెయింటెడ్‌ స్టార్క్స్‌ , గ్లోస్సీ, రెడ్‌ షాంక్స్‌, విగియెన్స్, గాడ్‌వాల్స్‌ , కమోరెంట్స్‌ , గార్గనేస్‌, హెరాన్స్‌, ఫ్లెమింగోస్‌ వంటి అనేక రకాల పెలికాన్స్‌ ఇక్కడ సందడి చేస్తుంటాయి. ఇదే సమయంలో ఇక్కడ ప్రతి ఏటా పెలికాన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తుంటారు. ఆటపాక, భుజబలపట్నం, పల్లెవాడ, కొవ్వాడ లంక, గుడివాకలంక, ప్రత్తికోల లంక, కొల్లేటి కోటలన్నీ కూడా పక్షుల సందర్శన కేంద్రాలుగా ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి 95 కిలోమీటర్లు, మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కైకలూరు దగ్గర కొల్లేరు సరస్సు ఉంది. బస్సులు, ప్రయివేటు వాహనాల ద్వారా వెళ్ళవచ్చు. కైకలూరు, ఏలూరు, ఆకివీడులలో వసతి సౌకర్యం ఉంటుంది.

కొండపల్లి కోట :

చారిత్రాత్మక గోల్కొండ కోటకు ఏ మాత్రం తీసిపోని కోట ఇది ! కొండపల్లి ఖిల్లా ఒక భారీ పర్వతంపై ఈ కోట ఉంది. కోట ప్రాకారాలు, బురుజులు అన్నీ కలిపి 25 వేల ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం కోట ఒక్కటే నాటి చరిత్రకు దర్పణంగా నిలుస్తుంది. కొండపల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని పంట పొలాలలో కూడా కోట తాలూకా చిన్నపాటి నిర్మాణాలు కనిపించటం చూస్తే ఈ కోట గత చరిత్ర ఎంతో ఘనమని అర్థమౌతుంది. వాస్తవంగానే కొండపల్లి కోట చరిత్ర అంతా, ఇంతా కాదు. శ్రీ కృష్ణదేవరాయలు అంతటి వాడు కూడా అంత సులభంగా ఈ కోటను కైవసం చే సుకోలేకపోయాడు. ఈ కోటకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పూర్వం 13వ శతాబ్దంలో అన వేమారెడ్డి ఈ కోటను నిర్మించారు. తొలుత రెడ్డి రాజులు, గజపతులు, ఆ తర్వాత మొఘలాయిలు, విజయనగర సామ్రాజ్యాధీశులు, నైజాం, బ్రిటీషు పాలకుల ఏలుబడిలో కొండపల్లి కోట కేంద్రంగా ఉంది. రెడ్డి రాజులు, గజపతులు , మొఘలాయిల కాలంలో ఈ కోటకు ఎంతో చరిత్ర ఉంది. యుద్ధాలతో ఈ కోట అట్టుడికేది. విజయనగర సామ్రాజ్యాధీశుడు ఈ కోటపై దండెత్తారు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో నేటి ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించిన కొండపల్లి వరకు అతి సునాయాసంగా అనేక రాజ్యాలను ఒడించిన శ్రీకృష్ణ దేవరాయులు కొండపల్లిని సులభంగా దండెత్తలేకపోయారు. కొండపల్లి కోటను హస్తగతం చేసుకోవటానికి ఆయన నేటి రాజధాని ప్రాంతంలో మకాం వేయాల్సి వచ్చింది. కృష్ణా వరదల వల్ల కొంత కాలం రాయలు యుద్ధ విరామం ప్రకటించారు. ఈ సమయంలోనే ఆయన స్వస్థలానికి వెళ్ళి ఆముక్త మాల్యద గ్రంధాన్ని రచించారని ప్రచారం ఉంది. వరదలు వెళ్ళాక మళ్ళీ దండెత్తి అప్పటి మొఘలాయిలను ఒడించారు. తర్వాత క్రమంలో బ్రిటీషు పాలకుల చేతిలోకి వెళ్ళిపోయింది. దాదాపుగా వంద సంవత్సరాల పాటు కొండపల్లి ఖిల్లా బ్రిటీషు సైనికుల శిక్షణా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత నిజాం అధీనంలోకి వచ్చింది. నిజాముల నుంచి కొండపల్లి కోటకు విముక్తి కలిగిన తర్వాత పురావస్తు శాఖ పరిధిలో సంరక్షణ జరుగుతోంది. కోట చాలా వరకు శిథిలమైంది. కొంత పునరుద్ధరించారు. కోటలో నాట్యశాల, దర్బారు హాలు, గుర్రాల శాల, కోనేరు వంటివి వీక్షించటానికి అవకాశం ఉంది. కోట బురుజులు ధ్వంసం అయ్యాయి. చారిత్రక విశేషాలను తెలుసుకోదలచిన పర్యాటకులకు ఇది చక్కటి ప్రదేశం. కొండపల్లి కోట పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కొండపల్లి కోటతో పాటు దాదాపుగా 27 వేల ఎకరాల విస్తీర్ణంలో దీని దిగువ అటవీ ప్రాంతం ఉంది. అద్బుతమైన చారిత్రక పర్యాటక ప్రాంతంగా ఇది భాసిల్లుతోంది.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి కోట ఉంది. బస్సులు, ప్రయివేట్ వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇబ్రహీంపట్నంలో వసతి సదుపాయం ఉంటుంది.

