గిరిజన గడపల దాకా సాహిత్య అకాడమీని తీసుకుపోతాం!

ABN , First Publish Date - 2022-01-24T09:24:10+05:30 IST

తెలంగాణ సాహిత్య అకాడమీ రెండో చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా జూలూరి గౌరీశంకర్‌తో ‘వివిధ’ చేసిన సంభాషణ.

గిరిజన గడపల దాకా సాహిత్య అకాడమీని తీసుకుపోతాం!

తెలంగాణ సాహిత్య అకాడమీ రెండో చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా జూలూరి గౌరీశంకర్‌తో ‘వివిధ’ చేసిన సంభాషణ.


తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఎంపికైనందుకు అభినందనలు. సాహిత్యం వైపు మీ ప్రయాణాన్ని గురించి చెప్పండి?

మాది నడిగూడెం. మేము వడ్రంగి వాళ్లం. వడ్ల బజారులో మా చినతాత పోతులూరి వీరబ్రహ్మంగారి విగ్రహం తయారు చేసి దేవాలయం కట్టాడు. చిన్నప్పుడు ఆ భజనలు చేసుకుంటూ బ్రహ్మంగారి తత్వాలు, కీర్తనలు నేర్చుకున్నాను. మా నాయన రామాయణ కురుక్షేత్ర పద్యాలు అద్భుతంగా పాడేవాడు. ఆయన శైవభక్తుడు కాబట్టి నాకు గౌరీ శంకర్‌ అని పేరు పెట్టాడు. నుదుటిన విబూది, కుంకం బొట్లతోనే నేను 1976-77 ప్రాంతంలో ఇంటర్మీడియట్‌ చదువుకోసం కె.ఆర్‌.ఆర్‌ కాలేజీలో అడుగు పెట్టాను. అక్కడ ‘విప్లవాల యుగం మనది విప్లవిస్తే జయం మనది’, ‘ఎరుపెక్కిన మట్టికి క్రొన్నెత్తుటి లాల్‌ సలామ్‌’ లాంటి నినాదాలు తొలిసారి విన్నాను. అలా ఆ కాలేజీలోనే వామపక్ష ఉద్యమాల ప్రభావం నాపై పడింది. నా దస్తూరీ బాగుండటంతో ఒకాయన నన్ను చేయి పట్టుకుని తీసుకుపోయి ‘‘చాలా బాగా రాస్తున్నావు, మనం ‘వాల్‌ జర్నల్‌ ఆఫ్‌ పీడీఎస్‌యూ’ అని ప్రతి వారం ఫోకస్‌ పెడుతున్నాం, అది నువ్వే రాయాలి,’’ అన్నాడు. ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీలో వచ్చే జాతీయ వార్తల్ని కట్‌ చేసి తెలుగులో అనువదించి చేసి రాస్తే మా కాలేజీ అంతా గోడలపైకి ఎగబడి చదివేది. ఇది నా అక్షర యాత్రకి ఆరంభంగా చెప్పుకోవచ్చు. తర్వాత ‘ముత్యాలముగ్గు’ సినిమాకి మాటలు రాసిన ఎమ్వీయెల్‌ ఒకసారి కాలేజీకి వచ్చి కవిత్వ అభివ్యక్తి గురించి మాట్లాడాడు. అలిశెట్టి ప్రభాకర్‌ ‘వేశ్య’ కవిత గురించి మాట్లాడాడు. ‘‘తాను పుండై/ ఇతరులకు పండై/ తాను శవమై/ ఇతరులకు వశమై...’’ ఇదంతా అప్పటి ఇంటర్మీడియెట్‌ విద్యార్థినైన నాపై చాలా ప్రభావం చూపించింది. ‘కవిత్వం అంటే ఇలా ఉంటుందా’ అనిపించింది. మా కాలేజీ సెమినార్లకు, మా ప్రాంతంలో జరిగే సదస్సులకు విప్లవ కవులూ రచయితలూ వచ్చి ప్రసంగించేవారు. వీరితో పాటు మాకు తెలుగు చెప్పే పంతుళ్లూ... అన్నిటినీ మించి నా బహుజన జీవితం... ఈ ప్రేరణలన్నీ కలిసి నన్ను కవిత్వం వైపు నడిపించాయి. తెలుగులో అత్యధికంగా ముప్ఫైకి పైగా దీర్ఘ కవితలు రాసినవాడిని నేనే. కవిత్వమేగాక వందల కొలది సాహిత్య విమర్శ, సామాజిక వ్యాసాలు రాశాను.


