ఉత్కంఠ !

ABN , First Publish Date - 2021-07-26T05:14:17+05:30 IST

స్థానిక సంస్థలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నదనే దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది.

ఉత్కంఠ !

స్థానిక సంస్థల ఫలితాల కోసం ఎదురుచూపు

రేపు హైకోర్టు తీర్పు


నెల్లూరు(జడ్పీ), జూలై 25 : స్థానిక సంస్థలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నదనే దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగి మూడు నెలలు దాటింది. కౌంటింగ్‌ నిలిచిపోయి ఫలితాలు సందిగ్ధంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈనెల 27న ఫలితాలపై  న్యాయంస్థానం తీర్పు ఎలా ఉండబోతున్నదన్న ఉత్కంఠ అటు అభ్యర్ధుల్లోనూ, ఇటు ఓటర్లలోనూ నెలకొని ఉంది. 


మూడు నెలలుగా నిరీక్షణ

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై మూడు నెలలుగా రాజకీయ పార్టీల్లోనూ నిరీక్షణ కొనసాగుతోంది.. ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించినా, మిగతా పార్టీలు పాల్గొన్నాయి. .జిల్లాలోని 46 మండలాలకు ఏప్రిల్‌లో ఎన్నికల కమిషన్‌ ఎన్నికలను నిర్వహించింది. 46 జడ్పీటీసీ స్థానాలకుగాను 12 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 34 స్థానాలకు పోటీ జరిగింది. 140 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే 554 ఎంపీటీసీ స్థానాలకు 188 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 366 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ స్థానాల్లో 972 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరించగా, ఆ పార్టీలో కొంతమంది అభ్యర్థులు పోటీ చేశారు. అలాగే ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసినా ఫలితాలు వెలువడలేదు.


అందరిచూపు కోర్టువైపే...

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వ్యవహారం న్యాయంస్థానంలో ఉండడంతో అందరి చూపు కోర్టు వైపే ఉంది. ఎన్నికలు ముగిసినప్పటికినీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేసింది. దీంతో ఎన్నికల కమిషన్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే విధిస్తూ ఈనెల 27న ఫలితాలపై విచారణ చేపట్టి తీర్పును ఇవ్వాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిర్ణయించింది. దీంతో మంగళవారం వెలువడే హైకోర్టు తీర్పు ఎలా ఉండనున్నదనే దానిపై అందరి దృష్టి ఉంది. 

Updated Date - 2021-07-26T05:14:17+05:30 IST