మచిలీపట్నం కోట :

బందరు కోట రెండు వందల సంవత్సరాలకు పైగా చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. ఈ కోట ముఖద్వారా అప్పట్లో చేప కంటి ద్వారా తయారు చేశారని చెబుతారు. భారీ తిమింగలం కన్నుతో దీనిని రూపొందించారని ప్రతీతి. విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో.. మచిలీపట్నంలో ఈ కోట ఉంది. 17వ శతాబ్దంలో ఈ కోటను నిర్మించారు. 16వ శతాబ్దంలో బ్రిటీషు, డచ్‌ దేశీయులు ముందుగా సముద్ర మార్గాన మచిలీపట్నం చేరుకున్నారు. తిరిగి 18వ శతాబ్దంలో ఇక్కడ సముద్రంలో జరిగిన పేలుడు వల్ల భారీ అలలు ఘంటసాల వరకు ఎగిసిపడి వెనక్కి వెళ్ళాయి. ఈ ఘటన తో దాదాపుగా ఆ రోజుల్లో 30 వేల మంది చనిపోయారు. ఈ క్రమంలో వేలాది మంది మత్స్యకారులతో పాటు బ్రీటీషువారు , డచ్‌ వారు చనిపోయారు. డచ్‌ వారి సమాధులు ఈ కోటలో ఉన్నాయి. కోట శిథిలమైనా వీరి సమాధులు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బందరులోనే ఆగ్రా తరహాలో ఒక తాజ్‌మహల్‌ ఉంది. ఒక బ్రిటీషు సైనికుడు బందరు యువతి ప్రేమించుకున్నారు. సైనికుడి కంటే యువతి వయసు పెద్దగా ఉందని ఆమె తల్లిదండ్రులు పెళ్ళికి అంగీకరించలేదు. అనుకోకుండా ఆ సైనికుడు తమ దేశం వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఆ యువతి అనారోగ్యం బారిన పడి మృతి చెందింది. దీంతో తల్లడిల్లిపోయిన ఆ సైనికుడు తమ దేశం నుంచి రసాయనాలను తెప్పించి ఆమె భౌతిక కాయానికి పూసి గుడి కట్టి అందులో ఉంచారు. ఇది చూడటానికి తాజ్‌ మహల్‌లా ఉంటుంది. తాను జీవించి ఉన్నంతకాలం ఆ సైనికుడు ఈ గుడికి వస్తూ ఉండేవాడు.

కళకారుల సౌరభం :

కృష్ణా జిల్లా కళాకారులకు పెట్టింది పేరు. పులి వేష నృత్యం కృష్ణాజిల్లా సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తోంది. మగవాళ్ళు మాత్రమే పులివేషాలు వేస్తారు. ముఖము, శరీరానికి రంగులు పులుముకుని పులిలా మారిపోతారు. డప్పుల ధ్వనుల మధ్య పులివేషంలో వీరు చేసే నృత్యం వీక్షించటానికి రెండు కళ్ళు చాలవు. అలాగే ’డప్పు’ నృత్యాలకు కూడా కృష్ణాజిల్లా ప్రాముఖ్యత కలిగి ఉంది. మేకతోలుతో డప్పులను తయారు చేస్తారు. పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఈ డప్పులను ధరించి చేసే నృత్యం ఎంతో హృద్యంగా ఉంటుంది. జాతరలు, పెళ్ళిళ్ళు, ఉత్సవాలలో డప్పు నృత్యాలు ఉండాల్సిందే.

బెజవాడలో బస, ఆతిథ్యం

కృష్ణాజిల్లాలో సందర్శనీయ ప్రాంతాలకు వచ్చేవారికి బెజవాడ ముచ్చటైన ఆతిథ్యం ఇస్తోంది. జిల్లాలోని సందర్శనీయ ప్రాంతాలకు వచ్చేవారు విజయవాడ వచ్చి కనకదుర్గమ్మను తప్పక దర్శించుకుంటారు, భవానీ ద్వీపం‌ వెళతారు. కాబట్టి పర్యాటకులకు బస, ఆతిథ్యం వంటివన్నీ విజయవాడలోనే కేంద్రీకృతమయ్యాయి. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో భవానీ ద్వీపం, హరిత బెర్మపార్క్‌లలో దాదాపుగా 70 వరకు కాటేజీలు ఉన్నాయి. రెస్టారెంట్స్‌ కూడా ఉన్నాయి. భవానీ ద్వీపంలో ట్రీ టాప్‌ కాటేజీలు కూడా ఉన్నాయి.