ఈ విప్లవోద్యమ ప్రభావం నుంచి దళిత బహుజన కవిత్వం వైపు అడుగులెలా పడ్డాయి?

ఎస్‌.కె. యూనివర్సిటీ నుంచి 1985లో నా ఎమ్మే పూర్తి చేశాను. తర్వాత పదేళ్ళపాటు పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌గాను, జర్నలిస్టుగాను పని చేశాను. 1991లో ఖమ్మం జిల్లా పగిడేరులో ఒక ఎన్‌కౌంటర్‌ జరి గింది. ఒక్కసారే పద్నాలుగు మందిని కాల్చేశారు. ఆ సంఘటన గురించి ఆనాటి దినపత్రికల్లో వచ్చిన నెత్తురుముద్దల్లాంటి వార్తలు నన్ను చాలా కలచివేశాయి. ఆ రోజు ఎగ్జామినేషన్‌ హాల్లో విద్యా ర్థులేమో పరీక్ష రాస్తుంటే నేను అంతకంటే దీక్షగా ఒకే విడతలో గుక్కపట్టినట్టు ఒక దీర్ఘకవిత రాశాను. ‘ఎలియాస్‌’ దాని పేరు. ‘‘ఆకలి ఎలియాస్‌- ఆయుధాలు... ఆయుధాలు ఎలియాస్‌- ప్రజలు...’’ ఇలా సాగుతుందది. దాన్ని పుస్తకంగా నేను పాఠాలు చెప్తున్న కాలేజీలోనే శివారెడ్డి ఆవిష్కరించారు. ఆ మరుసటి ఏడాదే ‘పాద ముద్ర’ అని మరో దీర్ఘ కవిత రాశాను. అప్పుడే ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీకి సంబంధించిన సంకేతాలు, దేశవ్యాప్త పరిణామాలు, అంబేడ్కర్‌-ఫూలేలను అప్పుడప్పుడే చదువుకోవటం వీటన్నిటి నేపథ్యంలో- శ్రమ కోణం నుంచి దళిత తాత్వికతను చెబుతూ ఆ కవితను రాశాను. ‘‘కోడికంటే ముందే లేచిన కాళ్లూ చేతులూ సరాసరి గొడ్లకొట్టంలోకే పోయాయి’’ అని మొదలవుతుంది. మొదట ‘పాదముద్ర’పై ఆంధ్రజ్యోతిలో రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ‘దళిత కవితా ముద్ర ‘‘పాదముద్ర’’’ అన్న సుదీర్ఘ విశ్లేషణా వ్యాసం రాశారు. అది ఒక మలుపు. గుంటూరు లక్ష్మీనరసయ్య అప్పుడే దళిత సాహిత్య విమర్శవైపు వస్తున్నాడు. ఆయన దళిత సాహిత్య విమర్శకుడిగా తొలి ముందుమాట రాసింది నా ‘పాదముద్ర’కే. అప్పట్లో ఆయన ప్రతివారం ఆంధ్రజ్యోతిలో కవిత్వం గురించి రాసేవాడు. ఒక వారం నా కవిత గురించి ‘‘కొన్ని మినహాయింపు లున్నప్పటికీ, జూలూరి రాసిన ‘పాదముద్ర’ దళిత కవిత్వానికి మేనిఫెస్టోగా చెప్పుకోవచ్చు’’ అని రాశాడు. దానికి సతీష్‌ చందర్‌ రియాక్ట్‌ అయ్యాడు. ‘‘ఎవరో విశ్వబ్రాహ్మణుడు రాస్తే అది దళిత కవిత్వం ఎలా అవుతుంది. దానికి ఇంకెవరో నాయీ బ్రాహ్మణుడు విమర్శ రాస్తే అది దళిత విమర్శ ఎట్లా అవుతుంది’’ అన్నాడు. తర్వాత 1995లో వచ్చిన ‘చిక్కనవుతున్న పాట’ సంకలనంలో 32 పేజీల ‘పాదముద్ర’ని యథాతథంగా వేశారు. ఆ పుస్తకాన్ని సంకలించే పనిలో కోదాడ నుంచి నా వంతు భూమికని నేను నిర్వహించాను. ఆ పుస్తకం వచ్చిన తర్వాత దాన్ని నేను సతీష్‌ చందర్‌కి తీసుకు పోయి ఇచ్చాను. ‘‘బావుంది గౌరీశంకర్‌ మీరు రాయటం. కానీ ఎవరి ఫీలింగ్స్‌ వారు రాయాలి గానీ, మా ఫీలింగ్స్‌ నువ్వెట్లా రాస్తావు’’ అన్నాడు. ‘‘నేను చూసిందానికి నేను రియాక్ట్‌ అయి రాశాను సర్‌. కానీ మీరన్నది కూడా కరెక్టే. నా మూలాల్ని నేను రాసుకుని మళ్లీ మీ దగ్గరకు వస్తా’’ అని వెళ్లిపోయాను. తర్వాత ఆరేళ్లకు 2001లో ‘వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు’ పేరుతో 200పేజీల సంకలనాన్ని తీసుకువచ్చాను. అది 29కులాలను ఐక్యం చేస్తూ బహుజన దృక్పథంతో వచ్చిన తొలి పుస్తకం. అది తీసుకు పోయి సతీష్‌ చందర్‌కి ఇచ్చాను. 


