చరిత్రకు నిలువుటద్దం.. సహజ అందాల మందిరం.. విజయనగరం

ఘనమైన చరిత్ర, సంగీత సాహిత్యాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యం, అపురూపమైన ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు విజయనగరం. ఈ జిల్లాను తలుచుకోగానే రాజుల కోటలు గుర్తుకు వస్తాయి. విజయనగరం, బొబ్బిలి రాజవంశాలు, వారి పరిపాలన, 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం వంటి కారణాలతో ఈ జిల్లా చరిత్రలో నిలిచిపోయింది. సందర్శకులను ఆకర్షించే అందాలెన్నో విజయనగరం జిల్లా సొంతం. జలసిరితో అలలారే తాటిపూడి జలాశయంలో బోటు షికారు, పర్యాటకులకు ప్రశాంతతనిస్తూ చింతపల్లి వద్ద సాగరతీరం, పకృతి ప్రేమికులను ఆకర్షించే తోటపల్లి బ్యారేజి, కురుకూటి, దండిగాం జలపాతాలు... ఇలా ఒకటా రెండా విజయనగరం నిండా అందాలే అందాలు.

ఆధ్యాత్మిక కేంద్రాల విషయానికొస్తే.. విజయనగర రాజుల అడపడుచు పైడితల్లి ఆలయం, ఆ తల్లికి జరిగే సిరిమానోత్సవం, శ్రీరాముని అరణ్యవాసకాలం నాటి రామతీర్థ క్షేత్రం, విల్లు ఆకారంలో కనిపించే రామనారాయణంలో రామకథా చిత్రాలు, 60 అడుగుల ఆంజనేయుడు, రెండవ తిరుపతిగా పేరొందిన తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పుణ్యగిరి శివక్షేత్రంలో ఏడాది పొడుగునా ప్రవహించే పుట్టధార సందర్శన యాత్రీకులకు మరపురాని అనుభూతిని కలిగిస్తాయి.

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు, తెలుగు సాహిత్యానికి కన్యాశుల్కం వంటి ముత్యాలసరాలనెన్నిటినో అందించిన సాహితీవేత్త, సంఘసంస్కర్త గురజాడ అప్పారావు, దేహదారుఢ్యంలో కలియుగ భీమునిగా ఖ్యాతిగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు, ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు, అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, మధుర గాయని పి.సుశీల ఇలా ఎందరో కవులు, కళాకారులను తెలుగు నేలకు అందించిన కళాకేంద్రం విజయనగరం జిల్లా.

అటు చారిత్రక వారసత్వం, ఇటు సంగీత సాహిత్యాలు, మరోవైపు ఆధ్యాత్మికధామాల సమ్మేళనంతో పర్యాటకులకు చిరస్మరణీయ జ్ఞాపకాలను అందిస్తోంది విజయనగరం. ఆ విశేషాలు మీ కోసం...


గంట స్తంభం

Ganta-Sthambam

విజయనగరంలోని మరో ముఖ్య ఆకర్షణ గంట స్తంభం. బ్రిటిష్‌ రాజుల సందర్శనకు గుర్తుగా 68 అడుగులు ఎత్తుగల ఈ గంట స్తంభాన్ని 1885లో నగర నడిబొడ్డున నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణానికి 5,500 రూపాయల వరకూ ఖర్చయిందంటారు. పట్టణం మధ్యలో ఉన్న ఈ గంటస్తంభాన్ని ఆనుకుని ప్రధాన మార్కెట్లు ఉన్నాయి. చుట్టూ గడియారాలతో నగర ప్రజలకు సమయాన్ని తెలియజేస్తుంది.

ఎలా వెళ్ళాలంటే...

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్ల నుంచి సిటీ బస్సులు, ఆటోల్లో గంటస్తంభం వద్దకు చేరుకోవచ్చు.

బొబ్బిలి కోట

Bobbilli-Kota

విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణాన్ని పౌరుషానికి ప్రతీకగా చెబుతారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా తన వీరత్వాన్ని చాటిన తాండ్ర పాపారాయుడి ప్రతాపానికి సాక్ష్యంగా నిలిచింది బొబ్బిలి. ఈ రాజవంశం వారసుడైన రాజా ఆర్‌ఎస్‌ఆర్‌కె రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేశారు. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధ చిహ్నంగా జిల్లాలోని భైరవసాగరం వద్ద స్మారక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. బొబ్బిలి కోటలోని మ్యూజియంలో యుద్ధంలో వాడిన కత్తులు, బల్లాలు, కవచాలు, తుపాకులు, పల్లకీ, సింహాసనాలు భద్రపరిచారు. ఆ రోజుల్లో దర్బార్లు నిర్వహించడం కోసం ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు. ఈ దర్బార్‌మహాల్‌ కోటకు ఆకర్షణగా ఉంది. బొబ్బిలి రాజులకు చెందిన గెస్ట్‌ హౌస్‌కు గొప్ప ప్రాచుర్యం ఉంది. ఇప్పటికీ సందర్శకులు గెస్ట్‌ హౌస్‌ను చూసేందుకు వెళుతుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతూ ఉంటాయి.