కృష్ణాజిల్లాలో పర్యావరణ సహిత పర్యాటక ప్రాజెక్టులు :

పర్యావరణ సహిత పర్యాటక ప్రాజెక్టులకు కృష్ణాజిల్లా కేంద్ర స్థానంగా ఉంది. విజయవాడలో కృష్ణానది మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన భవానీ ఐల్యాండ్‌ వంటి దీవులతో పాటు కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లు ఈ కోవలోకి వస్తాయి. కాంక్రీట్‌ జంగిల్‌కు దూరంగా కృష్ణానది మధ్యన భవానీ ఐల్యాండ్‌ , ఇతర దీవులు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఇస్తాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ పీల్చుకోవటానికి ఎంతో మంది పర్యాటకులు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి పది , పదిహేను రోజులు గడిపి వెళతారు. వేలాది ఎకరాలలో విస్తరించిన కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ ఔషధ మొక్కల కేంద్రంగా ఉంది. వైద్య పరిశోధనలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న ఔషధ మొక్కల ద్వారా ఎన్నో మెడి సిన్స్‌ తయారు చేస్తారు. ట్రెక్కర్ల ద్వారా వెలుగులోకి వచ్చిన వందలాది జలపాతాలు అబ్బుర పరుస్తాయి. కొల్లేరు సరస్సు, నాగాయలంక బ్యాక్‌ వాటర్‌ - మడ అడవులు, కృష్ణా శాంచురీ, బ్రహ్మయ్యలింగం చెరువు వంటి ప్రాంతాలు ఎకో టూరిజంగా కృష్ణాజిల్లాలో పరిఢవిల్లుతున్నాయి.

వాహ్‌.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌

విజయవాడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ ఉంది. దాదాపుగా 27 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ విస్తరించింది. వేలాది ఔషధ మొక్కల నిలయంగా కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ ఉంది. ఔషధ మొక్కలను పరిరక్షించ టానికి ఇక్కడి అటవీశాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతుంటారు. దేశ వ్యాప్తంగా పరిశోధనల కోసం వైద్య నిపుణులు ఇక్కడికి వస్తుంటారు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ అద్భుతమైన ఎకో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. రిజర్వు ఫారెస్ట్‌ వరకు ఇక్కడి వారికి తెలిసినా ఇందులో అనేక పర్యాటక అద్భుతాలు ఉన్నాయని వెలుగులోకి తెచ్చింది ట్రెక్కర్లు మాత్రమే. రెండేళ్ళ కిందట ఈ అడవిలోకి వచ్చిన ట్రెక్కింగ్‌ బృందాలు వందల సంఖ్యలో జలపాతాలు, మదిని హత్తుకుని రాతి అందాలు, ప్రకృతి రమణీయతతో కూడిన దృశ్యాలను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పారు. దీంతో అప్పటి నుంచి వేలాది మంది పర్యాటకులు వీకెండ్స్‌లో కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ను చుట్టి వస్తున్నారు. రాతి పొరలమీద దట్టమైన చెట్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొండరాళ్ళ మధ్య నుంచి వచ్చే జలపాతాలు కనువిందు చేస్తాయి. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, మూలపాడు, చెరువు మాధవరం వరకు కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ విస్తరించి ఉంది. ట్రెక్కర్లు గుర్తించిన వరకు 150 జలపాతాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా లోపల చాలా జలపాతాలు ఉన్నట్టు ట్రెక్కర్లు చెబుతున్నారు. వర్షాకాలంలో ఈ జలపాతాలు ఒక్కసారిగా చల్లటి నీటిని విరజిమ్ముతాయి. శీతాకాలం వచ్చే సరికి రంగరంగుల సీతాకోక చిలుకులు కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో సందడి చేస్తుంటాయి. ఈ దృశ్యాలను చూడటానికి రెండు కళ్ళు చాలవు. వేసవి, వర్షాకాలం, శీతాకాలం ఇలా మూడు కాలాల్లో కూడా ఈ ప్రాంతానికి వేలాది సంఖ్యలో పర్యాటకులు, ట్రెక్కర్లు వస్తుంటారు.

కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం :

కృష్ణా, గోదావరి నదుల సంగమానికి ప్రతీకగా పవిత్ర సంగమం ఇటీవల అభివృద్ధి చెందింది. ఇటు కృష్ణా, అటు పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాల్వ ద్వారా వచ్చే గోదావరి నీరు కలిసే చోట రూ. వెయ్యి కోట్ల వ్యయంతో అద్బుతమైన రివర్‌ ఫ్రంట్‌ మహా ఘాట్‌ను అభివృద్ధి చేశారు. ఒకేసారి లక్షమంది పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించవచ్చు. కృష్ణానది, గోదావరిల సంగమం చూడటం ఓ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. చుట్టూ పచ్చటి ప్రకృతి , ఒక వైపు కృష్ణానది, మరోవైపు గోదావరి నీళ్ళు చూడటానికే ఈ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే నదుల అనుసంధానాన్ని వీక్షించవచ్చు. పవిత్ర సంగమం నుంచి బోటింగ్‌ యూనిట్‌ ఉంది. కృష్ణానదిలో విహారం చేయటంతో పాటు కృష్ణానదిలోని సహజసిద్ధ దీవులు, ఆధ్మాత్మిక క్షేత్రాలను చూడవచ్చు.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం ఉంది. బస్సులు, ఇతర వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