ఈ సంకలనం తర్వాత తెలంగాణ ప్రాంతీయ స్పృహతో మీరు తెచ్చిన ‘పొక్కిలి’ సంకలనం గురించి?

‘వెంటాడే కలాలు - వెనుకబడిన కులాలు’ వచ్చిన తర్వాత ఒకసారి గుడిపాటిని కలిస్తే ఆయన నా సంకలనంపై రాసిన వ్యాసం చదవమని ఇచ్చాడు. అందులో ఒక వాక్యం- ‘‘రెండు మూడు దశాబ్దాలుగా నాకు తెలిసి ఒక తెలంగాణ వాడు ఒక పుస్తకానికి సంపాదకత్వం వహించడం ఇదే తొలిసారి’’ అని ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ‘‘ఏంటి ముప్ఫయ్యేళ్లుగా ఒక్కడూ లేడా!’’ అనిపించింది. ‘‘మరి తెలంగాణ కవిత్వం సంగతేమిటీ?’’ అన్నాను. ‘‘అవును కదా!’’ అన్నాడాయన. అప్పటికే 1997లో ‘నా తెలంగాణ’ అని ఒక దీర్ఘకవిత రాసివున్నాను. అప్పటికే ఈ మట్టి నుంచి చిన్నగా తెలంగాణకు సంబంధించిన ప్రశ్నలు లేస్తున్నాయి. ‘నా తెలంగాణ’ దీర్ఘకవితను భువనగిరి డిక్లరేషన్‌ సభలో ఆవిష్కరిం చడం జరిగింది. అదే సభలో అది రెండు వేల కాపీలు అమ్ముడ య్యింది. ‘‘అట్లైతే తెలంగాణ సంకలనం ఎందుకు తేకూడదూ మనం’’ అన్నాను నేను గుడిపాటితో. అప్పటికే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్రరాజు, కాసుల ప్రతాపరెడ్డి ఈ దిశగా కొంత పని మొదలుపెట్టారని చెప్పాడు గుడిపాటి. సరే నా ప్రయత్నం నేను చేద్దాం అని చెప్పి- గుడిపాటి దగ్గర మొత్తం తెలంగాణ కవులు, రచయితల అడ్రసులు సంపాదించి, అందరికీ ఫోన్లు చేసి కవితల్ని సేకరించి, ‘పొక్కిలి’ పేరుతో మొత్తం 129మంది కొత్త తరం తెలంగాణ కవులతో 400 పేజీల సంకలనం ప్రచురించాను. మలి దశ ఉద్యమానికి వచ్చిన తొలి కవిత్వ సంకలనం ‘పొక్కిలి’. 1934లో సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ కవుల సంచిక’ తెచ్చిన అరవై ఏళ్ల తర్వాత తెలంగాణకు సంబంధించి వచ్చిన కవిత్వ సంకలనం ‘పొక్కిలి’. ఆ తర్వాత 600 పేజీలతో ‘మత్తడి’ వచ్చింది.


‘పొక్కిలి’ తర్వాత మీరు విస్తృతంగా పుస్తకాలు ప్రచురించారు. వాటి గురించి చెప్పండి?

