ఇదీ మన శ్రీకాకుళం!

దేశంలో మరెక్కడా లేని అరుదైన ఆలయాలు శ్రీకాకుళం జిల్లాలో కొలువుతీరాయి. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు అరసవల్లిలో నిత్య పూజలందుకుంటున్నాడు. క్షీరసాగర మథనంలో మూపున మంధర పర్వతాన్ని మోసిన శ్రీకూర్మ నాథుడు శ్రీకూర్మంలో వెలిశాడు. భక్త జనావళికి అభయప్రదాలైన శైవ క్షేత్రాలు సిక్కోలు సీమ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నాలై అలరారుతున్నాయి.

పర్యాటకులను ఆకట్టుకోవడంలో రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మూడవ స్థానంలో ఉంది. ఏటా ఈ జిల్లాను వివిధ దేశాల నుంచి 78 వేల విదేశీ పర్యాటకులు, 20లక్షల స్వదేశీ పర్యాటకులు వస్తున్నారని అంచనా. రాష్ట్రంలో 13 జిల్లాలలో పర్యాటకులను ఆకట్టుకోవడంలో సిక్కోలు మూడో స్థానంలో ఉంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నాయి.....


చరిత్రకు ఆనవాళ్ళు...

బౌద్ధ యాత్రా స్థలం

Baudha Yatra

శాలిహుండం బౌద్ధులు విశిష్టమైనదిగా పరిగణించే ప్రదేశం. ఇక్కడ తవ్వకాల్లో అనేక విలువైన విగ్రహాలు, బౌద్ధ స్ధూపం, బౌద్ధ చైత్యం బయటపడ్డాయి. పురావస్తు శాఖవారు వాటిని భద్రపరచడానికి ఒక చిన్న మ్యూజియం కూడా ఏర్పాటుచేశారు. శాలిహుండం కొండ పక్కగా వంశధార నది ప్రవహిస్తూ ఉంటుంది. కొండ పైనుంచి చూస్తే వంశధార నది కళింగపట్నం వద్ద బంగాళాఖాతంతో కలిసే దృశ్యం లీలగా గోచరిస్తుంది. శాలిహుండం పరిసరాల్లో వీచే చల్లని గాలి, పచ్చని ప్రకృతి పర్యాటకులకు, యాత్రికులకు ఆహ్లాదం కలిగిస్తాయి.

ఎలా వెళ్ళాలంటే...

శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో శాలిహుండం ఉంది. శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గంలో అక్కడికి చేరుకోవచ్చు.

అలనాటి విశ్వవిద్యాలయం!

Alanati Viswavidhyalayam

శ్రీకాకుళం జిల్లాలో మరో ప్రముఖ బౌద్ధ కేంద్రం దంతవరపుకోట. కిందటి ఏడాది ఈ ప్రాంతాన్ని సందర్శించిన బౌద్ధ భిక్షువులు ఇది తమకు ఎంతో పవిత్రమైన ప్రదేశంగా పేర్కొన్నారు. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన స్థూపాలను పరిశీలిస్తే, నలందా బౌద్ధ విశ్వవిద్యాలయం మాదిరిగా ఇక్కడ కూడా ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం గతంలో ఉండి ఉంటుందని పరిశీలకుల అంచనా. ఇక్కడ జరుగుతున్న తవ్వకాలు పూర్తయితే మరిన్ని చారిత్రక విశేషాలు బయటపడగలవని పురావస్తు నిపుణులు చెబుతున్నారు.

ఎలా వెళ్ళాలంటే...

శ్రీకాకుళానికి సుమారు 24 కిలోమీటర్లు, ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్డు) రైల్వేస్టేషన్‌కు 10 కిలోమీటర్ల దూరంలో దంతవరపుకోట ఉంది. బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో అక్కడికి చేరుకోవచ్చు.

తరాలుమారినా చెరగని జ్ఞాపకాలు...

Mandhasa Rajavari kota

శ్రీకాకుళం జిల్లాలో మందస గ్రామాన్ని పూర్వం ‘మంజూష’ అని పిలిచేవారు. ‘మంజూష’ అంటే నగలపెట్టె అని అర్ధం. అనేకమైన నీటి వనరులతో సస్యశ్యామలమైన మందస ప్రాంతం ఆనవాళ్ళు క్రీస్తుశకం 850 సంవత్సరం నాటివి. ఇక్కడ మందస రాజావారి కోట, 700 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన వాసుదేవ పెరుమాళ్‌ ఆలయం ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇంకా ఈ గ్రామంలో బొట్టేశ్వరాలయం, జగన్నాథస్వామి ఆలయం, నర్సింహస్వామి, చండేశ్వరిస్వామి, గ్రామదేవత అన్నపూర్ణ ఆలయాలతో పాటు 20ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన మహేంద్రగిరి యాత్ర కూడా శివరాత్రికి మందస నుంచే ప్రారంభం కావడం విశేషం.