ప్రకృతి ప్రేమికులను పిలుస్తోన్న నాగాయలంక :

విజయవాడ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో నాగాయలంక ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇదొక స్వర్గధామం. ఎగువున హంసల దీవి దగ్గర సముద్రంలోకి కృష్ణానది నీరు కలుస్తుంది. నాగాయలంక దగ్గర కృష్ణా బ్యాక్‌ వాటర్‌ ఉంటుంది. మత్స్యకారుల చేపల వేట ఈ ప్రాంతంలో ఎక్కువుగా ఉంటుంది. మడ అడవుల సొగసు చెప్పనలవి కాదు. కృష్ణా బ్యాక్‌ వాటర్‌ పై విహరిస్తూ మడ అడవుల అందాలను చూస్తున్న అనుభూతులను జీవితంలో మరువలేరు. సొర్లగొంధి దగ్గర డీఆర్‌డీఓ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటౌతోంది. నాగాయలంక లోనే కృష్ణా శాంచురీ ఉంది. అనేక సర్పజాతులు ఇక్కడ సంరక్షణ పొందుతున్నాయి. పక్షులు, జంతువులకు ఆవాసంగా ఉంది.

మనసు దోస్తున్న ‘మంగినపూడి బీచ్‌ :

కృష్ణాజిల్లాలోని బందరు బీచ్‌ మంగినపూడి బీచ్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్‌ సముద్రస్నానానికి చాలా అనువుగా ఉంటుంది. ఎంతో విశాలమైన బీచ్‌ కావడంతో పర్యాటకుల మనస్సులను ఎంతగానో దోచుకుంటుంది. మంగినపూడి అనే గ్రామం బంగాళాఖాతానికి ఆనుకుని ఉండడంతో ఈ బీచ్‌కు మంగినపూడి బీచ్‌ అని పేరు వచ్చింది. ప్రతి కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి నాడు లక్షలాది మంది యాత్రీకులు ఇక్కడ సముద్రస్నానాలు చేస్తారు. ఆదివారం యాత్రీకులతో ఈ బీచ్‌ కిటకిటలాడుతోంది. గతం కంటే ఇప్పుడు బీచ్‌ అభివృద్ధి జరగడంతో యాత్రీకుల సంఖ్య పెరుగుతోంది. మచిలీపట్నం నుంచి బీచ్‌ వరకు ఉన్న సింగల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చారు. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా బీచ్‌లో లైటింగ్‌, రీసార్ట్స్‌, తదితర సౌకర్యాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ గల నాగేశ్వరస్వామి దేవాలయం పురాతనమైనది. 1990లో దీనిని పునరుద్దరించారు. 1991 లో ఇక్కడ ఆంజనేయస్వామి మరియు గణపతి దేవాలయాలను ప్రతిష్ఠించారు. బీచ్‌కు వచ్చే యాత్రీకులు ఈ దేవాలయాలను భక్తితో సందర్శిస్తారు. అలాగే మంగినపూడిలో 1930 లో నిర్మించిన పాత లైట్‌హౌస్‌ స్థానంలో 1984 లో శక్తివంతమైన ఆధునిక లైట్‌ హౌస్‌ నిర్మించారు. 200 వోల్టుల శక్తితో 36 బల్బుల కాంతి సముద్రం లోపల 19 మైళ్ళ దూరం వరకు కనిపిస్తోంది. సముద్రంలో ప్రయాణించే ఓడలకు ఈ లైట్‌హౌస్‌ దిశా నిర్దేశం చేస్తోంది.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడకు 65 కి.మీ దూరంలో మచిలీపట్నం ఉండగా అక్కడ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న మంగినపూడి బీచ్‌‌కు వివిధ ప్రాంతాల పర్యాటకులు అమితంగా వస్తారు. వీరికి బస చేసేందుకు మచిలీపట్నంలో హోటళ్ళు, లాడ్జిలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతితో పాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కు అతి సమీపంలో గల బందరు బీచ్‌‌కు రోజు రోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి నేరుగా రావడానికి మచిలీపట్నం- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతిరోజు నడుస్తోంది.

పవిత్ర సాగర సంగమం :