‘పొక్కిలి’ తీసుకువచ్చిన తర్వాత హైదరాబాద్‌ వచ్చి ఆంధ్రప్రభ స్టేట్‌ బ్యూరోలో రిపోర్టరుగా జాయినయ్యాను. రిపోర్టింగ్‌ చేస్తూనే తెలంగాణ ఉద్యమ, సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాను. సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించినవి, విద్యావేత్త చుక్కారామయ్యకు సంబంధించినవి, ఇంకా అనేక కవితా సంకల నాలు, దళిత-బహుజన వాదాలపై పుస్తకాలు... మొత్తంగా 250కి పైగా పుస్తకాలను అచ్చువేశాను. ఇందులో నా సంపాదకత్వంలోని పుస్తకాలతోపాటు, వేరే రచయితల పుస్తకాలూ ఉన్నాయి. 2007లో తెలంగాణ రచయితల వేదికకు ప్రధాన కార్యదర్శిగా నన్ను నియ మించారు. అప్పటికే జర్నలిజానికి కాస్త కాస్త దూరమవుతూ వచ్చాను. ఇక ఇలా ప్రధాన కార్యదర్శిగా నియమితమయ్యాక పూర్తిగా వదిలివేశాను. పూర్తిగా తెలంగాణ ఉద్యమానికి సంబం ధించిన పుస్తకాల ప్రచురించటంలోను, నేరుగా ఉద్యమంలో పని చేయటంలోను నిమగ్నమయ్యాను. తెలంగాణ రచయితల వేదికకు 2007 నుంచి 2011 వరకు ప్రధాన కార్యదర్శిగాను, 2011 నుంచి 2014 జూన్‌ 2 వరకు అధ్యక్షుడి గాను పని చేశాను. ఈ మధ్య కాలంలోనే 42రోజుల చారిత్రాత్మక ‘సకల జనుల సమ్మె’ జరిగింది. ఆ సమ్మె మొత్తం ఏ రోజుకారోజు డాక్యుమెంటేషన్‌ చేస్తూ 1600 పేజీలతో ‘ఆ 42 రోజులు’  పేరిట రెండు సంకలనాలు తీసుకు వచ్చాను. అప్పట్లోనే టాంక్‌బండ్‌ మీద విగ్రహాలు విరిగాయి. ఆ విరుగుడును సమర్థిస్తూ, బలపరుస్తూ వచ్చిన వ్యాసాలతో ‘విరుగుడు’ అని ఓ పుస్తకం తెచ్చాను.      


సాహిత్య అకామీ చైర్మన్‌గా మీ విజన్‌ ఏమిటి, మీరు చేపట్టదలచిన కార్యక్రమాలు ఏమిటి?

తెలుగు భాషకు నిఘంటువుల చరిత్ర చాలా పెద్దదే. గణప వరపు వెంకటకవి రచించిన ‘వెంకటేశాంధ్రము’ 1684లో వచ్చిన మొదటి నిఘంటువు అంటారు. 1816లో మామిడి వెంకటాచార్యులు కూర్చిన ‘ఆంధ్ర దీపిక’ నుంచి నలిమెల భాస్కర్‌, రవ్వా శ్రీహరుల తెలంగాణ పదకోశాలు దాకా నిఘంటువులకు విస్తృత చరిత్ర ఉంది. భాషలో మార్పులు నిరంతరంగా వేగవంతంగా జరుగు తాయి. పురాతన కాలం నుంచి ఆధునిక అత్యాధునిక కాలం వరకు పలుతరహాల నిఘంటువులు సుమారు 25 దాకా వచ్చాయి. వీటన్నింటిని ఒక దగ్గరకు చేర్చి నిఘంటువులు తెచ్చేందుకు సాహిత్య అకాడమీకి తోడుగా తెలుగు విశ్వవిద్యా లయం, తెలుగు అకాడమీలు కలిసి సంయుక్తంగా కలిసి పని చేయాల్సి ఉంది. వీటిని తయారుచేసి విండోస్‌, లినక్స్‌, మ్యాక్‌, ఏండ్రాయిడ్‌ వంటి ఏ వేదిక మీదనైనా దీన్ని ఉపయోగించు కునేలా చేసి ఐపాడ్‌, ట్యాబ్‌, స్మార్ట్‌ ఫోన్లలో అందుబాటులో ఉండేలా చేయాలన్నది తలంపు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దుతాం.  