ఎలా వెళ్ళాలంటే...

విజయనగరానికీ, బొబ్బిలికీ మధ్య దూరం 62 కిలోమీటర్లు. విజయనగరం మీదుగా రాయగడ వెళ్లే మార్గంలో బొబ్బిలి రైల్వే స్టేషన్‌ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా బస్సులున్నాయి.

తాటిపూడి జలాశయం

Tadipudi Lake

విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయం సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ‘ఎకో టూరిజం’ పేరిట అనేక అభివృద్ధి పనులు చేపడుతోంది. సందర్శకులు బస చేయడానికి వీలుగా కాటేజీలు ఏర్పాటు చేసింది. తాటిపూడి జలాశయంలో బోటు షికారు గొప్ప అనుభూతి. ఈ జలాశయం మధ్యలో గిరి వినాయక ఆలయం ఉంది. కాటేజీల సమీపంలో ఉన్న హోటల్‌లో చక్కటి వంటకాలు లభిస్తాయి. ముందుగా ఆర్డర్‌ ఇస్తే ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వంటకాలు కూడా తయారుచేసి వడ్డిస్తారు.

ఎలా వెళ్ళాలంటే...

విజయనగరానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుంచి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో తాటిపూడి ఉంది. హైదరాబాద్‌, విజయవాడ నుంచి వచ్చేవారు విశాఖలో లేదా విజయనగరంలో దిగి రోడ్డు మార్గంలో తాటిపూడి చేరుకోవచ్చు.

చింతపల్లి బీచ్‌

Chintapalli-Beach

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి బీచ్‌ మంచి పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ మండలంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న గోవిందపురం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్తే చింతపల్లి సముద్రతీరాన్ని చేరుకోవచ్చు. అక్కడ బ్రిటిష్‌ కాలం నాటి లైట్‌ హౌస్‌ ఉంది. గోవిందపురంలో ఉన్న ముక్తిధామంలో అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేస్తున్న శిల్పం ప్రధాన ఆకర్షణగా ఉంది.

ఎలా వెళ్ళాలంటే...

పూసపాటిరేగ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో గోవిందపురం వెళ్లే మార్గంలో చింతపల్లి బీచ్‌ ఉంది. చింతపల్లిలో బస చేసేందుకు టూరిజం శాఖ వారి కాటేజీలు ఉన్నాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది.

తోటపల్లి (గౌతు లచ్చన్న) బ్యారేజి

Gauthupalli Barage

ఆధ్యాత్మిక పర్యాటకులనూ, ప్రకృతి ప్రేమికులనూ సమానంగా ఆకర్షించే ప్రాంతం తోటపల్లి (గౌతు లచ్చన్న) బ్యారేజి. తోటపల్లిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నవారు ఈ పర్యాటక కేంద్రానికి వచ్చి ఆహ్లాదంగా గడుపుతుంటారు. పచ్చటి చెట్లూ, తోటలూ అబ్బురపరిచేలా ఉంటాయి. సందర్శకులు బస చేయడానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఏర్పాట్లు చేసింది.

ఎలా వెళ్ళాలంటే...

శ్రీకాకుళం నుంచి పాలకొండ- వీరఘట్టం మీదుగా, విజయనగరంనుంచి బొబ్బిలి, పార్వతీపురం మీదుగా, విశాఖపట్నం నుంచి బొబ్బిలి లేదా పాలకొండ మీదుగా తోటపల్లి చేరుకోవచ్చు. దూరం శ్రీకాకుళం నుంచి 75 కిలోమీటర్లు, విజయనగరం నుంచి 80 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి సుమారు 160 కిలోమీటర్లు.

కురుకూటి, దండిగాం వాటర్‌ఫాల్స్‌

Waterfalls

జలపాతాలకు పెట్టింది పేరు జిల్లాలోని సాలూరు మండలంలో ఉన్న కురుకూటి. ఇక్కడ సువర్ణముఖీ నది జలపాతం ఉంది. ఒడిశా నుంచి వస్తూ కురుకూటి సమీపంలో మైదాన ప్రాంతంలోకి నది ప్రవేశిస్తుంది. ఈ నది కురుకూటి వద్ద ఎత్తెన కొండ మీద నుంచి కిందికి దూకుతుంది. దీనికి సమీపంలో శిఖపరువు వాటర్‌ ఫాల్స్‌ ఉన్నాయి. బస్సులు, జీపుల్లో ఈ ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చు. అలాగే ఇదే నదిపై దండిగాం వద్ద మరో జలపాతం ఉంది. ఈ జలపాతం దగ్గర పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది.