కృష్ణాజిల్లా కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో సముద్రం, కృష్ణానది నీరు కలిసే చోటును పవిత్ర సంగమంగా ఆరాదిస్తున్నారు. ఈ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. సాగరసంగమంగా దీనికి నామకరణం చేశారు. ఇక్కడ స్నానాలు ఆచరిస్తే జన్మపాపాలు హరించుకు పోతాయనే నానుడి ఉంది. దీంతో ఇక్కడకు యాత్రీకుల రద్దీ పెరుగుతోంది. సాగర సంగమంలో స్నానం చేసి అక్కడ నుంచి హంసలదీవిలో దేవతలు నిర్మించిన దేవాలయంగా పేరొందిన వేణుగోపాలస్వామి దేవాలయంలో పూజలు ఆచరించడం ఇక్కడ పరిపాటి. కృష్ణానదిపై పులిగడ్డ-పెనుమూడి వారధి నిర్మాణం జరిగాక గుంటూరు తదితర జిల్లాల నుంచి యాత్రీకుల రాక పెరిగింది. అలాగే కృష్ణానదిపై బందరు సమీపంలో భవానీపురం-ఉల్లిపాలెం నడుమ నిర్మించిన మరో వారధి త్వరలో ప్రారంభం కానుంది. మచిలీపట్నంతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వాసులు ఈ వారధి నుంచి తేలిగ్గా సాగర సంగమానికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో గల మచిలీపట్నం పాండురంగస్వామి దేవాలయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. దీంతో ఈ రూటులో వెళ్ళే యాత్రీకులు పాండురంగస్వామి ని దర్శించుకునే అవకాశం ఉంది.

ఎలా వెళ్ళాలంటే...

నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగరసంగమానికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉన్నాయి. విజయవాడ నుంచి అవనిగడ్డ మీదుగా ఈ పవిత్ర సంగమానికి వెళ్ళొచ్చు. బస చేసేందుకు అవనిగడ్డతో పాటు రేపల్లె, మచిలీపట్నం పట్టణాలు అందుబాటులో ఉన్నాయి.

బ్రహ్మయ్యలింగం చెరువు :

విజయవాడ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో తోటపల్లి దగ్గర బ్రహ్మయ్యలింగం చెరువు ఉంది. ఈ చెరువును 1274 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు నలెవైపులా కొండ సానువులు, తోటలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పర్యాటకులకు ఈ ప్రాంతం చక్కటి విడిది కేంద్రం. వర్షాకాలంలో బ్రహ్మయ్యలింగం చెరువు నిండుకుండలా ఉంటుంది. ఈ సమయంలో కొత్త అందాలను సంతిరించుకుంటుంది. శతాబ్దాల నాటి బ్రహ్మయ్యలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ఇక్కడే ఉంది.

కృష్ణా తీరాన ఆధ్యాత్మిక కేంద్రాలు...
కృష్ణానది తీరంతో పాటు పలు పట్టణాలు, గ్రామాల్లో ప్రాశస్త్యంగల దేవాలయాలకు నిలయంగా కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పాండురంగస్వామి దేవాలయంతో పాటు కొల్లేరు పెద్దింట్లమ్మ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ, సింగరాయపాలెం, మోపిదేవిల్లో వేంచేసిన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాల్లో ఆధ్యాత్మికుల పాలిట సందర్శనక్షేత్రాలుగా చెప్పవచ్చు. అలాగే శ్రీకాకుళం శ్రీకాకుళాంధ్ర దేవాలయం, ఘంటసాల జలదీశ్వరస్వామి, సంగమేశ్వరస్వామితో పాటు వేదాద్రి, బలివే, నెమలి, కళ్లేపల్లిలతో తదితర మండల కేంద్రాలు, గ్రామాల్లోని దైవక్షేత్రాలు కూడా సందర్శనీయం. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో నిర్మించిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం కూడా దర్శనీయం. అనేక దేవాలయాలకు పొరుగు జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి సందర్శిస్తుంటారు. కృష్ణాతీరం వెంబడి అనేక శైవక్షేత్రాలు, విష్ణాలయాలు భక్తజనానికి ఆధ్యాత్మిక ఫలాలను పంచుతున్నాయి.

మచిలీపట్నం పాండురంగడు :

పండరీక్షేత్రవాసి పాండురంగడిని జిల్లా కేంద్రమైన మచిలీపట్నం చిలకలపూడిలో 1928సంవత్సరం విశాఖజిల్లా ఉత్తావిల్లినుంచి వచ్చిన టేకి నరసింహారావు అనే పాండురంగడుని భక్తుడు ఆరున్నర ఎకరాల్లో నిర్మించాడు. గర్భాలయం, మండపాలు, కోనేరుతో పాండురంగడి సన్నిధి భక్తులు దర్శించుకోదగినవి.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి సుమారు 70కిలో మీటర్ల దూరం ఉన్న మచిలీపట్నం చేరుకోవాలంటే ప్రతి గంటకు బస్‌ సౌకర్యం ఉంటుంది. అలాగే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బెంగుళూరు,హైదరాబాద్‌ల నుంచి రైలులో కూడా ప్రయాణించి బందరు చేరుకోవచ్చు. బందరు జిల్లా కేంద్రమైనందున పాండురంగడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అన్ని సౌకర్యాలతో ఉన్న వసతులు పొందవచ్చు. ఇక్కడ నుంచి ఆహ్లాదకరమైన మంగినపూడి బీచ్‌ సందర్శించి ప్రాముఖ్యత గల బందరు లడ్డూ రుచి చూడవచ్చు.