విస్మరణకు, అణచివేతకు గురైన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకువస్తాం. రైతు సంకలనాలు, పర్యావరణంపై సంకలనాలు, అస్తిత్వ ఉద్యమాలపై సంకలనాలు తీసుకువస్తాం. ఇంతకు ముందు వచ్చిన గోల్కొండ కవులు సంకలనం నుంచి పొక్కిలి, మత్తడి వంటి సంకలనాల దాకా మళ్లీ ముద్రిస్తాం. సకల వృత్తులకు సంబంధించి కవిత్వ, కథా సంకలనాలను తీసుకు వస్తాం. అస్తిత్వ ఉద్యమాలపై వచ్చిన కవిత్వ కథా సాహిత్యాన్ని రికార్డు చేస్తాం. తెలుగునుంచి ఇంగ్లీషులోకి, భారతీయ భాషల లోకి అనువాదంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. తెలంగాణ నాటకంపై మూడువేల పేజీల వివరాలు భద్రంగా ఉన్నాయి. ఆ మెటీరియల్‌ తీసుకొని ప్రచురిస్తాం. తెలంగాణ కథ, నవల, జీవిత చరిత్ర, సాహిత్య విమర్శలపై దృష్టిపెడతాం. తెలంగాణ సాహిత్య అకాడెమీని జిల్లా స్థాయి దాకా, మండల స్థాయి దాకా తీసుకుపోయేలా కృషి చేస్తాం. అవసరమైతే విద్యాశాఖామంత్రితో మాట్లాడి అన్ని గవర్నమెంటు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలోని తెలుగు శాఖలతోటి అనుసంధానం అవుతాం. తెలంగాణ సాహిత్యంపై ఊరూరా సెమినార్లు నిర్వహిస్తాం. 


తెలంగాణలో గిరిజన ఆదివాసీ ప్రాతినిధ్యం కూడా ఎక్కువే ఉంది. వారి సంస్కృతిని మీ పరిధిలోకి ఎలా తీసుకో బోతున్నారు?

సాహిత్య అకాడమీని గిరిజన గూడేల గడపల దాకా తీసుకు వెళ్తాం. గిరిజన, ఆదివాసీలనుంచి కూడా ఇప్పుడు బ్రహ్మాండమైన టువంటి అస్తిత్వ ఉద్యమ సాహిత్యం వస్తుంది. తెలంగాణలో ముప్ఫై నలభై గిరిజన తెగలున్నాయి. వీరందరి మౌఖిక సాహిత్యాన్ని రికార్డు చేయటం, దానిపై కొత్త పరిశోధనలు చేయటం కూడా మా దృష్టిలో ఉన్న ముఖ్యమైన పని. దీనికి ప్రత్యేకమైన యంత్రాంగం కావాలి. ప్రత్యేక విభాగం కావాలి. ఆ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సహాయ సహకారాలు కావాలి. సంబంధించిన జిల్లాల కలెక్టర్లు, డీయీవోలు... వీరందరితోను సమన్వయం చేసుకోవాలి. ఈ విషయంలో కూడా కృషి చేస్తాం. 


మీ సొంత రచనా వ్యాసంగం ఏ దిశగా సాగనున్నది?

నా రాత కంటే సంస్థ పనికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. తర తరాలుగా వెనకబడ్డ అట్టడుగు బహుజన వర్గానికి చెందిన ఒక వడ్రంగికి సాహిత్య అకాడమీ వంటి పెద్ద బాధ్యతను తీసుకొచ్చి ఇవ్వడమన్నది ఇప్పటివరకూ జరగలేదు. కేసీఆర్‌ సాహిత్యవేత్త కాబట్టే ఇది జరిగింది. కాబట్టి నా పని ఎంత చేయగలనో అది ఈ సంస్థ కోసమే చేస్తాను. వండ్రంగి నాగలిని చెక్కినట్టు సాహిత్య అకాడమీ కార్యక్షేత్రంలో ఒక కార్యకర్తగా పని చేస్తాను. మన సంస్కృతికి ప్రాణప్రదమైన పద్యాన్ని గద్యాన్ని విమర్శను ఆధునిక అత్యాధునిక ధోరణులతో వచ్చిన అస్తిత్వవాద సాహిత్య గొంతుకల్ని రికార్డు చేయటం, ఆయా రంగాలకు సంబంధించిన వారితో మేధో మథనం చేసి రచనల పరంపరను కొనసాగిస్తాం. ఇది అందరం కలిసి చేసే పని. సబ్బండ వర్ణాల సంస్కృతిని సామూహికంగా ఆవిష్క రించే పనే సాహిత్య అకాడమీ పని.             

Updated Date - 2022-01-24T09:24:10+05:30 IST