ఎలా వెళ్ళాలంటే...

మందస శ్రీకాకుళం నుంచి 94 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 194 కిలోమీటర్లు దూరంలో ఉంది. బస్సులు, రైలుమార్గం ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.

ఇవి చూసి తీరాలంతే!
రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ ఈ జిల్లాలోనే ఉంది. 193 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో చెప్పుకొదగ్గ, పర్యాటకులు విహరించడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. అంతేకాదు, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే నదీ- సాగర సంగమాలు అటు అందాలతో, ఇటు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తున్నాయి.

ఆద్యంత మనోహరం

kalingapatnam Beach

ఘనమైన చరిత్ర ఉన్న ప్రాంతం కళింగపట్నం బీచ్‌. ఈస్ట్‌ ఇండియా కంపెనీ మన దేశాన్ని పరిపారించిన కాలంలో ఇక్కడ మైనర్‌ పోర్ట్‌ ఉండేది. ప్రస్తుతం ఇక్కడి తీరప్రాంతం, లైట్‌హౌస్‌ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకంగా ఈ బీచ్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తీరం వద్ద ‘కళింగపట్నం బీచ్‌’ పేరుతో ఆర్చి నిర్మిస్తున్నారు. ఇరవై అడుగుల మేర నిర్మించబోతున్న ఈ ఆకృతిలో సిక్కోలు సంప్రదాయాలు ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పర్యాటకుల కోసం క్యాంటిన్‌, టాయిలెట్లు తదితర సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. బీచ్‌లో పరిసరాలను అందంగా మార్చేందుకూ, ముఖ్యంగా పిల్లల్ని ఆకట్టుకోవడానికీ ఇసుక తిన్నెలపై ఏనుగులు, జింకల కళాకృతులను సిద్ధం చేస్తున్నారు. కళింగపట్నానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న షేక్‌ మదీనా దర్గాలో ముస్లింలే కాదు, హిందువులు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

ఎలా వెళ్ళాలంటే...

శ్రీకాకుళం పట్టణం నుంచి 30 కిలోమీటర్లు,. విశాఖనగరం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో కళింగపట్నం ఉంది. విశాఖనుంచి రహదారి మార్గంలో శ్రీకాకుళం పట్టణం చేరుకోవాలి. అక్కడినుంచి బస్సు లేదా కారులో బీచ్‌కు వెళ్లవచ్చు. అదే రైలు మార్గంలో అయితే విశాఖ నుంచి రైలు ఎక్కి ఆముదాలవలసలో దిగాలి. అక్కడి నుంచి బస్సులో వెళ్లవచ్చు.

పుణ్యస్నాన స్థలి....

Punyasthali

మహేంద్రతనయ నది బారువ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి తదితర పర్వదినాల్లో లక్షలాది భక్తులు ఈ సముద్రతీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. బారువలో ప్రసిద్ధి చెందిన కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్ధనస్వామి ఆలయం ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి మొక్కల నర్సరీ ఉంది.

ఎలా వెళ్ళాలంటే...

విశాఖ నగరం నుంచి బారువ బీచ్‌కు దూరం 225 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి 109 కిలోమీటర్ల దూరంలో బారువ ఉంది. సోంపేటలో హైదరాబాద్‌, విశాఖపట్నం మీదుగా ప్రయాణించే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ లాంటి రైళ్ళు కొన్ని ఆగుతాయి. సోంపేట స్టేషన్‌లో దిగి అక్కడినుంచి వాహనంలో సుమారు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే బారువ బీచ్‌కు చేరుకుంటాం.

ఎవసతి...

పర్యాటకశాఖ 11 లక్షల వ్యయంతో నిర్మించిన టూరిస్ట్‌ హాలీడే రిసార్ట్‌లో పర్యాటకులు బస చేయవచ్చు.