నడకుదురు శ్రీ పృధ్వీశ్వరుడు :

చల్లపల్లి మండలం నడకుదురులో కృష్ణానదీ తీరాన ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీపృధ్వీశ్వరస్వామి దేవాలయం. నరకాసురునికి మోక్షాన్ని ప్రసాదించిన ఈ క్షేత్రాన్ని నరకోత్తారక క్షేత్రంగా పిలుస్తారు. దేవలోక వనమాత పాటలీవృక్షం నేటి నడకుదురులో ఉండటం ఈ క్షేత్ర వైభవానికి చిహ్నంగా పేర్కొంటారు. ఇంద్రుని ఉద్యానవనంలోని దేవలోకంలోని పాటలీవృక్షాన్ని నరకోత్తారక క్షేత్రంలో నాటి, శ్రీలక్ష్మీనారాయణ (పృధీశ్వరుడు) స్వయంభువు విగ్రహాన్ని శ్రీకృష్ణుడు ప్రతిష్టించినట్లు చారిత్రక కధనం.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుండీ కృష్ణా కరకట్టమీదుగా నడకుదురు 55 కిలోమీటర్లు. కరకట్టమీద బస్‌దిగి కుడివైపుగా కొద్దిదూరం నడిచివస్తే దేవాలయానికి చేరుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారు విడిది చేసేందుకు ఇక్కడ వసతి సౌకర్యాలు లేవు. సమీపంలోని చల్లపల్లిలో వసతి తీసుకోవచ్చు. ఇక్కడ చల్లపల్లి రాజాకోట సందర్శించవచ్చు.

తెలుగు వెలుగు శ్రీకాకుళాంద్ర దేవాలయం :

భాషపై ఏర్పడిన తొలి దేవాలయం శ్రీకాకుళంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వరస్వామివారి దేవాలయం. ఆంధ్ర భాషపై ప్రీతి గల శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళంలో వేంచేసి ఆంధ్రమహావిష్ణువుగా ప్రతీతి. శ్రీకాకుళేశ్వరస్వామివారి ఆలయం పౌరాణిక, చారిత్రక ఆధారాలు కలిగిఉంది. క్రీ.పూర్వం 4వ శతాబ్దాంలోనే ఆంధ్రులు తొలిగా శ్రీకాకుళాన్ని రాజ్యస్థాపన చేసుకుని ఆంధ్రమహావిష్ణువు దేవాలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. 108 పుణ్యక్షేత్రాల్లో 57వ క్షేత్రంగా పురాణాల్లో పేర్కొన్న శ్రీకాకుళేశ్వరస్వామివారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుండి కృష్ణా కరకట్ట మీదుగా శ్రీకాకుళానికి 40 కిలోమీటర్ల దూరం. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విడిది చేసేందుకు ప్రత్యేకమైన కాటేజీలు లేవు. సమీపంలోని చల్లపల్లిలో బస చేయవచ్చు. ఉదయాన చేరుకుంటే దర్శనం చేసుకుని విజయవాడ తిరిగి వెళ్లేందుకు సమయం సరిపోతుంది.

దక్షిణకాశీ పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వరుని ఆలయం :

దివిసీమలోని పవిత్రమైన శివాలయాల్లో ప్రాచీనమైనది, చారిత్రాత్మకమైనది మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలోని శ్రీ దుర్గానాగేశ్వరుని ఆలయం. ఇక్కడ ఉత్తర వాహినిగా కృష్ణానది ప్రవహించుటచే ఈ ఆలయం దక్షిణకాశీగా పేరొందింది. కదళీవనంగా పేర్కొనబడి ప్రస్తుతం కళ్లేపల్లిగా మారింది. జనమేజయుడు సర్పయాగము చేసిన ప్రదేశంగా వశిష్టాధి మహార్షులు తపస్సు చేసిన తపోభూమిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. మహాసర్పాలు ప్రతిష్టించిన దివ్యలింగం కనుక నాగేశ్వరలింగంగా పరమేశ్వరుడు ఇక్కడ భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాడు.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి కరకట్ట మీదుగా మోపిదేవి చేరుకుని అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో పెదకళ్లేపల్లి గ్రామానికి ఆటోలు, ఆర్టీసీ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. విడిది చే సేందుకు ఆలయంలో లేవు, సమీపంలోని మోపిదేవిలో విడిది చేయవచ్చు.

భక్త కల్పవృక్షం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరాలయం :

భక్త కల్పవృక్షంగా ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరాలయం నిత్యపూజలతో విరాజిల్లుతోంది. పురాణ కాలంలో సుబ్రహ్మణ్యస్వామి దివ్య శక్తుల కోసం, కొన్ని దోషాల నుంచి విముక్తి కోసం ఇక్కడ సర్పాకారంలో ఉండి ఉగ్రతపస్సు చేసి తన తండ్రియైున ఈశ్వరుని అనుగ్రహం పొందారు. తనకు ప్రీతికరమైన ఈ ప్రదేశంలో సంచరించసాగాడు. ఇక్కడ ప్రాంగణంలో నాగలింగ పుష్పాలు పూసే వృక్షం ప్రత్యేక ఆకర్షణ. నాగదోషం తొలగిపోయేందుకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం, కుజ దోషం, నామకరణం, అక్షరాభ్యాసం, అన్నప్రాశనలకు భక్తులు విశేషంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తొలుత మోహినీపురంగా, నేడు మోపిదేవిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి కరకట్ట మీదుగా మోపిదేవికి 68 కిలోమీటర్ల దూరం. విడిది చే సేందుకు ఆలయంలో విశ్రమించే అవకాశంతోపాటుప్రైవేట్‌ లాడ్జిలు కలవు.