ఎలా వెళ్ళాలంటే...

విజయనగరానికి 21 కిలోమీటర్ల దూరంలో సాలూరు ఉంది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో సాలూరు వెళ్ళి, అక్కడి నుంచి కురకూటి, దండిగాం చేరుకోవాలి.

విజయనగరం పైడితల్లమ్మ ఆలయం

Paidithalli Temple

సుప్రసిద్ధమైన గ్రామ దేవత పండగల్లో విజయనగరం పైడితల్లి అమ్మవారు జాతర ఒకటి. విజయనగర రాజుల అడపడుచు పైడితల్లి. పైడితల్లిని కోర్కెలు తీర్చే తల్లిగా. ఆరోగ్య ప్రదాయినిగా భక్తులు కొలుస్తారు. విజయదశమి(దసరా) తరువాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తారు. లక్షలాది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు.

పుణ్యగిరి శివ క్షేత్రం

Punyagiri Siva Kshethram

శృంగవరపుకోట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో పుణ్యగిరి శివ క్షేత్రం వుంది. దీనికి కాలి నడకన, మెట్లు ఎక్కుతూ వెళ్ళాల్సి ఉంటుంది. మార్గంలో మొదట ధారగంగమ్మ లోయ, జలపాతాలు కనిపిస్తాయి. ఈ లోయలో వున్న అమ్మవారిని గిరిజన దేవతగా పూజిస్తారు. తరువాత కోటి లింగాల రేవులో ఉన్న శివలింగాలమీద పైనుంచీ నీటి బిందువులు పడుతూ ఉంటాయి. చనిపోయిన వారి అస్థికలను ఇక్కడ నిమజ్ఞనం చేస్తారు. కొండపైకి చేరుకున్న తరువాత పుట్టధార వస్తుంది. ఈ ధార నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివలింగాల్ని తాకుతూ ప్రవహిస్తుంది. దీని ప్రవాహం ఏడాది పొడుగునా ఉంటుంది. ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. కొండల మధ్య కొలువైన శ్రీఉమాకోటి లింగేశ్వర స్వామి ఆలయం అత్యంత మనోహరంగా వుంటుంది.

ఎలా వెళ్ళాలంటే...

విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో, విజయనగరం నుంచి ధర్మవరం మార్గంలో 30 కిలోమీటర్లు, తాటిపూడి, జామి మార్గాల్లో 35 కిలోమీటర్ల దూరంలో శృంగవరపుకోట పట్టణం వుంది.

శ్రీరాముని అరణ్యవాసకాలం నాటి రామతీర్థం

Ramatheertham

విజయనగరం జిల్లాలో సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం. ఇక్కడ వెలసిన రామ దేవాలయం శ్రీరామచంద్రుని అరణ్యవాస కాలం నాటిదని చెబుతారు. ఈ పరిసరాల్లో ఆకర్షణీయమైన కొండకోనలున్నాయి. పర్యాటకులు శ్రీరాముడిని దర్శించి, ప్రకృతి అందాలను వీక్షించి ఆనందాన్ని పొందుతుంటారు.

ఎలా వెళ్ళాలంటే...

నెల్లిమర్ల మండల కేంద్రం నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో రామతీర్థం ఉంది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి చీపురుపల్లి రోడ్డులో దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరంలో నెల్లిమర్ల ఉంది. రామతీర్థం శీకాకుళం నుంచి పాలకొండ, రాజాం, చీపురుపల్లి మీదుగా, విశాఖపట్నం నుంచి విజయనగరం మీదుగా నెల్లిమర్ల చేరుకోవచ్చు.

తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం

Thotapalli Venkateswara Swamy Temple

రెండవ తిరుపతిగా పేరు పొందిన ఆధ్యాత్మిక స్థలం తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పక్కనే ప్రవహిస్తున్న నాగావళి నదిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. సమీపంలో ఉన్న తోటపల్లి జలాశయాన్ని వీక్షించి ఆహ్లాదాన్ని పొందుతుంటారు. తోటపల్లిని ఆధ్యాత్మిక కేంద్రంగా రూ. రెండు కోట్లతో పర్యాటక శాఖ అభివృద్ధి చేసింది.

విల్లు ఆకారంలో రామనారాయణం

Ramanarayanam Srimadramayana Pranganam

విజయనగరం జిల్లా కేంద్రానికి అయిదు కిలో మీటర్ల దూరంలో రామనారాయణం ఉంది. పైనుంచి చూస్తే విల్లు ఆకారంలో కనిపించే ఈ ఆలయంలో శ్రీరామ కథను వివరించే చిత్రాలు, 60 అడుగుల ఆంజనేయ విగ్రహం ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. భక్తిభావాలను ఇనుమడింపజేస్తూ మానసిక ప్రశాంతతను అందించే రామనారాయణం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

image-Icon చిత్రమాలిక :