విదేశీ పక్షుల విడిదులు
దేశాలు దాటి కిలకిలమంటూ తరలివచ్చే విహంగాలకు శ్రీకాకుళం జిల్లా ఆతిథ్యం ఇస్తోంది. శీతకాలం ఆరంభం నుంచి వేసవి కాలం వచ్చేవరకూ జిల్లాలో ఈ పక్షులు సందడి చేస్తూ, పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

‘రెక్కలపై తేలి’నీలాపురం!

Theli Nilapuram

తేలినీలాపురంలో సైబీరియన్‌ కొంగల విహారకేంద్రం ఉంది. ప్రతి సంవత్సరం ఆక్టోబర్‌ నుంచి మార్చి వరకు ఈ కొంగలు వలస వచ్చి తేలినీలాపురంలోని చెట్లపై గూళ్లు నిర్మించుకొని నివసిస్తూ, పర్యాటకులను అలరిస్తాయి. ఇక్కడ ఆటవీశాఖ ఒక అతిథి గృహాన్ని నిర్మించింది. పెలికాన్లు, ఓపెన్‌ బిల్ట్‌ స్టార్క్స్‌ (నత్తగొట్టు కొంగలు) లాంటి వంద రకాలకు పైగా విదేశీ పక్షులను ఇక్కడ చూడొచ్చు. స్థానికులకు ఈ పక్షులు ఒక సెంటిమెంట్‌. వాటి రక్షణ బాధ్యత వాళ్ళే తీసుకుంటారు.

ఎలా వెళ్ళాలంటే...

శ్రీకాకుళానికి 65 కిలోమీటర్లు దూరంలో, టెక్కలికి ఆరు కిలోమీటర్ల దూరంలో తేలినీలాపురం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. టెక్కలి రైల్వే స్టేషన్‌లో కొన్ని రైళ్ళకు హాల్టింగ్‌ ఉంది.

తేలుకుంచి..

Thelukunchi

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలుకుంచి గ్రామం విదేశీ పక్షుల విడిది కేంద్రంగా గుర్తింపు పొందింది. ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా దేశం నుంచి విదేశీ పక్షులు ఇక్కడికి తరలివస్తాయి. వీటిలో పెలికాన్‌, పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షులు ప్రధానమైనవి. ఇవి ఏటా జూన్‌లో తేలుకుంచికి వచ్చి జనవరి వరకు ఉంటాయి. వీటిని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు.

ఎలా వెళ్ళాలంటే...

ఈ గ్రామం శ్రీకాకుళం నుంచి 120 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 230 కిలోమీటర్లు, ఇచ్ఛాపురానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో కొన్ని రైళ్ళకు హాల్టింగ్‌ ఉంది.

వీటినీ ఓ లుక్కెయ్యాల్సిందే!

మెట్టుగూడ జలధార

Mettuguda Water Falls

సీతంపేట మండలం మెట్టుగూడ వద్ద జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపితే తిరిగి వెనక్కి వెళ్ళ బుద్ధి కాదు. కార్తీక వనభోజనాలకు ఎక్కువమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఐటీడీఏ పీవో శివశంకర్‌ చొరవతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పర్యాటకులు బస చేయడానికి ఒక భవనం, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు.

ఎలా వెళ్ళాలంటే...

శ్రీకాకుళం జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో, సీతంపేట మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో మెట్టుగూడ ఉంది.

సన్న ఖాదీది ఘనమైన ఖ్యాతి!

Pondhuru Sanna Khyadhi

పొందూరు సన్న ఖాదీ వస్త్రాలకు ప్రసిద్ధిగాంచింది. ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు నాణ్యతకూ, మన్నికకూ పేరుపొందిన పొందూరు ఖద్దరు పంచెలనే ధరించేవారు. ఈ ఖాదీ కేంద్రాన్ని సందర్శించిన ప్రముఖులలో మహాత్మా గాంధీ కుమారుడు దేవదాసు గాంధీ తదితరులున్నారు. ఇటీవల సన్న ఖాదీతో పట్టుదారం మిళితం చేసే కొత్త మగ్గాలను ఇక్కడ ఏర్పాటుచేశారు. అచ్చమైన ఖాదీతో తయారైన పంచెలు, వస్త్రాలు ఇక్కడ కొనుగోలు చెయ్యొచ్చు.

ఎలా వెళ్ళాలంటే...

శ్రీకాకుళం నుంచి 21 కిలోమీటర్లు, విజయనగరం జిల్లా రాజాం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. రాజాంలో కొన్ని రైళ్ళకు హాల్టింగ్‌ ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పొందూరు చేరుకోవచ్చు.