దేవతలు నిర్మించిన హంసలదీవి వేణుగోపాలుని ఆలయం :

కృష్ణానది చివరన సాగర సంగమానికి సమీపంలో హంసలదీవిలో వేణుగోపాలస్వామి భక్తులను అలరిస్తున్నారు. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారనేది ఈ ప్రాంతవాసుల అభిప్రాయం. ప్రాచీన కాలంలో హంసాకారంలో ఉండే ఒకరకమైన పక్షులు విహరించేవి కాబట్టి ఈప్రాంతాన్ని హంసలదీవి అని చెబుతుంటారు. ఆలయం గురించి అనేక మంది గ్రంథకర్తలు బహు విధాలుగా వర్ణించారు. దేవతల సంకల్పంతో ఆలయానికి గోపుర నిర్మాణం చేపట్టగా, ఉషోదయ రేఖలు కనిపించే సరికి కొంతమేరే కట్టగలిగారు. మనుష్యులకు కనిపించకూడదని దేవతలు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ గోపురం అసంపూర్తిగానే ఉంది. అనంతరం 200 సంవత్సరాల క్రితం చాణిక్యుల కాలంలో ఏడంతస్థుల గాలిగోపురం నిర్మించినట్లు శాసనాల ద్వారా వెలుగులోకి వచ్చింది. 1994లో దేవదాయశాఖ స్వాధీనం చేసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేశారు. సంతానం కోసం భక్తులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మాఘపౌర్ణమికి సాగర సంగమంలో పుణ్యస్నానాలు చేయటంతోపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి కరకట్ట మీదుగా అవనిగడ్డకు 75 కిలోమీటర్ల దూరం. అవనిగడ్డ నుంచి హంసలదీవికి 23 కిలోమీటర్లు. విడిది చే సేందుకు ఏలాంటి అవకాశం లేదు. సమీపంలోని కోడూరు, అవనిగడ్డల్లో బస చేయవచ్చు.

సాగరతీర దేవాలయం సంగమేశ్వరం :

సముద్రతీర ప్రాంతాలలో ప్రాచీన ఆలయాలలో సంగమేశ్వరంలోని శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం ఒకటి. కృష్ణానది, సాగరం కలిసే (సంగమం) చోటు కాబట్టి ఈ గ్రామానికి సంగమేశ్వరం అని పేరు వచ్చింది. 1085 సంవత్సరంలో ఈ సంగమేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రిక కథనం. క్రీ.శ.1231లో కాకతి గణపతి దేవుని గజసేనాని అయ్యప్పచే పునఃప్రతిష్టించబడినది. తిరిగి క్రీ.శ.1678లో అక్కన్న - మాదన్నలచే పునరుద్ధరణ చేయగా, అప్పటి దివి పాలకుడు భోగాది తిప్పానరెడ్డిరికం క్రింద మొదలుగా ధర్మకర్తృత్వం కొనసాగింది. ఆలయానికి రెండు వైపులా గంగాపార్వతీ, నాగేంద్రస్వామి ఆలయాలు ఉన్నాయి. గర్భాలయంలోని చిన్న పానవట్టం మీద ఉన్న శివలింగం పరమ పవిత్రంగా భావించబడి పూజలందుకుంటుంది. అర్థ మండపంలో ఉన్న బాలాత్రిపుర సుందరి, మహిషాసురమర్థిని విగ్రహాలు, కాలభైరవుని శిల్పం చూడచక్కగా ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినాల్లో సూర్యకిరణాలు సంగమేశ్వరునిపై ప్రసరిస్తాయి.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి కరకట్ట మీదుగా అవనిగడ్డకు 75 కిలోమీటర్ల దూరం. అవనిగడ్డ నుంచి సంగమేశ్వరానికి బస్సు సర్వీసు కలదు. దూరం 27 కిలోమీటర్లు. విడిది చే సేందుకు ఏలాంటి అవకాశం లేదు.సమీపంలోని నాగాయలంకలో బస చేయవచ్చు. ఇక్కడ కృష్ణానది ఒడ్డున శ్రీరామపాదక్షేత్రంలోని పలు దేవాలయాలను సందర్శించి కృష్ణలో స్నానమాచరించవచ్చు.

భక్తుల కొంగుబంగారం కొల్లేటి పెద్దింట్లమ్మ :

దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు సరస్సు మధ్యలో కొల్లేటికోట గ్రామంలో కొలువై ఉన్న శ్రీపెద్దింటి అమ్మవారు ఇక్కడ మత్స్యకారుల కులదైవంగా అమ్మవారిని కొలుస్తారు. వీరంతా పూర్వం ఒడిస్సా ప్రాంతం నుండి వలస వచ్చి కొల్లేరు సరస్సు చుట్టూ స్థిరనివాసం ఏర్పడ్చుకున్నట్లు చరిత్ర చెబుతుంది. శ్రీపెద్దింటి అమ్మవారు 9 అడుగులు ఎత్తు కలిగి విశాల నేత్రాలతో పద్మాసన భంగిమలో ఉన్న శ్రీపార్వతీదేవి ప్రతిరూపమే పెద్దింటమ్మ. అస్సాం, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శ్రీ పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సల్లు ప్రతి సంవత్సరం పాల్గున శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు నిర్వహిస్తారు. కాకతీయుల కాలంలో ’కోలనవీడు’, కొల్లేరని కూడా అనే వారు. చోళుల కాలంలో గంగగరుడనే రాజు పెద్దింటి అమ్మవారిని నిత్యం పూజించి, ఆరాధిస్తూ ఉండేవాడు. ఆయన కాలంలో కొలనవీడు అష్టైశ్వర్యాలతో తులతూగుతుండేది. కొల్లేటికోటలో వేంచేసియున్న పెద్దింటి అమ్మవారికి గోకర్ణపురాధీశుడు శ్రీగోకర్ణశ్వర స్వామి వార్ల కళ్యాణమహోత్సవాలు నిర్వహిస్తారు.

ఎలా వెళ్ళాలంటే...

కొల్లేటికోట పెద్దింట్లమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు విజయవాడ నుండి పలు రైళ్ళలో, ఆర్టీసీ బస్సులలో కైకలూరు చేరుకోవాలి. బస్సు లేదా ఆటోల ద్వారా కైకలూరు మండలంలోని ఆలపాడు గ్రామానికి చేరుకోవాలి. ఆలపాడు నుంచి సుమారు 7 కిలోమీటర్లు దూరంలో అమ్మవారి ఆలయం ఉన్నది. ఆలపాడు నుంచి 4 కిలోమీటర్ల దూరం ఆటోలపై ప్రయాణం చేసి సర్కార్‌ కెనాల్‌ నుంచి లాంచీలలో లేదా ఆటోలలో అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. భక్తులకు కొల్లేరు సరస్సులో సర్కార్‌ కాల్వపై వంతెన, లాంచీల ప్రయాణం, ఆధ్యాత్మికంగా కనువిందు చేస్తూ ఉంటాయి. పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను నుంచి పెద్దింట్లమ్మ ఆలయానికి చేరుకోవచ్చు. కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి దర్శనార్ధం వచ్చే భక్తులకు రాత్రి సమయాల్లో దగ్గరలో ఉన్న కైకలూరు ఉన్న వసతి గృహాల్లో బస చేయవచ్చు. అక్కడ నుంచి ఆటోల్లో, కారులో అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు.

బలివే :

కృష్ణాజిల్లా మసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసియున్న శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం దక్షిణకాశీగా పేరొంది. త్రీతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగంగా ప్రతీతి. రాముడుచే ప్రతిష్టించటంతో శ్రీరామలింగేశ్వరుడుగా పేరుంది. తమ్మిలేరు ఒడ్డున ఈ ఆలయం ఉంది. పశ్చిమగోదావరి, కృష్ణాసరిహద్దులో ఉండటంతో నిత్యం భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మహాశివరాత్రి ఉత్సవాల మూడురోజులు పలు జిల్లాల నుండి లక్షల్లో స్వామివారిని దర్శించుకుంటారు.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ నుంచి బలివే 70కిలో మీటర్లు ఉండగా ఏలూరుకు 20కిలో మీటర్ల దూరంలో ఉంది. బలి రామాస్వామి ఆలయంలో భక్తులు వసతి సౌకర్యం ఉంది.

సింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వరుడు :

సింగరాయపాలెం-చేవూరుపాలెం అడ్డరోడ్డు వద్ద వేంచేసియున్న శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ దేవస్థానం సందర్శనీయ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. 1954లో ఒక దేవతాసర్పాన్ని రాళ్లతో ఇద్దరు కొట్టగా మరణించిన నేపధ్యంలో పాపపరిహారంగా ఈ దేవస్థానం నిర్మితమైంది. అనంతరం 1987లో దేవస్థానాన్ని దేవాలయశాఖ స్వాధీనం చేసుకుంది.

ఎలా వెళ్ళాలంటే...

విజయవాడ, గుడివాడ మీదుగా గుడివాడ, ముదినేపల్లి, భీమవరం వెళ్లే నేషనల్‌ హైవే పక్కనే దేవస్థానం ఉంది. విజయవాడ నుంచి, ఇటు భీమవరం నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి సుమారు 70కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ దేవస్థానానికి వచ్చే భక్తులకు రవాణాసౌకర్యం మెండుగా ఉంది. వచ్చే భక్తులకు బస చేసే అవకాశం లేదు. గుడివాడ చేరుకుని బస చేయవచ్చు. ఉదయం బస్సు సౌకర్యం పొంది వచ్చే భక్తులు దర్శనం చేసుకుని సాయంత్రానికి వెళ్లిపోవచ్చు.

image-Icon చిత్రమాలిక :